‘విజయ్ తన పార్టీ ప్రారంభ మహాసభ చాలా, చక్కగా విజయవంతంగా నిర్వహించాడు. అతనికి శుభాకాంక్షలు’.. తమిళ టాప్ హీరో, ‘దళపతి’ విజయ్ స్థాపించిన తమిళగ వెట్రి కళగం (టీవీకే)పైతమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్ క్లుప్తంగా చేసిన గొప్ప కామెంట్ ఇది. తమిళ సినీ నిర్మాత, దర్శకుడు ఎస్.ఎ. చంద్రశేఖర్, సినీ నేపథ్య గాయని శోభ కుమారుడైన 50 ఏండ్ల విజయ్ జోసెఫ్ చంద్రశేఖర్ ఉరఫ్ విజయ్ పెట్టిన మరో ద్రవిడ పక్షంపై ఎవరికీ పెద్దగా అంచనాలు లేవు.
తమిళనాడు రాజకీయ సంప్రదాయాలూ, ఆచారాలే అందుకు కారణం. ఐదు దశాబ్దాలుగా (1971-2021 అసెంబ్లీ ఎన్నికల వరకు) తమిళనాట అధికారం అన్నాడీఎంకే, డీఎంకే మధ్య బదిలీ అయ్యే ఆనవాయితీ టీవీకే స్థాపనతో మారిపోతుందా? లేక మరో తమిళ హీరో విజయకాంత్ స్థాపించిన డీఎండీకే మాదిరిగా మొదట మెరిసి చివరకు మాయమైపోతుందా? అనే ప్రశ్నలు ఇప్పుడు తమిళ రాజకీయ విశ్లేషకులకు ఎదురవుతున్నాయి.
Vijay | పీఆర్పీ కావచ్చు లేదా రజనీకాంత్ మొదలుపెట్టి, నిలిపివేసిన రాజకీయ పార్టీ మక్కల్ సేవయ్ కచ్చి (ఎంఎస్కే) కావచ్చు.. వాటి ప్రారంభాలు ఘనంగానే ఉంటాయి. అదే తరహాలో విల్లుపురం జిల్లా విక్రవండిలో జరిగిన టీవీకే మొదటి ప్రజా సదస్సు అట్టహాసంగా ముగిసింది. 2008లో తిరుపతిలో జరిగిన పార్టీ స్థాపక సమావేశంలో డిజిటల్, ఎలక్ట్రానిక్ టెక్నాలజీల సాయంతో ‘ప్రజారాజ్యం పార్టీ’ పేరును తెలుగు మెగాస్టార్ కొణిదెల చిరంజీవి ఆవిష్కరించారు. మరో తెలుగు సినీ హీరో ఎన్టీ రామారావు మాత్రం 1982లో తెలుగుదేశం పార్టీ ప్రారంభ సమావేశాన్ని ఎలాంటి ఆర్భాటం లేకుండా సాదాసీదాగా నిర్వహించి, 9 నెలల్లోనే అధికారంలోకి వచ్చి రికార్డు సృష్టించారు. అన్ని పార్టీలూ టీడీపీ కావు కదా! తమిళనాట ఎందరో హీరోలు స్థాపించిన అనేక ప్రాంతీయ పక్షాలు అంటుకు లేకుండాపోయాయి. తమిళనాడులో ఒక రాజకీయ పార్టీ స్థాపించడం ఎంత తేలిక అంటే తమిళ తీవ్రవాద భావాలతో ఒక మోస్తరు పాపులారిటీ ఉన్న తమిళ నటుడు సీమన్ 2010లో శ్రీలంక అంతర్యుద్ధం ముగిశాక పెట్టిన ‘నామ్ తమిళలార్ కచ్చి’ (ఎన్టీకే) తన ఉనికిని ఫరవాలేదన్నట్టు కొనసాగిస్తోంది. 2021 అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్టీకేకు 30 లక్షలకు పైగా (6.58%) ఓట్లు వచ్చాయి. సీమన్ కంటే ముందు తమిళ హీరోలు శరత్‌కుమార్, కార్తీక్ (తెలుగులో మురళీ) ప్రారంభించిన పార్టీలు ఇప్పుడు పత్తా లేకుండాపోయాయి. డీఎంకే నుంచి మొదట చీలిన వైగో (పాత పేరు వై.