కమ్యూనిజం చివరి దశలో రాజ్యం అంతరించిపోతుందని కారల్ మార్క్స్ చెప్పారు. అంతేకాకుండా డబ్బు కూడా చెలామణిలో లేకుండాపోతుందని ఆయన భవిష్యవాణి వినిపించారు. వర్గభేదాలు, ప్రైవేటు ఆస్తి వంటివి లేకపోవడమే ఈ పరిస్థితికి దారితీస్తుందనేది మార్క్స్ సూత్రీకరణ. 20వ శతాబ్దిలో దేశదేశాల్లో విస్తృతంగా ఇలాంటి అంశాల మీద చర్చ జరిగేది. కానీ, 1991లో సోవియట్ యూనియన్ పతనానంతరం అసలు కమ్యూనిజమే పెద్దగా చెలామణిలో లేకుండా పోయిందనేది వేరే సంగతి. అయితే కమ్యూనిస్టు సిద్ధాంత బద్ధవిరోధి, ఫక్తు వ్యాపారవేత్త అయిన ఎలాన్ మస్క్ ఇలాంటి జోస్యాలే చెప్తుండటం ఇప్పుడు చర్చనీయాంశమవుతున్నది. ఈ తరహా కాలజ్ఞానాన్ని ఎవరో సామాన్యులు చెప్తే కొట్టిపారేసేవారేమో. కానీ, అది టెక్ దిగ్గజ కంపెనీ టెస్లా సీఈవో, ప్రపంచ అగ్ర కుబేరుడు మస్క్ కావడంతో ‘ఔనా, నిజమేనా?!’ అని సంభ్రమాశ్చర్యాలు వ్యక్తమవుతున్నాయి.
ఇంతకూ ఆయన ఏమన్నారు? భవిష్యత్తులో యంత్రాలు తమంతట తామే అన్ని పనులూ చేసిపెడతాయని, తద్వారా మనుషులకు కూర్చుని తినడం తప్ప వేరే పనేమీ ఉండదని మస్క్ ఊహ. ఉద్యోగాలు చేయడమనేది ఉండదు. పనిచేయడమనేది ఓ ఐచ్ఛిక అంశంగా, ఇంకా చెప్పాలంటే ఓ హాబీగా మారిపోతుందని కూడా ఆయన సెలవిచ్చారు. దండిగా వస్తుసంపద, ఆహారపదార్థాలు అందుబాటులో ఉండటం మూలాన చాలావాటికి డబ్బిచ్చి కొనుగోలు చేయాల్సిన అవసరం ఏర్పడదు. ఆ కారణంగా డబ్బు అనేది అవసరం లేని ఆరో వేలు అవుతుందని మస్క్ ఉవాచ. ఇక పనేమీ లేకపోవడంతో మనుషులకు కావాల్సినంత స్వేచ్ఛ లభిస్తుందని, తమకు ఇష్టమైన వ్యాపకాన్ని ఎంచుకోవచ్చని ఆయన వాదన. గత నవంబర్ 30న జెరోదా కంపెనీ సహవ్యవస్థాపకుడైన నిఖిల్ కామత్‌కు ఇచ్చిన పాడ్‌కాస్ట్ ఇంటర్వ్యూలో మస్క్ ఈ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. కృత్రిమ సాంకేతికత (ఏఐ)లో, రోబోటిక్స్‌లో కొత్త పుంతలు తొక్కుతున్న ఎలాన్ మస్క్ ఆవిష్కరించిన ఈ ఊహాస్వర్గం లేదా ఉటోపియా నెట్టింట వైరల్ అయ్యింది. ఇందుకు గానూ ఆయన పేరును ‘కారల్ మస్క్’గా మీడియా చమత్కరించడం విశేషం.
ఇదంతా ఎక్కడో సుదూర భవిష్యత్తులో కాకుండా పది నుంచి ఇరవై ఏండ్లలోపే సాకారమవుతుందట. ఒక రకంగా మార్క్స్ చెప్పిందీ, మస్క్ చెప్పిందీ ఒక్కటే. కాకపోతే అందుకు కారణభూతమయ్యే పరిస్థితులే వేర్వేరుగా ఉన్నాయి. డ్రైవర్లు లేని వాహనాలు తయారుచేస్తున్న మస్క్ భవిష్యత్తులో రాబోయే మార్పుల గురించి జోస్యం చెప్పడం ఇదే మొదటిసారి కాదు. సెల్ఫోన్లు కూడా ఇప్పుడున్న రూపంలో ఉండవని ఆయన మరో సందర్భంలో చెప్పారు. అయితే తాజా జోస్యాల ఆచరణీయతపై ఆర్థికవేత్తలు, సామాజిక పరిశీలకులు పెద్దగా సానుకూలత వ్యక్తం చేయకపోవడం గమనార్హం. మస్క్ చెప్పినట్టు మానవ జీవితాన్ని యంత్రాలు సుఖమయం చేసే రోజులు రావాలంటే ఆ స్థాయిలో సాంకేతికత అభివృద్ధి చెందడం, అన్ని దేశాలకు విస్తరించడం తప్పనిసరి. ఒకవేళ ఏఐ, రోబోటిక్స్, ఆటోమేషన్ ప్రపంచాన్ని ముంచెత్తినా ఉద్యోగాలు లేని వ్యవస్థ రావడం కన్నా పనితీరు మారడమనేది జరిగేందుకు ఆస్కారం ఉంటుందని భావించవచ్చు.