హిమాలయ పర్వతాన్ని చూసినప్పుడు ప్రవరాఖ్యుని స్పందనను అల్లసాని పెద్దన ‘అటజని కాంచె’ పద్యంలో అద్భుతంగా వర్ణించారు. అలాగే తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్‌ను చూసినప్పుడు కూడా అదే అనుభూతి కలుగుతుంది. ఎందుకంటే, ఆయన వ్యక్తిత్వం హిమాలయ శిఖరం అంతటి మహోన్నతమైనది. తెలంగాణ ప్రజల మనసులో కేసీఆర్ స్థానం అత్యున్నతమైనది. అంతేకానీ, ఎవరో వచ్చి చెరిపేస్తాం.. చింపేస్తామంటే చెరిగిపోయేది కాదు కేసీఆర్ చరిత్ర. హిమాలయాల్లో మంచు నిత్యం కరుగుతూనే ఉంటుంది. అంతమాత్రాన హిమాలయ పర్వతం మాయమవుతుందా? అట్లాగే కేసీఆర్ ఆనవాళ్లు కూడా చెరిగిపోవు. చెరిపేస్తామంటూ కొందరు చెలరేగిపోతున్నారంటే అది వారి మూర్ఖత్వమే.
కేసీఆర్ అనేక పుస్తకాలు చదవడమే కాదు, ఆయనే స్వయంగా తెలంగాణ రాష్ర్టానికి ఓ పుస్తకం అయ్యారు. ఆయనపై వందలాది మంది కవులు, రచయితలు వేలకొద్దీ పుస్తకాలు రాశారు. ఆయన చేసిన మంచి పనుల మీదా పుస్తకాలు అచ్చయ్యాయి. తెలంగాణ ఉద్యమ స్ఫూర్తితో రాష్ర్టాన్ని అభివృద్ధి చేయడంలో ఆయన విజన్‌ను ఎవరూ అందుకోలేరు. ‘సన్ ఆఫ్ ది సాయిల్’ అని గోసుల శ్రీనివాస్, ‘తెలంగాణ వనమాలి’ అని జూలూరు గౌరీశంకర్ వంటి రచయితలు రాసిన పుస్తకాలు తెలంగాణకు కేసీఆర్ సాధించిపెట్టిన కీర్తికి అంకితమిచ్చిన అతి చిన్న బహుమానాలు మాత్రమే. అంతేకాదు, తెలంగాణ బాగు కోసం కేసీఆర్ చేసిన కృషికి, సుపరిపాలనకు జ్వాలా నరసింహారావు అక్షర రూపమిచ్చారు. ‘కేసీఆర్ ప్రగతి ప్రాంగణం’ అని బొట్ల మహర్షి అద్భుతంగా వర్ణించారు. ఇక నెర్రెలిచ్చిన బీడులకు గోదావరి పరవళ్లు పెట్టిన తీరును శ్రీధర్‌రావు దేశ్‌పాండే ‘కాళేశ్వరం ప్రాజెక్టు-తెలంగాణ ప్రగతి రథం’ అంటూ ప్రపంచానికి చూపించారు. ‘నాయకుడు.. ఒక సామాన్యుడి విజయ ప్రస్థానం’ అంటూ మీడియా ఫ్యాక్టరీ ఆయనలోని నాయకత్వ లక్షణాలను, తెలంగాణ కోసం పోరాడిన విధానాన్ని అద్భుతంగా కండ్లకు కట్టింది. ఇవే కాదు, ‘కేసీఆర్.. ది ఆర్ట్ ఆఫ్ పాలిటిక్స్’ అంటూ చిమ్మని మనోహర్ ఒక అద్భుతాన్ని ఆవిష్కరించారు. వ్యక్తిగా, ఉద్యమకారుడిగా, వ్యూహకర్తగా, పాలనాదక్షుడిగా… ఇలా కేసీఆర్‌లోని అన్ని కోణాలను కండ్లకు కట్టారు. కేసీఆర్‌పై పద్మశ్రీ శ్రీభాష్యం విజయసారథి సంస్కృతంలో పుస్తకం రాయడం విశేషం. కేసీఆర్ పేరిట ఇలా ఎన్నో, ఎన్నెన్నో పుస్తకాలు వచ్చాయి.
కానీ, కేసీఆర్ పేరుందనే ఒకే ఒక్క కారణంతో బడి పిల్లలకు ఇవ్వాల్సిన లక్షల పుస్తకాలను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చింపివేయడం ఆయన కురచ బుద్ధికి నిదర్శనం. ఆ ఒక్క పుస్తకంలో కొన్ని పేజీలు చింపినంత మాత్రాన కేసీఆర్ పేరు కనిపించకుండా పోతుందా? ఆ బడి పిల్లల మనసుల్లో, వారి అమ్మానాన్నల హృదయాల్లో కేసీఆర్ వేసిన ముద్ర చెరిగిపోతుందా? బాగైన బడుల్లో.. దేశానికే గుర్తింపు తెచ్చిపెట్టిన గురుకులాల్లో కేసీఆర్ కనిపించకుండా ఉంటారా?
పుస్తకాలు అందరూ చదువుతారు. కానీ, పుస్తకాలు కొందరే రాస్తారు. కానీ, పుస్తకమయ్యే వారు చాలా అరుదుగా ఉంటారు. వారు లెక్కలేనన్ని పుస్తకాలకు రచనా వస్తువు అవుతారు. లక్షలాది మెదళ్లకు పదును పెడతారు. భావితరాలకు బాట వేసినవారవుతారు. చరిత్రకారులుగా.. చరిత్ర సృష్టించినవారిగా చరిత్రలో నిలిచిపోతారు. అలాంటి అరుదైన, అద్భుతమైన మనీషి కేసీఆర్.
