‘ముస్లిం సమాజ హితం కోసం’ అనే అందమైన ముసుగు తొడిగి ‘వక్ఫ్ చట్టం- 1995’లోని ఇటీవల పార్లమెంట్ ఆమోదించిన సవరణలన్నీ ఏకపక్షంగా ఉన్నాయి. వక్ఫ్ ఆస్తుల నిర్వహణలో ముస్లింల పాత్ర తగ్గించి, ముస్లిమేతరులు ముఖ్యంగా, ప్రభుత్వ తాబేదార్ల జోక్యం పెంచి, తద్వారా లక్షల ఎకరాల వక్ఫ్ భూములు బడా వ్యాపారవేత్తలకు కట్టబెట్టడానికి మార్గం సుగమం చేసినట్టయ్యింది. ఈ వక్ఫ్ సవరణలను పార్లమెంట్లో ప్రవేశపెట్టకముందే బీజేపీ తనదైన శైలిలో వాట్సాప్ యూనివర్సిటీ ద్వారా వక్ఫ్ ఆస్తులపై, వక్ఫ్బోర్డుపై తీవ్రమైన దుష్ప్రచారం చేసింది. ‘వక్ఫ్ బోర్డు’ అంటే జన బాహుళ్యంలో ఒక భూ మాఫియాగా, హిందువుల ఆస్తులను, దేశ ఆస్తులను కబళించే ఒక రాక్షస సంస్థగా చిత్రీకరించడంలో బీజేపీ కొంతమేర సఫలమైంది.
కేంద్రంలోని ప్రస్తుత ఎన్డీయే ప్రభుత్వానికి 1995 చట్టంలోని చాలా సెక్షన్లు నచ్చక వాటిని తొలగిస్తూ, సవరణలు చేస్తూ వక్ఫ్ సవరణ బిల్లు 2025 ప్రవేశపెట్టి తమ మద్దతుదారుల సహకారంతో, ముస్లిం ప్రజల, సంఘాల, విపక్షాల అభ్యంతరాలను తోసిపుచ్చి, అర్ధరాత్రి 3 గంటలకు ఆమోదించుకొని, నిన్న అమల్లోకి తీసుకువచ్చింది. అయి తే, వక్ఫ్ 1995 చట్టంలోని సవరణలు, తొలగింపులు, మార్పుచేర్పులపై ముస్లిం సమాజానికి ఉన్న అభ్యంతరాలను ఒకసారి పరిశీలిద్దాం.