Telangana | స్వాతంత్య్ర దినోత్సవం నాడు గోల్కొండ కోట మీద మువ్వన్నెల జెండా ఎగరవేసాక తన ప్రసంగంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తాము ప్రపంచబ్యాంక్ అధ్యక్షుడిని ఇటీవలే కలిసామని, త్వరలోనే ఆ సంస్థ నుండి అప్పులు తీసుకొస్తామని చాలా ఆనందంగా చెప్పారు.
దేశమంతా వలస పాలన నుండి విముక్తి సంబురాలు జరుపుకుంటున్న రోజునే తెలంగాణ పరాధీన అవుతున్నదనే ప్రకటన రావడం ఎంతటి విరోధాభాస?
సరిగ్గా 24 నాలుగేళ్ల క్రితం, ఇదే ఆగస్టు నెలలో ప్రపంచబ్యాంక్ ఆదేశాల మేరకు చంద్రబాబు నాయుడు కరెంటు చార్జీలు పెంచితే, దాన్ని తగ్గించాలని నిరసన వ్యక్తం చేస్తున్న సామాన్య ప్రజలపైకి పేలిన తూటాలు, కారిన రక్తాలు, పోయిన ప్రాణాలు అన్నీ నా కళ్ల ముందు సినిమా రీల్లా గిర్రున తిరిగాయి.
ఆ చంద్రబాబు శిష్యుడు రేవంత్‌రెడ్డి వచ్చీ రాగానే చేస్తున్న ప్రపంచబ్యాంక్ జపం, ఆ సంస్థ నుండి అప్పులు తేవడానికి సిద్ధం చేస్తున్న భారీ ప్రాజెక్టుల వెనుక ఉన్న కుట్రల గురించి తెలంగాణ సమాజం మేలుకోకపోతే జరిగే నష్టం అంతా ఇంతా కాదు.
చంద్రబాబుతో ప్రపంచబ్యాంక్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో చేసిన ప్రయోగం వికటించి చివరికి ఆయన పదవే ఊడిపోయాక దాదాపు రెండు దశాబ్దాలు ఈ ప్రాంతంలో పెద్దగా ఆ సంస్థ ఉనికి కనపడలేదు. మరీ ముఖ్యంగా తెలంగాణలో అయితే కేసీఆర్ దృఢ సంకల్పం వల్ల ప్రపంచబ్యాంక్‌ను అడుగుపెట్టనీయలేదు. 2014 నుంచి 2023 మధ్య మౌలిక వసతుల కల్పన కోసం రుణాలు అవసరమైనా దేశీయ బ్యాంకులు, రుణ వితరణ సంస్థల వద్దకే వెళ్ళింది తప్ప ఏనాడూ ప్రపంచబ్యాంక్ రుణాలు తీసుకోలేదు కేసీఆర్ ప్రభుత్వం.
అయితే ప్రపంచబ్యాంక్ నుండి రుణాలు తీసుకుంటే జరిగే నష్టమేమిటో, అసలా రుణాల వెనుక జరిగే కుట్రల కథలేమిటో ఈ తరానికి పెద్దగా అవగాహన లేదు. అందువల్లనే రేవంత్ సర్కార్ వారిని తక్కువ వడ్డీకి రుణాలు వస్తాయని మభ్యపెట్టొచ్చు అనే నమ్మకంతో ఉన్నదనిపిస్తున్నది.
రెండో ప్రపంచ యుద్ధం అనంతరం అస్తవ్యస్తంగా తయారైన ప్రపంచ ఆర్థికవ్యవస్థను గాడిలో పెట్టేందుకంటూ 1944లో అమెరికా ప్రోద్బలంతో మొదలైంది ప్రపంచబ్యాంక్. కానీ అది రానురానూ పేదదేశాల వనరులను దోచి అమెరికా వంటి అగ్రరాజ్యాల, బహుళజాతి కంపెనీల ప్రయోజనాలు నెరవేర్చే సంస్థగా రూపాంతరం చెందింది. అభివృద్ధి చెందుతున్న దేశాలకు అవసరం ఉన్నా లేకున్నా ఇబ్బడిముబ్బడిగా రుణాలిచ్చి, ఆ దేశాలు అప్పుల ఊబిలో కూరుకుపోయేలా చేయడం. ఇచ్చిన అప్పులతో నడిచే ప్రాజెక్టుల్లో బహుళజాతి కంపెనీలకు, మధ్య దళారులకు ప్రయోజనం కలిగేలా చేయడం ప్రపంచబ్యాంక్ విధానం. అంతేకాదు రుణాలిచ్చిన దేశాల్లో పాలకులు నియంతలైనా, దుర్మార్గులైనా, అవినీతిపరులైనా ప్రపంచబ్యాంక్ పట్టించుకోదనే విమర్శలున్నాయి. చిలీలో అగస్టో పినోషె, నికరాగువాలో అనస్టాసియో సొమోజా, రొమేనియాలో నికొలాయ్ సీసెస్క్యూ, కాంగోలో మొబుటు, బ్రెజిల్, టర్కీ దేశాల్లో మిలిటరీ నియంతృత్వాలకు ప్రపంచబ్యాంక్ నిస్సిగ్గుగా అండగా నిలబడి అనేక విమర్శలు ఎదుర్కొన్నది.
