కాంగ్రెస్ ఇచ్చిన గ్యారెంటీలను అమలు చేయడానికి నిధులు కావాలి. నిధులు కావాలంటే సంపదను సృష్టించే తెలివితేటలు ఉండాలి. రాష్ట్ర ఆదాయం పెంచే ప్రణాళికలు రూపొందించాలి. పెట్టుబడులను ఆకర్షించే విధానాలు అమలుచేయాలి. కానీ, బూతులు తిట్టడానికి అవేవీ అక్కర్లేదు. సంస్కారం అడ్డు రాని నోరుంటే చాలు. తన బిడ్డ విదేశీ విద్యానిధి కోసం దరఖాస్తు చేసి ఏడాదైనా నిధులు మంజూరు కావడం లేదని బాధపడుతున్న బీసీ సామాజికవర్గానికి చెందిన ఓ తండ్రికి నేను ఇచ్చిన సమాధానమిది.
విదేశీ విద్య చదివే వివిధ కులాలకు చెందిన వేలాది మంది విద్యార్థులకు గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఆర్థిక సహాయం చేసింది. విమాన టికెట్‌తో పాటు ఒక్కో విద్యార్థికి రూ.20 లక్షలు సాయం అందించింది. కానీ, అధికారంలోకి వచ్చి ఏడాది కావస్తున్నా కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం ఇప్పటివరకు ఒక్క పైసా ఇవ్వలేదు. ఈ పథకానికి నిధులు ఇచ్చే సూచనలు కనిపించకపోవడంతో బ్రాహ్మణ పరిషత్ ఈసారి కనీసం దరఖాస్తులు కూడా ఆహ్వానించలేదు. బీసీ విద్యార్థుల నుంచి దరఖాస్తులు తీసుకున్నా ఎలాంటి ఉలుకుపలుకు లేదు.
CM Revanth Reddy | విదేశీ విద్యానిధి పథకం కింద నిధులు విడుదల చేస్తారేమోనని నిత్యం వెబ్సైట్లో చూస్తున్న తల్లిదండ్రుల ఆశలు అడియాసలు అవుతూనే ఉన్నాయి. ఇప్పటికే చాలామంది విద్యార్థుల చదువులు కూడా పూర్తయ్యాయి. అయినప్పటికీ, ఈ పథకానికి నిధులు విడుదల చేస్తారో, లేదో? తెలియడం లేదు. తెలంగాణలో ఈ ఒక్క పథకమే కాదు, నిధులతో ప్రమేయమున్న అన్ని పథకాల పరిస్థితి ఇలాగే ఉంది. అసెంబ్లీ ఎన్నికలకు ముందు అడ్డూఅదుపు లేకుండా కాంగ్రెస్ నాయకులు మాట్లాడిన వీడియోలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్ అవుతున్నాయి. రాహుల్‌గాంధీ పాల్గొన్న ఒక సభలో నాలుగు వేల పింఛన్ అని రాసున్న ప్లకార్డుని పట్టుకొని కేటీఆర్‌కు కోమటిరెడ్డి వెంకటరెడ్డి సవాల్ చేసిన వీడియో నెట్టింట చక్కర్లు కొడుతున్నది. సోనియాగాంధీ, రాహుల్‌గాంధీ, ప్రియాంకాగాంధీ, రేవంత్‌రెడ్డి తదితర నేతలంతా కాంగ్రెస్ అధికారంలోకి రాగానే రూ.4 వేల పింఛన్ ఇస్తామని హామీ ఇచ్చారు. కానీ, గద్దెనెక్కి ఏడాదైనా పింఛన్ మాత్రం పెంచలేదు. ఆరు గ్యారెంటీల్లో భాగంగా ఇచ్చిన హామీల్లో ఒక్క ఫ్రీ బస్సు మాత్రమే అమలుచేశారు. మిగిలిన హామీల ఊసే ఎత్తడం లేదు.
