తెలంగాణలో తమ ప్రభుత్వపు తీరు పట్ల కాంగ్రెస్ అధిష్ఠానం ఎందుకు ప్రేక్షక పాత్ర వహిస్తున్నదనే ప్రశ్నను తరచూ వింటున్నాము. ఈ మాట ప్రతిపక్షాల నుంచే గాక, రాజకీయాలను గమనిస్తూ ఉండే సాధారణ పరిశీలకుల నుంచి కూడా వస్తున్నది.
రాష్ర్టాల స్థాయిలో పార్టీ పరిస్థితిని, పార్టీ ప్రభుత్వాల పాలనను ఎప్పటికప్పుడు గమనించటం, అవసరమనుకున్న మార్పులు జరిగేట్టు చూడటం అధిష్ఠానం నిర్వహించే బాధ్యతల్లో ఒకటని మనకు మొదటినుంచి తెలుసు. అట్లా జరగటాన్ని చూస్తూ వస్తున్నాము కూడా.
కాని, నెహ్రూ నుంచి మొదలుకొని సోనియాగాంధీ కాలం వరకు కనిపించిన ఈ పద్ధతులు రాహుల్ గాంధీ నాయకత్వం వచ్చేసరికి ఎందువల్ల మారినట్టు? ఇది జాగ్రత్తగా అర్థం చేసుకోవలసిన విషయం. ఇది తెలిస్తే గాని తెలంగాణ గురించి అర్థం కాదు.
గత పరిస్థితుల్లోకి వెళ్లేముందు వర్తమానం గురించి కొంత చెప్పుకోవాలి. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడాది అయింది. అంతకుముందు పదేండ్లు పాలించిన బీఆర్ఎస్ను ఎంత అనూహ్యంగా ఓడించి అధికారానికి వచ్చారో, అంతే అనూహ్యమైన వేగంతో ప్రజల దృష్టిలో అప్రతిష్ట పాలవుతున్నారు. అందుకు కారణాలు అనేకం. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయలేకపోవటం, ఆర్థిక స్థితి బాగా లేదని ప్రచారాలు చేస్తూనే అధికారం కోసం అలవికాని హామీలివ్వటం, దారీ తెన్నూ లేని పరిపాలన, మాటల నుంచి చేతల వరకు అస్తవ్యస్తత, ఎన్ని విమర్శలు వచ్చినా ధోరణిని మార్చుకోకపోవటం, వ్యక్తిగతంగా అపసవ్యపు శైలి వంటివన్నీ ఈ కారణాలలోకి వస్తాయి. ఇది ఈ విధంగానే కొనసాగితే రాష్ట్ర నాయకత్వానికి కలిగే నష్టం ఎట్లున్నా, అసలు కాంగ్రెస్ పార్టీకే హాని జరగగలదని ఎవరైనా అంచనా వేయగలరు. అటువంటి ప్రమాదపు సూచనలు కన్పించినప్పుడు అధిష్ఠానం తమ పార్టీ ప్రయోజనాలను కాపాడుకునేందుకు అవసరమైన దిద్దుబాటు చర్యలు తీసుకోగలదని ఎవరైనా భావిస్తారు. కాని అట్లా జరగనిది ఎందుకు?
