ఇప్పుడు మార్కెట్లో ఎక్కడ చూసినా నిగనిగలాడే మామిడి పండ్లు రాసులుగా కనిపిస్తున్నాయి. బంగారు వన్నెలో మెరిసిపోయే ఆమ్ర ఫలాలు చూసి.. ధర ఎక్కువైనా కొనేస్తుంటారు. కానీ, సిసలైన పండు తక్కువ వన్నెతో మన్నికగా కనిపిస్తుంది. అయితే, దురదృష్టవశాత్తూ ఎక్కువ లాభాల కోసం విక్రయదారులు రసాయనాలను ఉపయోగించి మామిడి పండ్లను మగ్గబెడుతున్నారు. ఇందుకోసం మగ్గడానికి క్యాల్షియం కార్బైడ్‌ను ఉపయోగిస్తున్నారు. ఇది శరీరంలోకి చేరితే తలనొప్పి, కళ్లు తిరగడం, కడుపులో మంట, వాంతులు వంటి సమస్యలు వస్తాయి. అసలు మనం కొనే పండు ఆరోగ్యకరమైనదా? కాదా? అని ఎలా తెలుసుకోవాలంటే..
రంగు చూడండి: సహజంగా పండిన మామిడి పండ్లు అన్నీ ఒకే రంగులో ఉండవు. వాటిపై ఆకుపచ్చ, పసుపు, కొన్ని పండ్లు నారింజ రంగుతో కనిపిస్తాయి. పండు మీద పచ్చదనం అస్సలు లేకుండా.. నిండైన పసుపు లేదా బంగారు వన్నెలు ఈనుతూ కనిపించిందంటే.. అది రసాయనాలతో కృత్రిమంగా మగ్గబెట్టిందని అనుమానించాలి.
తొడిమ వాసన: సహజంగా పండిన మామిడి పండు నుంచి అద్భుతమైన తియ్యని సువాసన వస్తుంది. తొడిమ దగ్గర ఈ వాసన ఎకువగా ఉంటుంది. రసాయనాలతో పండించిన పండ్లకు వాసన తక్కువ. కొన్ని పండ్ల నుంచి ఘాటైన వాసనలు కూడా వెలువడుతాయి.
పరీక్షించండి: సహజంగా పండిన పండును మెల్లగా నొకినప్పుడు అది అంతటా సమానంగా మెత్తగా ఉంటుంది. కానీ, కృత్రిమంగా మగ్గపెట్టినవి పైన మెత్తగా ఉన్నా, లోపల మాత్రం గట్టిగా ఉంటాయి. కొన్ని పండ్లు మరీ వింతగా, ముద్దలా అనిపించవచ్చు.
మచ్చలు, ముడతలు: సాధారణంగా పండ్లపై చిన్నచిన్న నల్లటి మచ్చలు ఉండటం సహజమే. అయితే, పండు అంతటా విపరీతమైన నల్లటి గుర్తులు, ముడతలు ఉన్నాయంటే.. అవి రసాయనాల్లో మునిగితేలాయని సంకేతం.
కోసి చూడండి: మామిడి పండును కోసినప్పుడు లోపల గుజ్జు అంతా ఒకే రకమైన రంగులో, జ్యూసీగా ఉండాలి. కృత్రిమంగా పండించిన పండ్లలో గుజ్జు అకడకడా తెల్లగా లేదా లేత పసుపు రంగులో ఉంటుంది.
నీటి పరీక్ష: మంచి పండును గుర్తించడానికి ఇది అత్యంత కచ్చితమైన పద్ధతి. ఒక బకెట్ నీటిలో మామిడి పండ్లను వేయండి. సహజంగా పండిన పండ్లు బరువుగా ఉండి నీటి అడుగుకు చేరుతాయి. రసాయనాల ప్రభావంతో మగ్గిన పండ్లు తేలికగా మారి నీటిపై తేలుతాయి.