నాలుగోసారి ఢిల్లీ ఎన్నికల బరిలో దిగుతున్న ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) అధినేత అరవింద్ కేజ్రీవాల్ మరోమారు సీఎం కుర్చీపై కన్నేశారు. పదకొండేండ్ల క్రితం 2013లో తొలిసారి పోటీ చేసి మెజారిటీ రాకున్నా ఆయన సీఎం అయ్యారు. అయితే, 48 రోజులు మాత్రమే అధికారంలో ఉన్నారు. ఆ తర్వాత వరుసగా 2015, 2020 ఎన్నికల్లో తిరుగులేని విజయం సాధించారు. అయితే, ఈసారి మాత్రం బీజేపీ రూపంలో ఆయనకు పెనుసవాలు ఎదురుకాబోతున్నది.
ఫిబ్రవరి 5న జరుగనున్న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు కోసం బీజేపీ అన్ని అస్ర్తాలను సిద్ధం చేసుకొని పెట్టుకున్నది. 1998 డిసెంబర్లో ఓడిన తర్వాత బీజేపీ ఇప్పటివరకు అక్కడ అధికారంలోకి రాలేకపోయింది. పార్లమెంట్ ఎన్నికల్లో తిరుగులేని విజయం సాధిస్తున్నా ఢిల్లీ సీఎం పీఠం మాత్రం ఆ పార్టీకి అందని ద్రాక్షగా మారింది. ఈ నేపథ్యంలో ఈసారి గెలుపు కోసం సర్వశక్తులు ఒడ్డుతున్నది. ‘ఆప్’ ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రజా సంక్షేమ పథకాలకు ప్రజల నుంచి విశేష మద్దతు లభిస్తున్నది. ఇక, 1998-2013 మధ్య 15 ఏండ్లపాటు అధికారంలో ఉన్న కాంగ్రెస్ ఒక్క సీటూ గెలువలేకపోయింది. మరోవైపు, అసెంబ్లీ ఎన్నికల్లో వరుసగా విజయాలు సాధిస్తున్న ‘ఆప్’కు పార్లమెంటు ఎన్నికలు మాత్రం కొరుకుడుపడటం లేదు. ఏడు స్థానాల్లో ఒక్కటంటే ఒక్క దాంట్లోనూ విజయం సాధించలేక చతికిలపడుతున్నది. గత ఎన్నికల్లో విజయం సాధించిన కేజ్రీవాల్‌ను కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఇబ్బందులు పెడుతూ వస్తున్నది. కేంద్రపాలిత ప్రాంతంగా ఉన్న ఢిల్లీలో అంతంత మాత్రంగానే ఉండే అధికారాలను కూడా అడ్డుకుంటున్నది. తనకు అనుకూలమైన లెఫ్టినెంట్ గవర్నర్లను నియమించుకొని అడుగడుగునా అడ్డంకులు సృష్టిస్తున్నది. ‘ఆప్’లో నంబర్ టూగా పరిగణించే ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియాను అవినీతి కేసులో నెలలపాటు నిర్బంధించింది.
మరోవైపు ఢిల్లీ మద్యం పాలసీ కేసులో కేజ్రీవాల్‌ను కూడా అరెస్ట్ చేసి జైలుకు పంపింది. లోక్‌సభ ఎన్నికలకు ముందు అరెస్ట్ అయిన ఆయన 5 నెలలపాటు జైలులో గడిపారు. బెయిలుపై బయటకు వచ్చాక సెప్టెంబర్ 17న ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి క్యాబినెట్లో కీలక సభ్యురాలు ఆతిశీ మార్లెనాకు ప్రభుత్వ పగ్గాలు అప్పగించారు. కేజ్రీవాల్‌కు అత్యంత నమ్మకస్థురాలు, విధేయురాలైన మంత్రిగా పనిచేసిన ఆమె నేతృత్వంలోని ‘ఆప్’ సర్కారు పాత సంక్షేమ పథకాలను కొనసాగిస్తూనే కొత్త వాటిని ప్రకటించింది. వాటిలో ముఖ్యమైనది ‘ముఖ్యమంత్రి మహిళా సమ్మాన్ యోజన’. ఈ పథకం కింద అర్హులైన మహిళలకు ప్రతినెల రూ. 1000 చొప్పున అందిస్తారు. కాంగ్రెస్, బీజేపీ కూడా ఇలాంటి నగదు బదిలీ పథకాలనే పోటాపోటీగా ప్రకటించాయి. ప్రజా సంక్షేమ పథకాలతోపాటు విద్య, వైద్య రంగాల్లో పేద, దిగువ మధ్య తరగతి ప్రజలకు చేసిన మేలు కారణంగా ఈ ఎన్నికల్లో సైతం విజయంపై ‘ఆప్’ ధీమాగా ఉన్నది.
