అభివృద్ధంటే అద్దంలా మెరిసే రోడ్లు.. ఆకాశాన్నంటే బహుళ అంతస్తుల భవనాలుకాదు. ఆకలి ఎరుగని సమాజం. పస్తులుండని ప్రజలు. కానీ ఈ భూమ్మీద ప్రతీ ఏడుగురిలో ఒకరు నిత్యం ఖాళీ కడుపుతోనే నిద్రపోతుండటం కలవరపెట్టే అంశం. పేదరికం, ఆకలి విషయాల్లో భారత్ తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నది.
పోషకాహార లోపం.. చిక్కిపోయిన (ఐదేండ్లలోపు పిల్లలు) (ఎత్తుకు తగ్గ బరువులేని పిల్లలు ), ఎదుగుదలలేని పిల్లలు (వయస్సుకు తగ్గ ఎత్తులేని పిల్లలు), పిల్లల మరణాలు వంటి నాలుగు పారామీటర్స్ ఆధారంగా గ్లోబల్ హంగర్ ఇండెక్స్ అనే సంస్థ చేపట్టిన సర్వేలో ఆకలి సంక్షోభ విషయం తేలింది. తీవ్ర పోషకాహార లోపాన్ని ఎదుర్కొంటున్న ఐదేండ్లలోపు పిల్లలసంఖ్యలో మొత్తం 116 దేశాల్లో మన దేశం టాప్ ర్యాంక్‌లో ఉన్నది. వ్యవసాయ రంగంలో వినూత్న పరిశోధనల ఫలితంగా పంటల ఉత్పత్తి పెరుగుతున్నా, నేడు చాలా దేశాల్లో ప్రజలు ఆకలి బాధతో అలమటిస్తున్న దీన దృశ్యాలు ఇంకా కనిపిస్తున్నాయి. ఒకవైపు కరోనా విపత్తు, మరోవైపు పర్యావరణ విధ్వంసం, వీటికి తోడు అనేక దేశాల్లో అంతర్గత యుద్ధాలు వెరసి ఆహార కొరత కోట్లాది మంది జీవితాలను నరకంగా మారుస్తున్నది. ప్రపంచంలో ప్రతి తొమ్మిది మందిలో కనీసం ఒకరు తగిన ఆహారానికి నోచుకోవడం లేదని ఐక్యరాజ్య సమితి నివేదికలు నిగ్గుతేల్చాయి. పోషకాహార లోపం మహిళలు, పిల్లల పాలిట ప్రమాదకరంగా మారింది. నానాటికీ ప్రపంచ జనాభా పెరుగుతున్నందున ఆహార భద్రత అనేది అత్యంత ప్రాధాన్యత గల సమస్యగా పరిణమించింది.
ప్రపంచ దేశాలన్నింటిలో ఆహార ఉత్పత్తిలో మన దేశం రెండవ స్థానంలో ఉంటే, మరోవైపు పోషకాహార లోపంలో అగ్రస్థానంలో ఉండడం ఆశ్చర్యం కలిగించే అంశం, పాలు, పప్పుధాన్యా ల ఉత్పత్తిలో ఇండియా ప్రథమ స్థానంలో ఉండ గా బియ్యం, గోధుమలు, చక్కె ర, పల్లి, కూరగాయలు, పండ్లు, చేపల ఉత్పత్తిలో ద్వితీయ స్థానంలో ఉన్నది. ఆహార ధాన్యాల ఉత్పత్తి క్రమే ణా పెరిగినా, అదే క్రమంలో ఆకలి కూడా పెరగడం ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నది.
2021 అంచనాల ప్రకారం ప్రపంచ జనాభాలో 10 శాతం పోషకాహార లోపంతో, 30 శాతం తగిన ఆహారం దొరక్క ఇబ్బంది పడుతున్నారు. కరోనా మూలంగా అదనంగా 11.8 కోట్ల ప్రజలు ఆక లి కోరల్లో చిక్కుకున్నారు. 2021-22 లో రికార్డ్ స్థాయిలో 816 మిలియన్ టన్నుల ఆహారధాన్యాల ఉత్పత్తి జరిగింది. 2020-21లో 311 మిలియన్ టన్నులు, 2019-20లో 298 మిలియన్ టన్నులు ఉత్పత్తి సాధించింది. ఆహారధాన్యాలలో స్వయం సమృద్ధి సాధించినా పోషకాహార లోపం క్రమంగా పెరుగుతూనే ఉన్నది. ఇండియాలో దాదాపు 14 శాతం (అనగా 190 కోట్ల) ప్రజలు పోషకాహారలోపంతో, 20 శాతం 5-ఏండ్ల లోపు పిల్లలు తక్కువ బరువుతో, 35 శాతం పిల్లలు స్టంటెడ్ గ్రోతో, 52 శాతం 15-40 ఏండ్లలోపు మహిళలు రక్తహీనతతో సతమతమవుతున్నారు.
2022 ప్రపంచ ఆకలి సూచీ ప్రకారం 116 దేశాల్లో భారత్ 107 వ స్థానంలో ఉన్నది. దీన్ని బట్టి నరేంద్ర మోదీ చెప్పిన అచ్చే దిన్, సబ్ కా వికాస్ వంటి మాటలు నీటి మూటలని తేలిపోయింది. అన్నపూర్ణగా విరాజిల్లిన భారతదేశం ప్రపంచ దేశాలతో పోటీ పడకుండా, అన్నమో రామచంద్రా అనేలా దిగజారింది. ప్రపంచ దేశాల సగటు కంటే భారత్‌లో ఆకలి చావులు ఎక్కువని పలు నివేదికలు తెలిపాయి. ఏటా 3 లక్షల మంది బాలలు పోషకాహార లోపంతో ప్రాణాలు కోల్పోతున్నారని 2020 జాతీయ ఆరోగ్య నివేదిక నిగ్గు తేల్చింది.
పేదరిక నిర్మూలన అనేది మనదేశంలో ఒక నినాదంగా మాత్రమే ఉన్న ది.ఇకనైనా ఈ దుస్థితి మా రాలి. అందుకు అనువైన కార్యాచరణ పథకాలు సిద్ధం కావాలి. అప్పుడే అన్నపూర్ణ అన్న అర్థానికి సార్థకత ఉంటుంది.
(వ్యాసకర్త: తెలంగాణ గ్రాడ్యుయేట్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి)
మోటె చిరంజీవి: 99491 94327