వ్యతిరేకుల మీద కేసులు పెట్టినప్పుడు రాజకీయ నాయకులు తరచూ చెప్పే మాట ‘చట్టానికి చుట్టాలుండరు, చట్టం తన పని తాను చేసుకుపోతుంది, చట్టం దృష్టిలో అందరూ సమానులే’. వినటానికి, నమ్మటానికి ఇది చాలా బాగుంటుంది. మరి ఆచరణలో అలాగే జరుగుతుందా? ఏదైనా అనుకోని బలవన్మరణం, యాక్సిడెంట్ జరిగినప్పుడు ఎవరి వల్ల జరిగిందో వారే బాధ్యులని చెప్తుంటారు. కానీ, ఇప్పుడు అన్ని టీవీ చానళ్లలో మార్మోగుతున్న మాటలు, కథనాలు, చర్చలు అల్లు అర్జున్ సంధ్య థియేటర్‌కు వెళ్లినప్పుడు జరిగిన ఘటన చుట్టూ తిరుగుతున్నాయి. రాజధానిలోని అసెంబ్లీ నుంచి, మారుమూల పల్లెటూరులోని గల్లీ వరకు వాదోపవాదాలు జరుగుతున్నాయి. కేసు కోర్టు దాకా వెళ్లింది. కాబట్టి, న్యాయమూర్తులు న్యాయంగా తీర్పు చెప్తారని ఆశిద్దాం!
మరి రాజకీయ నాయకుల నేతృత్వంలో నడిచే ప్రభుత్వాల వల్ల నష్టపోయిన ప్రజల కష్టాలకు, వారి చావులకు కారకులెవరు? ఇవి చర్చించే విషయాలు కావా? అవేమిటో ఇప్పుడు చూద్దాం! చరిత్రను ఒకసారి పరికించి చూస్తే 1329లో గజనీ మహమ్మద్ తన రాజధానిని ఢిల్లీ నుంచి దేవగిరి పట్టణానికి మార్చాడు. అంతేకాదు, దానికి దౌలతాబాద్ అని పేరు కూడా పెట్టాడు. అయితే అక్కడి ప్రజలతోనే ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేయకుండా ఢిల్లీ నుంచి అధికారులతో పాటు వేల మంది ప్రజలను కూడా తరలించాడు. దీంతో అధికారులతో పాటు సామాన్య ప్రజలు కూడా అనారోగ్యం పాలయ్యారు. అంతేకాదు, వారిలో చాలామంది చనిపోయారు. దీనికి ఎవరు బాధ్యత వహించాలి? పాలకుడిని కూడా శిక్షించగలిగిన న్యాయస్థానం ఉంటే కేసు వేయవచ్చా? ఆలోచనలు బాగానే ఉన్నా, వాటి ఆచరణ సరిగ్గా లేకపోవంతో మహమ్మద్ బిన్ తుగ్లక్ ‘పిచ్చి తుగ్లక్’ అన్న బిరుదు తెచ్చుకున్నాడు. ఇప్పటికీ ప్రజల్లో ‘తుగ్లక్ పనులు’ అన్న నానుడి వాడుకలో ఉన్నది.
ఇంకా కుక్క కాట్లు, పాము కాట్లు, రోడ్డు ప్రమాదాలు, నేరగాళ్ల వల్ల చనిపోయినవారు ఎందరో? వారు ఎవరిని నిలదీయాలి? ఎవరి మీద కేసులు పెట్టాలి? ఇవేకాదు, ప్రభుత్వ అండతో రైతుల పంట పొలాలు లాక్కుంటూ, ఇతర స్థలాలను కబ్జాలు చేస్తూ సామాన్య ప్రజలను ఇక్కట్ల పాలు చేస్తున్న వారి మీద ఎవరు యాక్షన్ తీసుకుంటారు? సామాన్య ప్రజలను పట్టి పీడిస్తున్న వారిని ఎవరు శిక్షిస్తారు? వాటికి సమాధానం చెప్పేది ప్రభుత్వమే కదా? ప్రజా పాలన అంటే ప్రజలను గాలికి వదిలేయటమేనా?
1.పాఠశాలల్లో చదువుకునే చిన్న పిల్లలకు, భవిష్యత్తు మేధావులకు 2023 డిసెంబర్ దాకా నాటి ప్రభుత్వం సన్నబువ్వ, పుష్టికరమైన వంటకాలతో భోజనం పెట్టి ప్రభుత్వ పాఠశాలల స్థాయిని పెంచింది. ఆ ప్రభుత్వం మారి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచీ పాఠశాలల్లో పురుగుల బియ్యం, కుళ్లిపోయిన కూరలతో భోజనాలు పెడుతుండటంతో దాదాపు 1122 మంది విద్యార్థులు ఆస్పత్రుల పాలయ్యా రు. వారిలో 57 మంది చనిపోయారు. ఈ చావులకు ఎవరు బాధ్యులు? ఎవరి మీద కేసు వేయాలి?