ముఖ్యంగా జాతీయ స్థాయిలో గాని, వివిధ రాష్ర్టాల్లో గాని కాంగ్రెస్ పరిస్థితి బాగా లేనపుడు ఇటువంటి చర్యలు మరింత అవసరం. జాతీయస్థాయిలో పార్టీ వరుసగా మూడవసారి అధికారానికి రాలేకపోయింది. దేశంలోని రాష్ర్టాలు 28 కాగా కేవలం మూడింట అధికారంలోకి వచ్చి మరొక మూడింట ప్రాంతీయ పార్టీలకు జూనియర్ భాగస్వామిగా అధికారంలో ఉంది. 140 సంవత్సరాల చరిత్ర కలిగి దశాబ్దాల పాటు ఏకచ్ఛత్రాధిపత్యంగా పాలించిన పార్టీకి ఇదెంత అవమానకర స్థితో వేరుగా చెప్పనక్కరలేదు. పార్టీ ఇటువంటి దశకు బలహీనపడినపుడు జాతీయ నాయకత్వం కేంద్రంతో పాటు రాష్ర్టాలలో కూడా సంస్థ తిరిగి బలపడేందుకు అవసరమైన చర్యలు తీసుకోవటం అవసరం. ఈ మాట కేంద్రంలో, రాష్ర్టాలలో తమ పార్టీ ప్రభుత్వాలకు వర్తిస్తుంది. ఈ దృష్టితోనే సోనియాగాంధీ తమ యూపీఏ ప్రభుత్వానికి దిశానిర్దేశం చేసేందుకు తన అధ్యక్షతన కమిటీలు వేశారు. అంతకన్న ముందు ఒక ఏఐసీసీ సెషన్లో రాష్ర్టాల గురించి ప్రత్యేకంగా చర్చిస్తూ, కాంగ్రెస్ ప్రభుత్వాల పరిపాలన మెరుగుగా సాగాలని, అవి ఇతర పార్టీల ప్రభుత్వాలకు ఆదర్శవంతంగా ఉండాలని, ప్రజలు మళ్లీ మళ్లీ కాంగ్రెస్ ప్రభుత్వాలనే ఎన్నుకునేట్టు సాగాలని అన్నారు. కానీ ఆ దశ గడిచిపోయింది.
ఇప్పుడు ఇదంతా ఎందుకు తలకిందులవుతున్నట్టు? అధిష్ఠానానికి పీసీసీలపై, రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వాలపై తగిన అజమాయిషీ ఉండాలంటే అర్థం ఇందిరాగాంధీ హయాంలో వలె వ్యక్తిగత ధోరణులు చూపాలని, స్వప్రయోజనాల కోసం రాష్ట్ర నాయకులను కీలు బొమ్మలుగా మార్చాలని కాదు. నిజానికి ఆ వైఖరి కూడా పార్టీ బలహీన పడటానికి కారణాలలో ఒకటి. కనుక, అటువంటి నియంతృత్వ వైఖరులు అక్కరలేదు గాని, అదే సమయంలో ప్రజాస్వామిక నియంత్రణలు అవసరం. ఇందిర అనుసరించిన పద్ధతులలో సోనియా గాంధీ తగినంత ప్రజాస్వామికతను ప్రవేశపెట్టారు. రాష్ట్ర ముఖ్యమంత్రులను, కాంగ్రెస్ అధ్యక్షులను చీటికి మాటికి మార్చకపోవటం వాటిలో ఒకటి. అదే సమయంలో వారిపై పర్యవేక్షణలు, నియంత్రణలు కొనసాగించారు. ఆ కాలానికి సంబంధించి మరొక గమనించదగిన విషయం అప్పటి నాయకులలోనూ కాంగ్రెస్ సంప్రదాయిక రాజకీయ సంస్కృతి తగినంత ఉండేది.
ఇదంతా ఆ తర్వాత కాలంలో బలహీనపడుతూ వస్తున్నది. ఆ కారణంగానే ఈ రోజున మనం తెలంగాణ విషయంలో చూస్తున్నవిధంగా పరిస్థితులు, నాయకత్వాల తీరు మారుతున్నది. వారిపై అధిష్ఠానం తనంతట తానుగానే నియంత్రణ కోల్పోతుండటం ఒకటైతే, గతంలో వలె నియంత్రించే శక్తి స్వీయ బలహీనతల వల్ల స్వతహాగా తగ్గటం మరొకటి అవుతున్నది.