కేసీఆర్ తన ప్రాణాలను పణంగా పెట్టి దీక్ష చేసినా.. సాన పట్టి తన మాటలను తూటాల్లా పేల్చినా.. అదంతా తెలంగాణ రాష్ట్ర సాధన కోసం, తెలంగాణ బాగు కోసమే. ఆయన ఎన్నడూ తుపాకీ పట్టలేదు. కానీ, తూటాల్లాంటి తన మాటలతో, మిస్సైల్‌ను మించిన శక్తివంతమైన తన మేధస్సుతో ఢిల్లీని గడగడలాడించారు. ఢిల్లీ గద్దెపై ఉన్నవారికి ముచ్చెమటలు పట్టించారు. కేసీఆర్ అంటే అందరిలాంటి రాజకీయ నాయకుడు కాదు. ఉద్యమం వేరు.. రాజకీయం వేరు అన్న స్పష్టతతో పనిచేసిన పరిపక్వత కలిగిన అధినాయకుడు. ఉద్యమంలో ఆగ్రహాన్ని చూపించారు. స్వరాష్ట్రం ఏర్పాటయ్యాక అంతకుమించిన ప్రణాళికతో, ఆలోచనతో అభివృద్ధిలో తెలంగాణను పరుగులు పెట్టించారు. అసలు సమస్య ఎక్కడ ఉంది? దానికి పరిష్కారం ఏమిటనేది ఆలోచించారు. అందుకే, అనతికాలంలోనే కరెంటు కష్టాలు తీర్చారు. నీళ్ల గోస లేకుండా చేశారు. అందుకే, తెలంగాణ పచ్చబడింది. ఏటికేడు వరి దిగుబడిలో కొత్త రికార్డులు సృష్టిస్తున్నది.
కాంగ్రెస్ సర్కార్ వలె అధికారంలోకి వచ్చీరాగానే పక్క పార్టీల నేతలపై కేసీఆర్ దాడులు చేయించలేదు. అక్రమ కేసులు బనాయించలేదు. ఏకంగా తన ప్రభుత్వాన్నే కూల్చేందుకు ఆంధ్రా తొత్తులతో కలిసి కొందరు కుట్రలు చేసినా చట్ట ప్రకారమే నడుచుకున్నారు తప్ప.. ఎక్కడా కక్షసాధింపులకు పాల్పడలేదు. చిల్లర మాటలు మాట్లాడలేదు. ఎందుకంటే, ఆయన ఆలోచనంతా తెలంగాణ గురించే. కేసీఆర్ వ్యక్తిత్వం, ఆలోచన, తపన ఏమిటనేది వాళ్లు, వీళ్లు కాదు.. స్వయంగా మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ తన పుస్తకంలో ప్రస్తావించారు. కేసీఆర్‌కు, ఇతర నాయకులకు తేడా ఏమిటో స్పష్టంగా ఆ పుస్తకంలో రాశారు.
గతంలో యూపీఏ కూటమిలో టీఆర్ఎస్ పార్టీ చేరిన విషయం తెలిసిందే. అదే సమయంలో జేఎంఎం కూడా యూపీఏలో ఉన్నది. శిబూసోరెన్‌కు కేంద్ర మంత్రివర్గంలో స్థానం కల్పించారు. కానీ, తన పార్టీకి మరో మంత్రి పదవి ఇవ్వాలని ఆయన పట్టుబట్టారు. అదే సమయంలో ఏ శాఖ కావాలని కేసీఆర్‌ను ప్రణ బ్ అడిగారట. అప్పుడు ఆయన.. ‘ప్రణబ్ జీ..! నా లక్ష్యం ఏమిటో మీకు తెలుసు. నాకు ప్రత్యేక తెలంగాణ కావాలి. ఏ శాఖను కేటాయించారనేది నాకు ముఖ్యం కాదు. మీరేది కేటాయించినా సమ్మతమే. కానీ, దయచేసి తెలంగాణ మాత్రం ఇవ్వండని కేసీఆర్ కోరారు’ అని ప్రణబ్ తన పుస్తకం ‘The Coalition Years: 1996-2012’లో ప్రస్తావించారు. ఇది కేసీఆర్ గొప్పతనానికి ఓ ప్రత్యక్ష ఉదాహరణ. ఉద్యమ జెండా ఎత్తిన నాటినుంచి నేటిదాకా.. ప్రతీ క్షణం, ప్రతీ రోజు తెలంగాణ బాగు కోసం, తెలంగాణ భవిత కోసం ఆలోచించిన మహోన్నత వ్యక్తి కేసీఆర్. అందుకే రాష్ట్ర సాధన ఉద్యమాన్ని దేశ స్వాతంత్య్ర పోరాటం లాగా కార్యదీక్షతో చేశారు. రాష్ట్ర సాధన దీక్షబూని ఆమరణ దీక్షకు దిగారు. రాదనుకున్న రాష్ర్టాన్ని సాధించి చూపెట్టారు. జరగదనుకున్న అభివృద్ధిని చేసి చూపించారు. మొత్తంగా తెలంగాణను ప్రపంచానికి సరికొత్తగా పరిచయం చేశారు.
భారత స్వాతంత్య్రోద్యమం అనగానే గాంధీ, నెహ్రూ, అంబేద్కర్, పటేల్, చంద్రశేఖర్ ఆజాద్, భగత్‌సింగ్ లాంటి మహనీయులు గుర్తుకువస్తారు. అలాగే తెలంగాణ అనగానే గుర్తొచ్చేవారిలో కేసీఆర్ ముందుంటారు. దీన్ని ఎవరూ మార్చలేరు.