గోపాలసామి) పార్టీ ఎండీఎంకే కూడా తన ఉనికిని కాపాడుకోవడానికే పరిమితమైంది. డీఎంకే నేత, ఆ పార్టీ అధికారంలో ఉండగా స్పీకర్‌గా, కరుణానిధి కేబినెట్లో మంత్రిగా పనిచేసిన డాక్టర్ ఎం.తమిళకుడిమగన్ వంటి నేతలు స్థాపించిన అనేక పార్టీలు కాలగర్భంలో కలిసిపోయాయి. అయితే, రజనీకాంత్ మాదిరిగా 70 ఏండ్లు నిండిన తర్వాత కాకుండా ఐదు పదులు వచ్చాకే ఇప్పటికీ యూత్‌ఫుల్‌గానే కనిపించే విజయ్ తాజాగా కొత్త పార్టీని ప్రారంభించారు. సినిమా రంగంలో సంపాదించుకున్న ఆస్తులతో విజయ్ కూడా రజనీకాంత్ మాదిరిగానే ఆర్థికంగా ఇబ్బందిలేని స్థితిలో ఉన్నారు. 2021 తమిళ అసెంబ్లీ ఎన్నికలకు ఆరు నెలల ముందు తన పుట్టినరోజైన 2020 డిసెంబర్ 12న ప్రకటించి, ప్రారంభించిన పార్టీకి ఎన్నికల చిహ్నం (ఆటోరిక్షా) కూడా వచ్చిన తర్వాత ఎంఎస్కే జెండా పీకేసి ఎన్నికల రాజకీయాల్లోకి రానని రజనీకాంత్ ప్రకటించారు. వయసు, ఆరోగ్యం రీత్యా రజనీకాంత్‌కు ఉన్న ఇబ్బందులు విజయ్‌కు లేవు. అయితే, అనేక ఇతర సమస్యలు తమిళనాడు శాసనసభ మరుసటి ఎన్నికల లోపు (2026 వేసవి) టీవీకేను ఉక్కిరిబిక్కిరి చేసే అవకాశాలు నిండుగా కనిపిస్తున్నాయి.
ఈ సమస్యలను ఈ ఏడాదిన్నర కాలంలో విజయ్ తట్టుకుని నిలబడినా తమిళ ప్రజానీకం తమ దళపతిని ముఖ్యమంత్రి పీఠం ఎక్కిస్తారా? అంటే అది అంత తేలిక కాదని సునాయాసంగా చెప్పవచ్చు.
మొదటి మహాసభలో విజయ్ ఎడాపెడా పంచ్ డైలాగులు, మాటల తూటాలు పెద్దగా పేల్చలేదు, విసరలేదు. కానీ, ‘బీజేపీది ఫాసిజమైతే డీఎంకేది పాయసమా? బీజేపీ మాకు సైద్ధాంతిక శత్రువు అయితే డీఎంకే మా రాజకీయ ప్రత్యర్థి’ అన్న విజయ్ మాటలు మాత్రం ప్రజలు, మీడియా, రాజకీయ విశ్లేషకుల దృష్టిని బాగా ఆకట్టుకున్నాయి. తోటి దక్షిణాది రాష్ర్టాలైన కర్ణాటక, తెలంగాణలో మాదిరిగా కేంద్రంలో పాలకపక్షమైన బీజేపీ తమిళనాడులో సీట్లు, ఓట్ల శాతంతో ఎదుగుతున్న జాతీయపక్షం కాదు. బీజేపీ తన 45 ఏండ్ల ప్రస్థానంలో తమిళనాట ఐదు లోక్‌సభ, పది అసెంబ్లీ స్థానాలు గెలుచుకున్న సందర్భాలు ఎప్పుడూ లేవు. అదీగాక తాము మతతత్వ వ్యతిరేక, లౌకిక పార్టీలమని చెప్పుకొనే పాలక, ప్రతిపక్ష ద్రావిడ పార్టీలు డీఎంకే, ఏఐఏడీఎంకే, పీఎంకే సహా అనేక చిన్నాచితకా పార్టీలు 1989 నుంచీ బీజేపీతో ఏదో ఒక ఎన్నికల్లో పొత్తుపెట్టుకుని, కూటమి కట్టినవే.
