ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ హెలికాప్టర్ ప్రమాదంలో మరణించడంపై ప్రపంచవ్యాప్తంగా దిగ్భ్రాంతి వ్యక్తమైంది. ఆయనతో పాటుగా విదేశాంగమంత్రి, పలువురు ఇతర ఉన్నతాధికారులూ ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. తూర్పు ప్రాంతంలో ఓ ఆనకట్ట ప్రారంభించేందుకు వెళ్లి తిరిగివస్తుండగా ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో వారు ప్రయాణిస్తున్న హెలికాప్టర్ కూలిపోయింది. పశ్చిమాసియా వైషమ్యాల నేపథ్యంలో సహజంగానే ఈ ప్రమాదంపై రకరకాల ఊహాగానాలు వినవచ్చాయి. ఇజ్రాయెల్ రహస్య దాడిలో రైసీ మరణించారనేది ఒకటి. అమెరికాలో తయారైన బెల్ 212 హెలికాప్టర్లో ప్రయాణిస్తుండగా ఈ దుర్ఘటన జరిగింది. ఆంక్షల కారణంగా విడిభాగాల సరఫరా నిలిచిపోవడం ఈ ప్రమాదానికి దోహదం చేసి ఉండవచ్చనే వాదనలూ వచ్చాయి. ఇరాన్ ప్రభుత్వాధినేతల్లో రైసీ అత్యంత వివాదాస్పదుడు కావడం ఈ తరహా ఊహాగానాలకు కారణమని చెప్పాలి. అయితే ఇరాన్ మాత్రం గాలివాన బీభత్సం వల్లనే ప్రమాదం సంభవించినట్టు అధికారికంగా ప్రకటించింది.
మతాధికారిగా జీవితం ప్రారంభించి, న్యాయాధికారిగా అత్యున్నత స్థానానికి ఎదిగి, అంతిమంగా అధ్యక్ష పదవికి చేరుకున్న రైసీ మానవ హక్కులను ఉక్కుపాదంతో అణచివేసిన నాయకునిగా అపకీర్తి మూటగట్టుకున్నారు. ఆయన రాజకీయ జీవితంపై ప్రపంచవ్యాప్తంగా విమర్శనాత్మక కథనాలు వెలువడటమే ఇందుకు తార్కాణం. ఇరాన్ అతివాద నాయక శిబిరానికి చెందిన రైసీ దేశానికి సర్వాధికారిగా వ్యవహరించే మతనాయకుడు అలీ ఖామెనీకి అత్యంత సన్నిహితునిగా పేరున్నది. ఖామెనీ తదనంతరం ఆయన వారసునిగా అత్యున్నత పదవి చేపడతారనే ప్రచారమూ ఉంది. 1988లో ఇరాన్ జైళ్లల్లో మగ్గుతున్న వేలాది మంది రాజకీయ ఖైదీల ఊచకోతకు సూత్రధారిగా రైసీపై ఆరోపణలున్నాయి. ఈ కారణంగానే అమెరికా తదితర దేశాలు ఆయనపై ఆంక్షలు కూడా విధించాయి.
ఇరాన్ కుదుర్చుకున్న బహుళపక్ష అణు ఒప్పందం నుంచి అమెరికా వైదొలగడమే కాకుండా ఆంక్షలు విధించిన నేపథ్యంలో ఆయన 2021లో దేశాధ్యక్ష పదవి చేపట్టారు. తీవ్రమైన ఆర్థిక సంక్షోభం కింద నలిగిపోతున్న ఇరాన్ ప్రజలు రైసీ మతఛాందస విధానాల వల్ల మరింతగా కష్టాల పాలయ్యారు. ముఖ్యంగా మహిళలు తీవ్రమైన అణచివేతను ఎదుర్కోవడంపై ప్రపంచవ్యాప్తంగా దుమారం చెలరేగింది. అంతర్జాతీయ విషయాలకు వస్తే బద్ధ శత్రువైన ఇజ్రాయెల్‌ను కట్టడి చేసేందుకు రైసీ తూర్పుదేశాల మైత్రికి ప్రాముఖ్యం ఇచ్చారు. అమెరికా నేతృత్వంలోని పశ్చిమదేశాలు ఇరాన్‌ను ఏకాకిని చేస్తే రష్యా, చైనాల వైపు మొగ్గారు. చిరకాల ప్రత్యర్థి సౌదీ అరేబియాతో చైనా మధ్యవర్తిత్వంలో సంధి కుదుర్చుకున్నారు. ఉక్రెయిన్ యుద్ధంలో రష్యాకు అన్నిరకాలుగా అండదండలు అందిస్తున్నారు. గాజా యుద్ధం నేపథ్యంలో ఇజ్రాయెల్‌తో వైరం తీవ్రతరమైంది. హెజ్బొల్లా, హమాస్, హౌతీ వంటి మిలిటెంట్ సంస్థల సాయంతో పరోక్ష యుద్ధం ధాటిని పెంచడం, సిరియాలో తమ దౌత్య కార్యాలయంపై దాడికి ప్రతీకారంగా ప్రత్యక్ష దాడికి తెగబడటం రైసీ హయాంలో కీలక ఘట్టాలుగా మిగిలిపోతాయి. అంతర్జాతీయ ఆంక్షల ఒత్తిడిని తట్టుకునేందుకు భారత్‌కు దగ్గరయ్యేందుకు రైసీ కృషిచేశారు. బ్రిక్స్, షాంఘే సహకార కూటమిలో చేరే విషయంలో భారత్ సహకారాన్ని తీసుకున్నారు. అంతర్జాతీయ సరుకుల రవాణాలో గొప్ప ముందంజగా భావిస్తున్న చాబహార్ రేవు ఒప్పందంపై రైసీ ముద్ర స్పష్టంగా ఉంది.