అనువాదం థాంక్‌లెస్ వర్క్ అంటారు కానీ, ఇది నిజం కాదు. ఇతర భాషల సాహిత్యం మన కళ్ల లోగిళ్లలో కుప్పపోసే కళ! సంస్కృతం, ఉర్దూ, ఇంగ్లీష్ వంటి విశ్వ భాషలను మన దోసిళ్లలో పోసే కళ! అనువాదకులు వాళ్ల మనసును అదిమిపెట్టి సృజనకారుని మనసును పట్టుకోవాలి. మూలకవి అంతరంగ ఆవిష్కరణ చేయడమంటే అనువాదకుడు ద్విపాత్రాభినయం చేసినట్టే. ముఖ్యంగా కవిత్వాన్ని యథాతథానువాదం చేస్తే సహజత్వం లోపిస్తుంది. స్వేచ్ఛానువాదం చేస్తున్నప్పుడు ఎక్కడైనా భావవైరుధ్యాలు ముప్పిరిగొని అనువాదకులను ఉక్కిరిబిక్కిరి చేస్తున్న పరిస్థితి వస్తే ‘ఇదిగో ఇక్కడ ఈ వాక్యానికి బదులు ఈ పదానికి బదులు ఇవి జత చేస్తే బాగుండు’ అని వాళ్లకనిపిస్తుంది. కానీ, పరిధి దాటి పదాల కూర్పు చేయకూడదు. లక్ష్య భాషలోకి మార్చిన వాచకాంశాలను చదివితే భావంలో తేడా లేకుండా ఉండాలి. కానీ, అంతర్గతంలో కవిత అలజడి చేస్తుంటే అభిముఖంగా మూలకవి నిలదీసిన భావాలు కలుగుతూ ఉంటాయి. అలా అని పైపైన చదివి ఉన్నది ఉన్నట్టు తెలుగులోకి తీసుకొస్తే కవితా దీప్తులు ప్రసరించవు.
కవిత నిర్మాణమూ, శైలి జాగ్రత్తగా నడపాలి. మూల కవిత సౌందర్యం చెడకుండా స్పష్టతతో అనువాద కవిత నిర్మించడమనేది సులభమైన విషయమేమీ కాదు. కవి హృదయాన్ని ఆకళింపు చేసుకొని అనువాదకుల హృదయంలోకి వంపుకొని కొత్త మెరుపులు చేర్చాలి. అందుకే అనువాదం థాంక్ఫుల్ వర్క్!! అనాలి. చిట్టిప్రోలు సుబ్బారావు (సీఎస్ఆర్) ఏపీజే అబ్దుల్ కలాం The Life Tree పుస్తకంలోని కవిత్వాన్ని తెలుగులోకి అనువదించేందుకు ఎంతగా తమను తాము మధించుకున్నారో పాఠకులు ఈ ‘అంతర్నాదం’ పుస్తకాన్ని మనసుపెట్టి చదివితే తెలుసుంది.
‘విజ్ఞానము దేశభక్తి రెండు కైళ్లెనా, రెండు చేతులైనా, రెండు ఆయుధాలైనా ఆ ఉడుకు నెత్తుటి భరత యువతకు లక్ష్యం చిన్నదంటే పెద్ద నేరం.’
‘యువగీతం’ అనే ఈ కవిత మొట్టమొదటి కవిత. వ్యక్తిత్వ నిర్మాణం అనేది పటిష్ఠంగా ఉంటే తప్ప ఇటువంటి దేశభక్తి వాక్యాలు జాలువారవు. అబ్దుల్ కలాం భారతదేశాన్ని హృదయపూర్వకంగా ప్రేమించిన సైంటిస్ట్. ఆయనలో రెండు స్రవంతులు, అటు శాస్త్రీయ విజ్ఞానం, ఇటు సంప్రదాయ భారతీయ తత్వమూ ప్రవహించాయి. అందుకే ‘ప్రభాస భారతం పల్లవిస్తుంది’ అంటారు. ‘ప్రజలకు సుఖశాంతులు చేకూరాలి, ఇదే నా ప్రార్థన’ అని కూడా అంటారు. ఇంతటి వైవిధ్యమైన పాత్రల్లో ఒదిగిన కలాం కవిత్వం ఎంతటి తర్కాన్ని వెదజల్లిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
కలాం Song of Youth కవితలో Small aim is a Crime అని రాసిన వాక్యాన్ని లక్ష్యం చిన్నదంటే పెద్ద నేరం అని అనువదించారు సీఎస్ఆర్. Small aim is a Crime ఇలా అనడంలో కవిగా కలాం ఆంతర్యం ఏముంటుంది? ఉత్తమమైన మనిషి జన్మను సార్థకం చేసుకోవాలనే ఉద్దేశమే అయి ఉంటుంది. ఎందుకంటే వంద కోట్ల మందిని రగిలించే ఆ స్వప్నపు నిప్పు రవ్వ నన్నూ దహిస్తోంది అనీ అనటం చూస్తాం. ఇదిగో ఇంతటి సాంద్రతను అనువాదంలోకి తీసుకురావాలి. అందుకే అనువాదకులు వారధి వంటి వాళ్లనడం!
