ఇరవయ్యో శతాబ్దం కమ్యూనిస్టు శతాబ్దం అని ఘంటాపథంగా చెప్పవచ్చు. 1917లో రష్యా, 1949లో చైనా విప్లవాలు ప్రధానమైనవైతే వాటి స్ఫూర్తితో ప్రపంచవ్యాప్తంగా కమ్యూనిజం పరిఢవిల్లింది. అభివృద్ధి చెందిన దేశాల్లో, అంటే సంపన్న, వలసవాద, పారిశ్రామిక దేశాల్లో కమ్యూనిస్టు భావజాలం అంతగా విస్తరించలేకపోయింది. వలస విముక్తి ఉద్యమాలు జోరందుకున్న లేదా నవస్వతంత్ర దేశా ల్లో మాత్రం దండిగా మార్మోగింది. అలాంటి దేశాల్లో భారత్ మొదటి వరుసలో ఉంటుంది. సాంప్రదాయిక భావజాల ప్రతినిధి అయిన ఆర్ఎస్ఎస్ ఆవిర్భవించిన 1925లోనే కమ్యూనిస్టు పార్టీ ఊపిరిపోసుకుంది.
ఆర్ఎస్ఎస్ కుటుంబానికి చెందిన బీజేపీ తన అధికారాన్ని పటిష్టపరచుకుంటున్న తరుణంలో కమ్యూనిస్టులు కనుమరుగైపోతుండటం ఓ వైచిత్రి. రాజ్యాంగం అమలులోకి వచ్చిన తర్వాత 1951 -52 నాటి తొలి ఎన్నికల్లో వారు గణనీయమైన విజయాలు సాధించారు. నల్గొండ నుంచి కమ్యూనిస్టు నేత రావి నారాయణరెడ్డి, తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూను మించిన మెజారిటీ సాధించడం గురించి అప్పట్లో గొప్ప గా చెప్పుకొన్నారు.
తొలి పార్లమెంటు విపక్షంలో అతిపెద్ద వర్గం కమ్యూనిస్టులే. తాజాగా ఐదు రాష్ర్టాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత దేశంలో కమ్యూనిస్టుల పలుకుబడి అడుగంటిన సూచనలు కనిపిస్తున్నాయి. సు మారు 50 ఏండ్లలో ఏ రాష్ట్రంలోనూ కమ్యూనిస్టు ప్రభుత్వం లేని పరిస్థితి వచ్చింది. కేరళలో పినరయి విజయన్ ప్రభుత్వ ఓటమి కీలక పరిణామమే. దీంతో దేశ రాజకీయాల్లో కమ్యూనిస్టుల శకం అంతరించినట్టేననే వ్యా ఖ్యానాలు వినిపిస్తుండటం గమనార్హం. ప్రజాస్వామ్యంలో ఫలానాపార్టీ పని పూర్తిగా అయిపోయినట్టేనని చెప్పడం కుదరదు.
1957లో కేరళలో ఈఎంఎస్ నంబూద్రిపాద్ నేతృత్వంలో కమ్యూనిస్టు ప్రభుత్వం ఏర్పడింది. ప్రజాస్వామిక విధానంలో కమ్యూనిస్టులు అధికారంలోకి రావడం ప్రపంచంలో అదే మొదటిసారి. సాధారణంగా కమ్యూనిస్టుపార్టీ అధికారంలోకి రావాలంటే కత్తులు కటార్ల హింసాత్మక మంత్రసాని అవసరమనే అపప్రథ ఆ విధంగా తొలగిపోయింది. అయితే కమ్యూనిస్టులు అధికారంలోకి రావడం, కమ్యూనిజం రావడం రెండూ వేరువేరు సంగతులనేది గుర్తుంచుకోవాలి. ఆ సంగతి అలా ఉంచితే తొలిసారి ఏర్పడ్డ నంబూద్రిపాద్ ప్రభుత్వాన్ని కేంద్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం కూల్చివేసింది. హైదరాబాద్ రాష్ట్ర సీఎంగా పనిచేసి ఆపై కేరళ గవర్నర్గా వెళ్లిన బూర్గుల రామకృష్ణారావు పంపిన నివేదిక ఆధారంగా కేంద్రం ఆ చర్య తీసుకున్నది అనేది ఈ సందర్భంగా గుర్తుచేసుకోవాలి. ఇదే బూర్గులను తెలంగాణ విడిగా ఉంటే కమ్యూనిస్టులు అధికారంలోకి వస్తారనే బూచి చూపించి పెద్దమనుషుల ఒప్పందానికి తలవూపేలా చేశారని చెప్పుకొంటారు.