అయితే, రాజకీయ పండితులు మాత్రం ఈ అసెంబ్లీ ఎన్నికలు పాలకపక్షమైన ‘ఆప్’కు అత్యంత కఠిన పరీక్షగా మారనున్నాయని అంచనా వేస్తున్నారు. ‘ఆప్’ అగ్రనేతల్లో చాలామంది నిన్నమొన్నటి వరకు వివిధ అవినీతి కేసుల్లో నిర్బంధంలో ఉన్నారు. అయినా, కేజ్రీవాల్ దూకుడు, పోరాట పటిమతో ఎన్నికల ప్రచారంలో జాతీయపక్షాలైన బీజేపీ, కాంగ్రెస్ కన్నా చాలా ముందున్నట్టు కనిపిస్తున్నది. ఇప్పటికే అన్ని సీట్లకూ ఆప్ తమ అభ్యర్థులను ప్రకటించింది. 29 స్థానాల్లో బీజేపీ అభ్యర్థుల జాబితా విడుదల చేశారు. గతంలో 15 ఏండ్లపాటు అధికారంలో ఉన్నా దేశంలోని మిగతా ప్రాంతాల్లో మాదిరిగానే హస్తినలో కూడా జనం మద్దతును కాంగ్రెస్ కోల్పోయింది. గత పదేండ్లుగా ఢిల్లీ అసెంబ్లీలో ఒక్క ఎమ్యెల్యే కూడా లేని ఈ జాతీయపక్షం గతమెంతో ఘనమనే భ్రమల నుంచి ఇంకా బయటపడటం లేదు. ఒంటరి పోరుకు భయపడుతున్న ఈ పార్టీ చివరి క్షణంలోనైనా ‘ఆప్’తో పొత్తు కుదరకపోతుందా అనే ఆశతో కాలం గడుపుతున్నది. కిందటి లోక్‌సభ ఎన్నికల్లో ఆప్-కాంగ్రెస్ పొత్తు మంచి ఫలితాలు ఇవ్వకపోగా ‘ఆప్’కు నష్టదాయకంగా మార్చింది. పొరుగున్న ఉన్న హరియాణాలో మాదిరిగానే ఆప్, కాంగ్రెస్ మధ్య ఢిల్లీలో పొత్తు ఉండదని కేజ్రీవాల్ ఇది వరకే ప్రకటించారు. ఈడీ, సీబీఐలను ‘ఆప్’ నేతలపై ఆయుధాలుగా వాడిన బీజేపీ విషయానికి వస్తే కేజ్రీవాల్ మళ్లీ అధికారంలోకి రాకుండా అన్ని ప్రయత్నాలూ చేస్తున్నది. ఒకవేళ ‘ఆప్’ గతంలో మాదిరిగా భారీ మెజారిటీతో గెలిచినా ఆ పార్టీ జాతీయ కన్వీనర్ కేజ్రీవాల్ ముఖ్యమంత్రి కావడానికి న్యాయపరమైన చిక్కులున్నాయా? లేవా? అనే విషయంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. లోక్‌సభ ఎన్నికల్లో కాస్త కోలుకుందనుకున్న కాంగ్రెస్ ఇటీవలి హరియాణా, మహారాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో చావు దెబ్బతిన్న కారణంగా ఢిల్లీ రేసులో అసలు ఉందా? అనే అనుమానం వస్తున్నది. ‘ఫిర్ లాయేంగే కేజ్రీవాల్’ (కేజ్రీవాల్‌ను మళ్లీ గద్దెనెక్కిద్దాం) అనే ఆమ్ ఆద్మీ పార్టీ నినాదానికి, ‘బదల్ కే రహేంగే’ (పాలకపక్షాన్ని మార్చేద్దాం) అనే బీజేపీ పిలుపు మధ్య జరుగుతున్న ప్రజా సమరంలో గెలుపు ఎవరిదో వచ్చే ఫిబ్రవరి 8న జరిగే ఓట్ల లెక్కింపుతో తేలిపోతుంది.