పేదరిక నిర్మూలన, పర్యావరణ పరిరక్షణ, మహిళా సాధికారత వంటి పడికట్టు పదాలతో పేద దేశాలపై వల విసిరే ప్రపంచబ్యాంక్, ఆయా దేశాలు అప్పుల ఊబిలో చిక్కుకోగానే స్ట్రక్చరల్ అడ్జస్ట్మెంట్ లోన్ల పేరిట ఒక దుర్మార్గమైన పన్నాగం పన్నుతుంది. ఈ లోన్ల కోసం ప్రపంచబ్యాంక్ పేద దేశాల్లో పెట్టిన షరతులు చూడండి – విద్య, వైద్యం, ప్రజారవాణా, విద్యుచ్చక్తి తదితర రంగాలను ప్రైవేటుకు అప్పజెప్పాలి; ప్రభుత్వరంగ సంస్థలన్నీ ప్రైవేటీకరణ చేయాలి; నీటిపారుదల మొదలు అన్ని రంగాల్లో యూజర్ చార్జీలు ప్రవేశపెట్టాలి; గనులు బహుళజాతి కంపెనీలకు ధారాధత్తం చేయాలి, మార్కెట్లను బహుళజాతి కంపెనీలకు బార్లా తెరవాలి, ఇలా… ఎన్నో.
ప్రైవేటీకరణ వల్ల ఉద్యోగాలు కోల్పోయిన లక్షలాదిమంది అభాగ్యులు; విద్య, వైద్యం ఖరీదైపోయి దాన్ని కొనలేకపోయిన కోట్లాదిమంది అసహాయులు; బహుళజాతి కంపెనీల మైనింగ్‌తో జరిగిన విధ్వంసం వల్ల గూడు కోల్పోయిన గిరిజనులు; ప్రపంచబ్యాంక్ అప్పుల వలకు చిక్కి నాశనమైన దేశాల్లో ఎక్కడ చూసినా మీకు కనిపించే దృశ్యాలు ఇవే.
1990ల వరకూ కేవలం దేశాలకు మాత్రమే అప్పులు ఇచ్చే ప్రపంచబ్యాంకు చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయ్యాక తొలిసారిగా ఒక రాష్ట్ర ప్రభుత్వానికి అప్పులు ఇవ్వడం ప్రారంభించింది. మిగతా చోట్ల ఉపయోగించిన ఎత్తుగడలే ఆనాటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ఉపయోగించింది వరల్డ్ బ్యాంక్. అనవసరమైన అప్పుల్ని చంద్రబాబు సర్కారుకు ఇవ్వజూపి, బదులుగా ఇక్కడ విద్యుత్ రంగాన్ని, ఇతర ప్రభుత్వరంగ సంస్థలను ప్రైవేటీకరణ చేయించింది. బ్యాంక్ ఆదేశాల మేరకు ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రిసిటీ బోర్డును ట్రాన్స్‌కో జెన్కోగా విభజించి, ఆ తరువాత దశలవారీగా ప్రైవేటుకు అప్పజెప్పే ప్రక్రియను చంద్రబాబు ప్రభుత్వం మొదలుపెట్టింది.
యేటా విద్యుత్ చార్జీలు పెంచాలనే ప్రపంచబ్యాంక్ షరతును చంద్రబాబు ప్రభుత్వం అమలుజేయడానికి ప్రయత్నించినప్పుడు ప్రజాగ్రహం పెల్లుబికింది. రాష్ట్రమంతటా రాజుకున్న విద్యుత్ చార్జీల వ్యతిరేక ఉద్యమం చివరికి వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో చలో అసెంబ్లీ కార్యక్రమంతో తారాస్థాయికి చేరింది. ఆగస్టు 28, 2000 నాడు అనేక ఆంక్షలను ఛేదించుకుని బషీర్‌బాగ్ చేరుకున్న ఆందోళనకారుల మీద చంద్రబాబు ప్రభుత్వ పోలీసులు విచక్షణారహితంగా కాల్పులు జరపడం వల్ల ముగ్గురు యువకులు మరణించగా అనేక మంది గాయపడ్డారు. ఆనాటి విద్యుత్ చార్జీల వ్యతిరేక ఉద్యమమే ప్రపంచబ్యాంక్ జీతగాడు అనే బిరుదు చంద్రబాబుకు ప్రసాదించింది. చివరికి ఆయన పీఠాన్ని కూకటివేళ్లతో పెకిలించివేసింది.