2.నేటి ప్రభుత్వం అమలుచేస్తున్న పథకాల్లో అర్థం పర్థం లేని పథకం ఏదంటే.. ‘మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం’. ఇది రాష్ట్రం లో అమలవుతున్నప్పటి నుంచి సమాజం అతలాకుతలమవుతున్నది. ఇంట్లో ఖాళీగా ఎందుకు ఉండటం అని ఉద్యోగాలు చేయని మహిళలు రోజూ అటు ఇటూ తిరుగుతుండటంతో చదువుకునే విద్యార్థినీ విద్యార్థులకు, ఉద్యోగస్థులకు బస్సు ప్రయాణం నరకంగా మారింది. అంతేకాదు, ఈ పథకం చౌక ప్రయాణానికి అనువుగా ఉండే ఆటో డ్రైవర్ల పొట్ట కొట్టింది. సంపాదన లేక, ఆటోల ఈఎంఐలు కట్టలేక నిరాశ చెంది 95 మంది ఆటో డ్రైవర్లు ఆత్మహత్యలు చేసుకున్నారు. వారి కుటుంబాలు వీధినపడ్డాయి. ఈ చావులకు ఎవరు బాధ్యులు, ఎవరి మీద కేసు వేయాలి? ఏ ఆస్తులు లేని వీరి కుటుంబాలకు ఎవరు దిక్కు?
3.వలస పాలకుల నుంచి తెలంగాణ ప్రాంతానికి 2014లో విముక్తి కలిగింది. నాటినుంచే రాష్ట్రంలో ప్రాంతీయ పార్టీ పాలన మొదలైంది. క్రమంగా సామాన్య ప్రజలకు ఉపయోగకరమైనవి, వారి జీవన ప్రమాణాలు పెంచే పథకాలు రాష్ట్రంలో అమలయ్యాయి. 2014 నుంచి 2023 దాకా రైతుల ఆత్మహత్యలు లేకపోవడమే కాదు, దురదృష్టవశాత్తూ ఎవరైనా మరణిస్తే, ఆ రైతు కుటుంబానికి రూ.5 లక్షలు రొక్కం అందించి ఆ రైతు కుటుంబాన్ని నాటి ప్రభుత్వం ఆదుకున్నది.
అప్పటి వసతులు, అప్పటి పథకాలు ఇప్పు డు లేవు. అప్పుడున్న కరెంటు ఇప్పుడు లేదు. నీళ్లకు కటకట మొదలైంది, రుణమాఫీ పథకం సరిగా అమలుకావడం లేదు. ఫలితంగా 2024 లో 362 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఈ చావులకు ఎవరు బాధ్యులు? ఎవరి మీద కేసులు వేయాలి?
4.2023, డిసెంబర్ 7 నుంచి నేతన్నలకు బతుకమ్మ చీరలు నేసే అవకాశమే రాలేదు. ఇక ఇప్పుడు, తెలంగాణ తల్లి చేతుల్లోంచి బతుకమ్మ కూడా మాయమైంది. మున్ముం దు కూడా బతుకమ్మ చీరలు నేసే అవకాశం నేతన్నలకు వస్తుందనే ఆశ కూడా లేదు. ప్రభుత్వ నిరాసక్తత, పట్టింపులేని తనంతో 31 మంది చేనేత కార్మికులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. ఈ మరణాలకు బాధ్యులెవరు? ఎవరి మీద కేసులు వేయాలి?
5. డీనోసార్ వలె అకస్మాత్తుగా నగరంలో హైడ్రా క్రేన్స్ ప్రత్యక్షమయ్యాయి. తమ కష్టార్జితంతో కట్టుకున్న పేదల ఇండ్లు అవి కూల్చివేయడంతో వేల కుటుంబాలు, చిన్న చిన్న వ్యాపారులు రోడ్డున పడ్డారు. ఈ దురాగతాన్ని చూడలేక ఇద్దరు, ముగ్గురు వ్యక్తులు గుండెపోటుతో మరణించారు. ఈ మరణాలకు ఎవరు బాధ్యులు?
ఇంకా కుక్క కాట్లు, పాము కాట్లు, రోడ్డు ప్రమాదాలు, నేరగాళ్ల వల్ల చనిపోయినవారు ఎందరో? వారు ఎవరిని నిలదీయాలి? ఎవరి మీద కేసులు పెట్టాలి? ఇవేకాదు, ప్రభుత్వ అండ తో రైతుల పంట పొలాలు లాక్కోవాలని, ఇతర స్థలాలను కబ్జాలు చేస్తూ సామాన్య ప్రజలను ఇక్కట్ల పాలు చేస్తున్న వారి మీద ఎవరు యాక్షన్ తీసుకుంటారు? సామాన్య ప్రజలను పట్టి పీడిస్తున్న వారిని ఎవరు శిక్షిస్తారు? వాటికి సమాధానం చెప్పేది ప్రభుత్వమే కదా? ప్రజా పాలన అంటే ప్రజలను గాలికి వదిలేయటమేనా? టర్కి ష్ భాషలో ఒక సామెత ఉన్నది. ‘ఒక వ్యక్తిని తీసుకువచ్చి రత్నాల సింహాసనం మీద కూర్చోబెడితే, ఆయనకు ఆ రత్నాల విలువ, ఆ సింహాసనం బాధ్యత ఏం తెలుస్తుంది? పైగా ఆ వ్యక్తి తన చుట్టూ ఉన్న వారందర్నీ అనామకులను చేస్తాడు. ఎందుకంటే ఆయన స్థాయి మాత్రమే ఆయనకు తెలుసు కాబట్టి.
– కనకదుర్గ దంటు 89772 43484