ఈ మార్పుల పర్యవసానంగా అధిష్ఠానం పాత్ర పర్యవేక్షణలు, నియంత్రణల దశ నుంచి ప్రేక్షక పాత్రకు క్రమంగా మారుతున్నది. మొత్తం మీద కాంగ్రెస్ మౌలికంగానే బలహీన పడుతుండటానికి సూచికలు ఇవన్నీ. క్రమంగా అధికారాన్ని కోల్పోతుండటం, పార్టీ వ్యవస్థ బలహీనపడుతుండటం, మనుగడ కోసం ఇతర పార్టీలపై ఆధారపడటం వంటివి ఒక విధమైన సూచికలు కాగా, తమ నాయకులను తాము పర్యవేక్షించి, నియంత్రించలేకపోవటమన్న తెలంగాణ వంటి పరిస్థితి మరొక విధమైన సూచిక.
ఇటువంటి మలుపు సుమారు 2014 ఎన్నికల ప్రాంతం నుంచి మొదలైంది. అప్పుడు కనిపించిన పరిణామాలు మూడున్నాయి. ఒకటి, పార్టీ లోక్‌సభ ఎన్నికలలో అధికారాన్ని కోల్పోవటమే గాక, సీట్ల సంఖ్య తమ చరిత్రలోనే ఎన్నడూ లేనివిధంగా 50 కన్న దిగువకు పడిపోయి, ప్రతిపక్ష హోదా అయినా లభించకపోవడం. రెండు, సోనియా గాంధీ ఆరోగ్యం దెబ్బతినగా ఆమె క్రియాశీలతలో తగ్గుముఖం. మూడు, గాంధీ కుటుంబ వారసునిగా ముందుకువచ్చిన రాహుల్‌గాంధీ, ప్రత్యక్ష రాజకీయాలలో తన ప్రవేశం జరిగి (2004) అప్పటికి పదేండ్లు గడిచినా, 2004-14 మధ్య తమ పార్టీ అధికారంలో ఉండినప్పటికీ ఏమీ నేర్చుకొనక, అసమర్థుడనే పేరు తెచ్చుకోవడం. ఈ మూడింటికి మూడు పరిస్థితులూ 2014 నుంచి ఇప్పటివరకు మరొక పదేండ్లు గడిచినా కొనసాగుతూనే ఉన్నాయి.
విషయం ఏమంటే, ఇటువంటి పరిస్థితులు పరిణామాల మధ్య ఒక బలహీనమైన పార్టీ అధిష్ఠానం, తెలంగాణ తరహా విశృంఖల నాయకత్వాన్ని పర్యవేక్షించలేదు, నియంత్రించలేదు. అది దాదాపుగా తన శక్తికి మించిన పని. అది ఒక నిస్సహాయ స్థితి. మరీ తన చాప కిందకు నీళ్లు వస్తే తప్ప. వారికి కావాల్సింది కర్ణాటక, హిమాచల్‌తో పాటు తెలంగాణలో ఏదో ఒకవిధంగా అధికారం నిలబెట్టుకోవడం. పార్టీ ఆర్థికావసరాలను ఆ ప్రభుత్వాల ద్వారా నెరవేర్చుకొనటం. ఆ రాష్ర్టాలలోని పార్టీ సభ్యులకు ప్రస్తుతం గల అధికార, ఆర్థిక ఆకర్షణలను కొనసాగిస్తూ వారు ఇతర పార్టీలలోకి మారకుండా చూసుకోవటం. ఇవన్నీ జరిగినంత కాలం తెలంగాణ నాయకత్వం ఏమి చేసినా, చేయకున్నా ప్రేక్షక పాత్ర వహించటం. అంతకుమించి మరేమైనా చేయగల ఇందిర కాలపు వంటి శక్తి సామర్థ్యాలు ఇప్పుడు లేనందున, అంతకుమించి చేయగలిగింది కూడా లేదు. పైన అనుకున్నట్టు తమ చాప కిందకు నీరు వస్తే తప్ప.