ఆవిధంగా గణనీయమైన రాజకీయ పలుకుబడితో ప్రత్యర్థులను బెదరగొట్టే స్థాయి కి చేరుకున్నారు కమ్యూనిస్టులు. కేరళ తర్వాత బెంగాల్, త్రిపుర ఇలా మొత్తం మూడు రాష్ర్టాల్లో వామపక్ష ప్రభుత్వాలు సుదీర్ఘకాలం కొనసాగాయి. కానీ ఇప్పుడదంతా గత వైభ వం. మారిన పరిస్థితుల్లో దానిని తిరిగి రాబట్టుకోవడం అంత సులభం కాదని మాత్రం చెప్పవచ్చు. కేంద్రంలో కాంగ్రెస్ ఆధిపత్యం వీగిపోయి, సంకీర్ణ ప్రభుత్వాల కాలంలో కమ్యూనిస్టులు హస్తినలో మంత్రి పదవులూ చేపట్టారు.
ఓ దశలో కమ్యూనిస్టు సీనియర్ నేత జ్యోతిబసును ప్రధాని పదవి చేపట్టే అవకాశమూ తలుపు తట్టింది. అంతటి ఉన్నతస్థితి నుంచి, నేడు ఏమాత్రం ప్రాముఖ్యం లేని స్థాయికి కమ్యూనిస్టులు పడిపోయారు. కేరళంలో తమను ఓడించిన కాంగ్రెస్తో తెలంగాణలో అంటకాగడం, ఒకటి రెండు స్థానాల కోసం వెంపర్లాడటం వారి దైన్యాన్ని కండ్లకు కడుతున్నది. ఎన్టీఆర్ కాలం నాటి సింగిల్ ఎంగిలి మెతుకుల ప్రహసనాన్ని గుర్తుకుతెస్తున్నది.
రష్యాలో కమ్యూనిజం కుప్పకూలింది. చైనాలో రంగుమారింది. వేళ్ల మీద లెక్కించగలిగే దేశాల్లో మాత్రమే ఇప్పుడు కమ్యూనిస్టు ప్రభుత్వాలు మనుగడ సాగిస్తున్నాయి. భారత్లో పార్లమెంటరీ పంథాలో వెళ్లిన కమ్యూనిస్టులు కనుమరుగవుతుంటే, మరోవైపు సాయు ధ పోరాటాన్ని ఎంచుకున్న కమ్యూనిస్టులు కగార్ ధాటికి నేలకొరుగుతున్నారు. అసలు మనదేశంలో అనేముంది? మొత్తంగా ప్రపంచంలోనే కమ్యూనిస్టుల ప్రభావం అడుగంటింది.
కమ్యూనిస్టుల ’చారిత్రిక తప్పిదాలు’, ప్రజల్లో పెరిగిన వినిమయతత్వం అందుకు దారితీశాయి అనేది అక్షరసత్యం. ప్రజలిప్పుడు డబ్బు సంపాదించటం, ఖర్చు పెట్టటం గురించి తప్ప విప్లవాలు, ఉద్యమాల గురించి ఎక్కువగా ఆలోచించటం లేదు. ఘనీభవించిన సిద్ధాంతాలు, కాలం చెల్లిన వ్యూహాలు, ఎత్తుగడలూ కమ్యూనిస్టుల మహాప్రస్థానానికి బ్రేకులు వేశాయి. ఇప్పటికైనా తమ గమ్యాన్ని, గమనాన్ని బేరీజు వేసుకుని దిద్దుబాట పట్టకపోతే మనదేశంలో పాదుకున్న పార్లమెంటరీ కమ్యూనిజం కాలగర్భంలో కలిసిపోక తప్పదు.