US Accident | అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఏపీకి చెందిన దంపతులు దుర్మరణం చెందారు. వాషింగ్టన్లో వారు ప్రయాణిస్తున్న కారును వేరొక వాహనం ఢీకొనడంతో పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లుకు చెందిన సాఫ్ట్వేర్ ఇంజినీర్ దంపతులు కృష్ణకిశోర్ అలియాస్ టిన్ను (45), ఆశ (40) దంపతులు ప్రాణాలు కోల్పోయారు. వారి కుమార్తె, కుమారుడు తీవ్రంగా గాయపడ్డారు.
కృష్ణ కిశోర్ దశాబ్ద కాలానికి పైగా అమెరికాలో సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నారు. కొద్ది నెలల కిందట సెలవులపై పాలకొల్లుకు వచ్చిన కృష్ణ కిశోర్ కుటుంబం పది రోజుల క్రితం అమెరికాకు తిరిగి బయల్దేరింది. మార్గమధ్యలో దుబాయ్‌లో న్యూఇయర్ వేడుకలను జరుపుకున్నారు. అక్కడి నుంచి అమెరికాలోని వాషింగ్టన్కు వెళ్లారు. ఈ క్రమంలో వారు ప్రయాణిస్తున్న కారును మరొక వాహనం ఢీకొనడంతో కృష్ణ కుమార్, ఆశ దంపతులు ప్రాణాలు కోల్పోయారు. వారి పిల్లలు తీవ్రంగా గాయపడ్డారు. ప్రస్తుతం వారి పరిస్థితి విషమంగానే ఉంది. దీనికి సంబంధించి తాజాగా వారి కుటుంబసభ్యులకు సమాచారం అందింది. దీంతో పాలకొల్లులో విషాదఛాయలు అలుముకున్నాయి.