భారతదేశంలో పేదరికం తగ్గిందని ప్రపంచ బ్యాంకు తాజా నివేదికలో వెల్లడించడం భిన్నాభిప్రాయాలకు దారితీస్తున్నది. పైపై పరిశీలనలో ఇది సంబురాలు చేసుకోవాల్సిన శుభవార్తగానే కనిపించవచ్చు. కానీ, నిజంగా పేదరికం తగ్గిందా? నలుగురైదుగురు సభ్యులుండే కుటుంబానికి నెలకు రూ.8,100 ఆదాయం ఉంటే పేదరికం నుంచి వారు బయటపడినట్టేనా? 2022-23 ఆర్థిక సంవత్సరపు డేటా మదింపు తర్వాత ప్రపంచ బ్యాంకు ఈ అంచనాకు వచ్చింది. అత్యంత దుర్భర దారిద్య్రానికి సంబంధించిన లెక్కలివి. కుటుంబ ఆదాయాన్ని రోజుకు 3 డాలర్లుగా చూపే 2021 నాటి అంతర్జాతీయ దారిద్య్రరేఖ కొలమానంగా ఈ లెక్కింపు జరిగింది. అనేక కారణాల వల్ల ఈ కొలమానం సందేహాస్పదం అవుతున్నది. వాస్తవ ఆదాయాలు పెరగకపోవడం, కొనుగోలు శక్తి సన్నగిల్లుతుండటం ఇందుకు కారణం. పైగా కొలమానం కంటితుడుపుగా కనిపిస్తున్నది. దారిద్య్రరేఖను కనిష్ట స్థాయికి దింపి పేదరికం తగ్గిందని సంతృప్తిపడటానికి తప్ప దీనివల్ల ఎవరికీ ఉపయోగం లేదు.
ప్రధాని మోదీ పరిపాలనా దశాబ్దిని అంతకు ముందరి దశాబ్దితో పోలిస్తే మనకు రెండు అంశాలు ప్రముఖంగా ముందుకువస్తాయి. ఒకటి, పేదరిక తరుగుదల వేగం 2.8 పర్సంటేజీ పాయింట్ల నుంచి 2 శాతానికి తగ్గినట్టు ప్రపంచ బ్యాంకు నివేదికే సెలవిస్తున్నది. ఆదాయవృద్ధి మందగించడమే దీనికి కారణం. రెండు, కారణాలు ఏవైతేనేం, వార్షిక జీడీపీ వృద్ధిరేటు అంచనా 7 శాతం నుంచి 5.7 శాతానికి తగ్గిపోయింది. పైకి దేశ జీడీపీ పరిమాణం పెరుగుతున్నట్టు కనిపించినా వాస్తవ విలువలో తరుగుదల చోటుచేసుకుంటున్నది.
2023-24లో 40 శాతం గ్రామీణ జనాభా, 10 శాతం పట్టణ జనాభా రెండుపూటల తిండికి నోచుకోలేదని గణాంకాలు తెలియజేస్తున్నాయి. 2024 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి గత జనవరిలో మొదట ఎస్బీఐ, తర్వాత ప్రపంచ బ్యాంకు విడుదల చేసిన నివేదికలు పేదరికం తగ్గినట్టు చెప్పాయి. దీంతో కేంద్ర ప్రభుత్వ అనుకూల మీడియాలో ఇదంతా మోదీ పాలన పర్యవసానమే అనే వాదనలు జోరందుకున్నాయి. కానీ, వాస్తవ పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. మరోవైపు భారత్ ఆర్థికంగా జపాన్ను దాటిపోయిందని, త్వరలో జర్మనీని మించిపోతుందనే అంచనాలు మరింతగా ఊదరగొట్టాయి. కానీ, తలసరి ఆదాయంలో మనం చాలా వెనుకబడే ఉన్నామన్నది వాస్తవం. సంపద పంపిణీలో అంతరాలు మరింత పెరగడం ఆందోళనకరం. ఆర్థిక అసమానతలు అంతకంతకూ విస్తరిస్తున్నాయి. జనాభాలో ఓ పెద్ద భాగం ఇప్పటికీ దారిద్య్రరేఖకు దిగువన నివసిస్తున్నది. ఈ నేపథ్యంలో తగిన దారిద్య్రరేఖను ఉపయోగించడం, ద్రవ్యోల్బణం, మారుతున్న వినియోగ విధానాలను పరిగణనలోకి తీసుకుని పేదరికాన్ని లెక్కించాల్సిన అవసరం ఉందని చెప్పక తప్పదు.