ఏ రాష్ట్రంలోనైనా, ఎవరైనా సరే కొత్తగా రాజకీయ పార్టీని ప్రారంభించారంటే.. అక్కడి పాలకపక్షంపై విమర్శల బాణాలు ఎక్కుపెట్టాల్సిందే. అందుకే ఎంకే స్టాలిన్ నాయకత్వంలోని డీఎంకే ప్రభుత్వాన్ని అవినీతి నిండిన సర్కారుగా విజయ్ విమర్శించారు. అంతటితో ఆగకుండా కేంద్రంలోని హిందూత్వ పాలకపక్షం బీజేపీకి పెద్దగా హాని జరగని రీతిలో ‘మతతత్వ, ఫాసిస్టు పార్టీ’గా దళపతి వర్ణించారు. గతంలో తాను నటించిన ఒక తమిళ సినిమాలో ప్రధాని నరేంద్రమోదీ ప్రభుత్వాన్ని, బీజేపీని ఎండగట్టే రీతిలో ఒక డైలాగ్ పలికినందుకు ఎదురైన అనుభవాల కారణంగా కాషాయపక్షాన్ని ‘ఫాసిస్టు’ అనే ధైర్యం విజయ్‌కి వచ్చిందనుకోవాలి. బీజేపీ ప్రధాన రాజకీయపక్షం కాని తమిళనాట ప్రధాని మోదీని, ఆర్ఎస్ఎస్ పరివారాన్ని ఎంతగా దుయ్యబట్టినా లేదా 1971 నుంచీ ఏదో ఒక ప్రధాన ద్రావిడ రాజకీయ పక్షం జూనియర్ భాగస్వామిగా ప్రతి ఎన్నికల్లో పోటీచేసి (రాజకీయాలు కన్నుమూసే వరకూ అర్థం కాని రాజీవ్‌గాంధీ హయాంలో జరిగిన ఒక్క 1989 అసెంబ్లీ ఎన్నికల్లో తప్ప) ప్రస్తుతం తమిళ పాలక కూటమిలో సేదదీరుతున్న కాంగ్రెస్‌ని దూషించినా టీవీకేకు చెప్పుకోదగిన సంఖ్యలో ఓట్లు రాలవు.
విజయ్ రాష్ట్ర కేబినెట్లో కనీసం మంత్రి కూడా కాలేరు. రాబోయే 16-18 మాసాల్లో కొత్త తమిళ ప్రాంతీయపక్షం ప్రజలకు ఇవ్వజూపే గ్యారెంటీలు ఏమిటో, వాటిని జనం ముందు ఎలా పెడతారో అనే విషయాలే టీవీకే భవితవ్యాన్ని నిర్ణయిస్తాయి.
వయసు రీత్యా చూస్తే డీఎంకే వారసుడు, ఉపముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్, బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు కె.అన్నామలైల తరం వాడైన విజయ్ కూడా యువనేతగా కనిపిస్తారు. కానీ, ఇదొక్కటే శాసనసభ ఎన్నికల్లో కొత్త పార్టీకి అధికారం దక్కేలా చేయదు. మహా అయితే, దివంగత విజయకాంత్ పార్టీ డీఎండీకే 2011 ఎన్నికల్లో మాదిరిగా పాతిక ముప్పయి అసెంబ్లీ సీట్లు సంపాదించవచ్చు. 13 ఏళ్ల క్రితం జరిగిన ఈ ఎన్నికల్లో మాజీ సీఎం జయలలిత నేతృత్వంలోని ఏఐఏడీఎంకేతో పొత్తుపెట్టుకోబట్టే విజయకాంత్ పార్టీకి 29 సీట్లు వచ్చాయి.
ఎన్నికల్లో విజయం సాధిస్తే తన పార్టీకి మద్దతు పలికిన పార్టీలకు అధికారంలో వాటా ఇస్తాననే ప్రతిపాదన కూడా విజయ్ ప్రసంగంలో మరో కొత్త విషయం. నిజమే తమిళనాడు చరిత్రలో మొదటిసారి సంకీర్ణ సర్కారు ప్రథమ సార్వత్రిక ఎన్నికలు జరిగిన 1952లో (అప్పుడు రాష్ట్రం పేరు మద్రాస్) మాత్రమే కాంగ్రెస్ నేత సి.రాజగోపాలాచారి నాయకత్వాన ఏర్పడిన ప్రభుత్వం మిత్రపక్షాలకు మంత్రి పదవులు ఇచ్చింది. ఆ తర్వాత ఇప్పటి వరకూ రాష్ట్రంలో ఏ ఒక్క ద్రావిడ పార్టీ కూడా జూనియర్ భాగస్వాములకు మంత్రి పదవులు ఇవ్వలేదు. అందుకే, ‘మిత్రులకు సత్తాలో వాటా’ అనే నినాదం విజయ్ ఎత్తుకున్నట్టు కనిపిస్తోంది. ఈ హామీ ఎన్ని చిన్నచిన్న పార్టీలను టీవీకే వైపునకు లాక్కొస్తుందో చూడాలి మరి. ‘పుట్టినప్పుడు మానవులంతా సమానమే’ అంటున్న మాట విజయ్‌ని ఫోర్ట్ సెయింట్ జార్జ్ అధికార పీఠానికి ఎంత దగ్గరకు తీసుకెళ్తుందో త్వరలో తేలిపోతుంది.