ప్రభుత్వ సొమ్ముతో ఇతర రాష్ర్టాల్లో ప్రకటనలు ఇచ్చారని గతంలో కేసీఆర్ సర్కార్‌ను ప్రశ్నించిన రేవంత్‌రెడ్డి నేడు తెలంగాణలో ఆరు గ్యారెంటీలు అమలవుతున్నాయంటూ ఎన్ని కలు జరుగుతున్న మహారాష్ట్రలో ప్రకటనలు ఇచ్చారు. మహిళలకు నెలకు రూ.2500, రైతుబంధు సహా అన్ని హామీలను నెరవేర్చినట్టు ప్రకటించుకోవడం సిగ్గుచేటు. వాస్తవానికి, తెలంగాణలో మహిళలకు రూ.2500, రైతుబంధు సహా అనేక పథకాలు అమలుకావడం లేదన్న విషయం అందరికీ తెలుసు. అందుకే, ప్రధాని మోదీతో పాటు బీజేపీ నేతలు తెలంగాణలో అమలుకు నోచుకోని ఆరు గ్యారెంటీల గురించి మహారాష్ట్రలో ప్రచారం చేస్తున్నారు.
ఎన్నికల్లో ఇచ్చిన కొత్త హామీల మాట దేవుడెరుగు.. గతంలో అమలవుతున్న పథకాలకే దిక్కు లేదు. కేటీఆర్‌కు సవాల్ చేసిన కోమటిరెడ్డి వెంటక్రెడ్డికి ఇప్పుడు దాని గురించి మాట్లాడే తీరిక లేదనుకుంటా. హామీల అమలుకు నిధులు లేవు కాబట్టి, అమలు చేయడం లేదు. కానీ, బూతులు తిట్టడానికి ఎలాంటి నిధులు అవసరం లేదు కదా? అందుకే, ముఖ్యమంత్రి మొదలుకొని మంత్రులు, పార్టీ నేతల వరకు తిట్ల దండకం అందుకుంటున్నారు. విచ్చలవిడిగా బూతులను ఖర్చు చేస్తున్నారు.
ప్రభుత్వ సొమ్ముతో ఇతర రాష్ర్టాల్లో ప్రకటనలు ఇచ్చారని గతంలో కేసీఆర్ సర్కార్‌ను ప్రశ్నించిన రేవంత్‌రెడ్డి నేడు తెలంగాణలో ఆరు గ్యారెంటీలు అమలవుతున్నాయంటూ ఎన్ని కలు జరుగుతున్న మహారాష్ట్రలో ప్రకటనలు ఇచ్చారు. మహిళలకు నెలకు రూ.2500, రైతుబంధు సహా అన్ని హామీలను నెరవేర్చినట్టు ప్రకటించుకోవడం సిగ్గుచేటు. వాస్తవానికి, మహిళలకు రూ.2500, రైతుబంధు సహా అనేక పథకాలు అమలుకావడం లేదన్న విషయం అందరికీ తెలుసు. అందుకే, ప్రధాని మోదీతో పాటు బీజేపీ నేతలు తెలంగాణలో అమలుకు నోచుకోని ఆరు గ్యారెంటీల గురించి మహారాష్ట్రలో ప్రచారం చేస్తున్నారు.
ఉమ్మడి రాష్ట్రంలో, తెలంగాణలోనూ గతం లో ఎప్పుడూ ఒక ముఖ్యమంత్రిని సామాన్యులు ఈ స్థాయిలో తిట్టలేదు. అదే విధంగా సీఎం, మంత్రులు కూడా హద్దులు మీరి పరుష పదజాలంతో మాట్లాడలేదు. అధికారంలో ఉన్నవారు హుందాగా ఉండాలి. అత్యున్నత పదవుల్లో ఉన్నవారే బూతులు మాట్లాడుతుంటే బాధితులైన సామాన్యులు మాట్లాడటం తప్పేమీ కాదు. తమ ఇండ్లు కూల్చివేస్తే, పొలాలను లాక్కొంటుంటే, ఇచ్చిన హామీలు అమలు చేయకపోతే ప్రజలు ఆగ్రహించడం సహజం. అనేక కారణాల వల్ల రేవంత్‌రెడ్డికి మీడియా నుంచి ఆశించిన దానికన్నా ఎక్కువ సహకారం లభిస్తోంది. అయితే, ప్రధాన మీడియా కంటే సామాజిక మాధ్యమాల ద్వారానే ప్రజల ఆగ్రహం బయటి ప్రపంచానికి తెలుస్తున్నది.