తెలంగాణ ముఖ్యమంత్రిగా చంద్రబాబు శిష్యుడు రేవంత్ రెడ్డి నియామకం అయిన కొద్ది రోజులకే మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టు గురించి మాట్లాడటం మొదలుపెట్టాడు. అయితే గత బీఆర్ఎస్ ప్రభుత్వం రూ.16,634 కోట్ల అంచనాతో ప్రారంభించిన ప్రాజెక్టును తొలుత అమాంతం మూడు రెట్లు పెంచి రూ.50,000 కోట్లతో చేపడతాం అని ప్రకటించిన రేవంత్ రెడ్డి, మూడు నెలలు గడిచే సరికి ఆ అంచనాను ఏకంగా పది రెట్లకు పెంచి రూ. లక్షా యాభై వేల కోట్లకు చేర్చడంతో తెలంగాణ సమాజం నివ్వెరపోయింది. ఇంతలోనే ఆయన అమెరికా పర్యటనకు బయలుదేరడం, అక్కడ ప్రపంచబ్యాంక్ అధ్యక్షుడితో కలవడం చకచకా జరిగిపోయాయి. ఆ రోజు జరిగిన చర్చల అనంతరం మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టుకు ప్రపంచబ్యాంక్ రుణం తీసుకుంటామని రేవంత్ సర్కారు ప్రకటించింది. ప్రాజెక్టు అంచనాలు కొద్ది నెలల్లోనే పదిరెట్లు పెంచడం, దానికి ప్రపంచబ్యాంక్ రుణం తీసుకుంటాం అని ప్రకటించడం పక్కా కుట్రపూరిత ప్రణాళికతోనే జరిగిందని ఇప్పుడు స్పష్టమవుతున్నది.
రేవంత్ రెడ్డి మొదలుకొని కాంగ్రెస్ నాయకులంతా ప్రపంచబ్యాంక్ రుణాలు తక్కువ వడ్డీకి దొరుకుతాయి అనే అందమైన అర్థసత్యాన్ని పదేపదే వల్లెవేసి తెలంగాణ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు. కానీ వారు చెప్పని విషయం ఏమిటంటే ప్రపంచబ్యాంక్ వంటి సంస్థల రుణాలు డాలర్ డినామినేషన్లో ఉంటాయి. రూపాయి బలహీనపడ్డ ప్రతిసారీ వడ్డీ సంగతేమో కానీ అసలు మొత్తమే భారీగా పెరుగుతుంది. రుణాలివ్వడానికి ప్రపంచబ్యాంక్ పెట్టే షరతులతో తెలంగాణను పీల్చి పిప్పి చేయడం ఖాయం. ఇలాంటి రుణాల వల్ల ఎదురయ్యే దుష్పరిణామాల్లో విద్యుత్ చార్జీల పెంపుతో పాటు ఆర్టీసీ ప్రైవేటీకరణ వరకూ ఉండొచ్చు.
స్వతహాగా ప్రగతిశీల భావాలు కలిగిన తెలంగాణ సమాజం, బుద్ధిజీవులు మరోసారి ఈ గడ్డమీదికి ప్రపంచబ్యాంకును, వారి తాబేదార్లను తీసుకురావడానికి ప్రయత్నిస్తున్న రేవంత్ సర్కార్ ప్రయత్నాలను తిప్పికొట్టాలి. తెలంగాణ మరోసారి పరాధీన కాకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత మనదే!
స్వతహాగా ప్రగతిశీల భావాలు కలిగిన తెలంగాణ సమాజం, బుద్ధిజీవులు మరోసారి ఈ గడ్డమీదికి ప్రపంచబ్యాంకును, వారి తాబేదార్లను తీసుకురావడానికి ప్రయత్నిస్తున్న రేవంత్ సర్కార్ ప్రయత్నాలను తిప్పికొట్టాలి. తెలంగాణ మరోసారి పరాధీన కాకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత మనదే!