ఇందిరమ్మ ఇండ్ల కోసమంటూ రాష్ట్రవ్యాప్తంగా అట్టహాసంగా గ్రామ సభలు నిర్వహిస్తున్నారు. ఇంతవరకు బాగానే ఉన్నా లబ్ధిదారుల ఎంపిక విషయంలో ప్రజల్లో ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. ఒక్కో ఊరికి గరిష్ఠంగా 15-16 ఉండాల్సిన ఇండ్ల సంఖ్య హాఫ్ సెంచరీ దాటిపోతుండటం ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నది. దీనినిబట్టి లబ్ధిదారుల ఎంపికలో పారదర్శకత కొరవడిందన్న విషయాన్ని ఇట్టే అర్థం చేసుకోవచ్చు.
ఇందిరమ్మ ఇండ్ల పథకంలో భాగంగా ఒక్కో నియోజకవర్గానికి 3,500 ఇండ్లు కేటాయిస్తామని ప్రభుత్వం చెప్తున్నది. దీనిని బట్టి నియోజకవర్గ పరిధిలోని ఒక్కో ఊరికి గరిష్ఠంగా 11, 12 ఇండ్లు వస్తాయి. కొంచెం పెద్ద గ్రామమైనా, లేదంటే స్థానిక నేత బలంగా ఉన్నా అదనంగా మరో ఐదారు ఇండ్లు వస్తాయి. అయితే, గ్రామ పంచాయతీ ప్రదర్శించిన జాబితాను గమనిస్తే మాత్రం ఆశ్చర్యం వేయక తప్పదు. ఒక్కో పంచాయతీలో 70, 80 ఇండ్లు ఉన్నాయి. నిజంగా ఇన్ని ఇండ్లు సాధ్యమేనా అన్నది అసలు ప్రశ్న. ఇందిరమ్మ ఇండ్ల జాబితాలో 65,70 ఏండ్లు పైబడిన కొందరి వృద్ధుల పేర్లు కనిపించడం లేదు. ఈ విషయమై ప్రశ్నిస్తే ఆ వయసు వారికి ఇవ్వరని పంచాయతీ అధికారులు చెప్తున్నారు. అయితే, ఒకే గ్రామంలో అంతే వయసున్న కొందరి పేర్లు ఉండి, మరికొందరివి లేకపోవడం జాబితాలోని డొల్లతనాన్ని బయటపెడుతున్నది. ప్రభుత్వం మాత్రం వృద్ధులు, దివ్యాంగులు, ఒంటరి మహిళలు, ట్రాన్స్జెండర్లు, పారిశుద్ధ్య కార్మికులకే తమ తొలి ప్రాధాన్యమని చెప్తున్నది.
తెల్లరేషన్ కార్డు ఉన్నవారు మాత్రమే ఇందిరమ్మ ఇండ్లకు అర్హులని ప్రభుత్వం చెప్తున్నట్టు సమాచారం. మరి అలాంటప్పుడు ఒక గ్రామంలో తాజా మాజీ సర్పంచ్ అర్హురాలు ఎలా అవుతారు? ఆమె భర్త పంచాయతీరాజ్ టీచర్. అయినా ఆమెను అర్హురాలిగా పేర్కొన్నారు. దీనినిబట్టి గ్రామాల్లో లబ్ధిదారుల ఎంపిక ఎంత లోపభూయిష్టంగా ఉన్నదో అర్థం అవుతున్నది. కొత్త ఇండ్లు కట్టుకున్న వారి పేర్లు కూడా అర్హుల జాబితాలో దర్శనమిస్తున్నాయి. అదెలా సాధ్యం? దీని వెనకున్న మర్మం ఏమిటి?
ఇందిరమ్మ ఇండ్ల జాబితాలో పేర్లన్నీ కులాల వారీగా కనిపిస్తున్నాయి. కానీ ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓసీ.. ఇలా వివిధ వర్గాలకు ఒక నిష్పత్తి ప్రకారం ఇండ్లు ఎందుకు కేటాయించడం లేదు. జాబితా ఎంపికలో అధికార పార్టీ స్థానిక నాయకుల జోక్యం పెరిగినట్టు వార్తలు వస్తున్నాయి. ప్రజాపాలనలోనూ, మీ సేవ కేంద్రాలలోనూ, ఎంపీడీవో, గ్రామ పంచాయతీ కార్యాలయాల్లో ఇచ్చిన దరఖాస్తుదారుల పేర్లు అర్హుల జాబితాలో లేనప్పుడు లేదా తిరస్కరించినప్పుడు కారణాలు తెలియజేయాలి కదా. ఎక్కడా నిర్దిష్టమైన విధానం అవలంబించకుండా అర్హుల జాబితా అంటూ గ్రామ పంచాయతీ కార్యాలయంలో హడావుడిగా అధికారులు ప్రకటించడాన్ని బట్టి చూస్తుంటే ప్రభుత్వ పథకాల లబ్ధిదారుల ఎంపికలో పారదర్శకత పాటించలేదని స్పష్టంగా తెలుస్తున్నది.
– డాక్టర్ రామకృష్ణ మనిమద్దె, 94943 53828