సామాజిక మాధ్యమాలు, బాధితులు స్వయంగా వీడియోలు బయటకు వదులుతుండటంతో ప్రజల ఆగ్రహం ఏ స్థాయిలో ఉందో తెలుస్తున్నది. అంతేతప్ప, మెయిన్‌స్ట్రీమ్ మీడియా ద్వారా కానే కాదు. హైదరాబాద్‌లో జర్నలిస్టుల ఇండ్ల సమస్య పరిష్కరించానని, సహకరిస్తే రెండోసారి అధికారంలోకి వస్తే రెండో విడత ఇళ్ల స్థలాలు ఇస్తానని ఓ సభలో ఇటీవల సీఎం ప్రకటించారు. తద్వారా ఇండ్ల స్థలాల కోసం జర్నలిస్టులు ఏం చేయాలో పరోక్షంగా ఆయన కర్తవ్య బోధ చేశారు. నిజానికి జర్నలిస్టుల సమస్య పదేండ్ల కిందటిది కాదు. 20 ఏండ్ల నుంచి ఆ సమస్య ఉన్నది. డబ్బులు చెల్లించిన జర్నలిస్టులు రెండు దశాబ్దాలుగా కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు. ప్రస్తుతం హైకోర్టులో కేసు నడుస్తున్నది. ఆ సమస్య ఇంకా ఓ కొలిక్కి రాకాలేదు. ‘ఏడ్చే దాని మొగుడు వస్తే నా మొగుడు వస్తా’డని ఓ సామెత చెప్పినట్టు.. మొదటి విడత జర్నలిస్టుల సమస్యే పరిష్కారం కాలేదు. ఇక రెండవ విడత ఎప్పుడో?
అడ్డమైన నాయకులకు పోలీసులు సేవ చేస్తారని, వారికి పని గంటలు ఉండాలని గతంలో రేవంత్‌రెడ్డి మాట్లాడిన వీడియో పోలీసుల ఆందోళన సమయంలో బాగా వైరల్ అయింది. అదేవిధంగా గతంలో బీఆర్ఎస్ సర్కార్ ఇంటింటి సర్వే చేసిన సమయంలో టీడీపీ అధ్యక్షుడిగా రేవంత్‌రెడ్డి.. ‘అడ్డమైనవాళ్లు ఇంటికి వచ్చి వివరాలు అడిగితే చెప్పాలా? బుర్ర ఉన్నవాళ్లు ఎవరైనా ఇలా సర్వే చేస్తారా?’ అంటూ నోటికొచ్చినట్టు మాట్లాడారు. అదే రేవంత్‌రెడ్డి ఇప్పుడు ఆస్తులతో పాటు అన్ని వివరాలు అడుగుతూ సర్వే చేయిస్తున్నారు. దాంతో రేవంత్‌రెడ్డి పాత వీడియో సోషల్ మీడియాలో మరోసారి వైరల్‌గా మారింది.
ఇంటింటికి వచ్చి సర్వే చేస్తున్న సిబ్బందిలో ప్రజలు ప్రభుత్వాన్ని చూస్తున్నారు. ఈ నేపథ్య ంలోనే ప్రభుత్వంపై ఆగ్రహంతో ఉన్నవారు సిబ్బందిపై ఆ కోపాన్ని చూపిస్తున్నారు. పెద్ద వయసువాళ్లు కూడా సీఎంను బూతులు తిడుతున్నారని సిబ్బంది మీడియాకు చెప్పారు. సర్వేకు వెళ్లిన ఎవరిని పలకరించినా ఇవే మాట లు. వారి వీడియోలు వైరల్ అవుతుండటంతో మీడియాతో మాట్లాడవద్దని సిబ్బందికి అధికారులు వార్నింగ్ ఇచ్చే పరిస్థితి వచ్చింది. నాలుగేండ్ల తర్వాత మళ్లీ ప్రజల ముందుకు వెళ్లినప్పుడు తాము ఇది చేశామని చెప్పుకొనేటట్టు పాలన ఉండాలి. అంతేకానీ, దేశంలో ఎక్కడా లేని విధంగా తాము ఇన్ని బూతులు తిట్టామని చెప్పుకొంటే ప్రజలు హర్షించరు. ప్రధాన మీడియాను దాటి సామాజిక మాధ్యమాలు ముందుకెళ్తున్న ప్రస్తుత తరుణంలో ఆ బూతులే కాంగ్రె స్ మెడకు చుట్టుకుంటాయి.
– బుద్దా మురళి