‘కాయకష్టంతో బుద్ధిబలంతో నేల అంతట నేను సారించే స్వేద జలానికి, జ్ఞాన శరీరానికి ప్రభాస భారతం పల్లవిస్తుంది కవిత్వం’
అంటే ఒక అనిర్వచనీయ భావనాశక్తికి అక్షరరూపం ఇవ్వడమే. ఇది అనువాద కవిత అనే అభిప్రాయం కలగదు. ఎంత సామాజికంగా కలాం రచించారో అంత స్పష్టంగా తెలుగులోకి అనువదించారు సీఎస్ఆర్. కాయకష్టాన్ని గుప్పిట్లో అదిమిపెట్టి నిరంతర చైతన్య ధారతో సాగాలని ఇలా అనడంతోనే అబ్దుల్ కలాం ఎప్పుడూ సభల్లో యువతకు ఇచ్చే సందేశం గుర్తుకువస్తుంది.
రాష్ట్రపతి పదవికి ముందు రక్షణ, పరిశోధన అభివృద్ధి సంస్థలో ఉద్యోగం చేసిన అబ్దుల్ కలాం ఇస్రోలో ఏరోస్పేస్ ఇంజినీర్‌గా పనిచేశారు. భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థలో విజ్ఞాన తేజో వికాసాన్ని ప్రదర్శించి, భారత దేశపు ‘మిస్సైల్ మ్యాన్’గా కీర్తి గడించారు. కలాం అవివాహితులు. వారి తల్లిదండ్రులు వీరి వారసత్వం కొనసాగాలని కోరుకునేవారట. పెళ్లే వద్దనుకున్న కలాం…
‘ఎక్కడికి పోతుంది నా జీవితం చరిత్రలో దిగిపోయిన రాజవంశాలు చక్రవర్తుల పేరు నిలపని సంతానాలు తావి వలన పువ్వు తెలిసినట్లు కర్మల ద్వారానే మనిషి తెలుస్తాడు కలతలో స్వప్నం తెరుచుకున్న ఆకాశపు రహదారి నిప్పులు చిమ్ముకుంటూ ఎగిసిన నూతన క్షిపణి! వాళ్ల కోరిక తీరింది పేరు నిలబెట్టే నా మానస పుత్రుడు వచ్చాడు! వాడి నామధేయం ‘అగ్ని’!’
అని అంటారు. ఎంత ఉన్నతమైన వ్యక్తీకరణ తల్లిదండ్రుల ఆశయంపై, ఆశీస్సులపై ఎంత గౌరవం! తాము తయారుచేసిన ‘మిస్సైల్’నే తన సంతానంగా భావించారు అబ్దుల్ కలాం. కలాం రచించిన ఈ కవితలన్నింట్లో రెండు అంశాలు వారి గుణాలను ప్రోది చేస్తున్నాయి. ఒకటి, మన వైజ్ఞానిక దృష్టికోణం, మరొకటి కళా సౌందర్య దృష్టి కోణం. 2003లో ప్రచురించిన కలాం ఇంగ్లీషు కవితల పుస్తకానికి ముందుమాట రాస్తూ అటల్ బిహారీ వాజపేయ్ ‘మత విద్వేషాలు, కుల వైషమ్యాలు, భాషా దురభిమానాలు, ప్రాంతీయ విభేదాలు, హింసకాండలు కలాంకు గిట్టవు. వీరు సౌహార్దశీలంగా సాక్షిభావంతో, సహనశీలంగా సహానుభూతితో సమస్యల పరిష్కారానికి కృషి చేస్తారని అన్నారు.
‘అంతర్నాదం’ కవిత్వం చదువుతుంటే! ‘మంచి పుస్తకం నీడన మనసెంతో చల్లన అనిపించింది’ అబ్దుల్ కలాం ‘అంతర్నాదం’ కవిత్వాన్ని చదువుతున్నంతసేపు.!!