అట్టడుగు వర్గాలకు ఏ రూపంలోనూ రిజర్వేషన్లు ఉండకూడదు. అనాదిగా సమాజంలో కొనసాగుతున్న ఈ నిచ్చెనమెట్ల కులవ్యవస్థ యథాతథంగా ఇలాగే కొనసాగాలి. బడుగు, బలహీనవర్గాలు బానిసలుగా మసలుకోవాలి. ఇదీ క్లుప్తంగా బీజేపీ సిద్ధాంతం. గత ఎనిమిదేండ్ల పాలనే అందుకు నిలువెత్తు నిదర్శనం. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల కల్పన ఒక సజీవ సాక్ష్యం. ఇకముందూ కాషాయ పార్టీ పాలనా పద్ధతి మారదనేది అక్షర సత్యం. అయితే బీసీ నేత ప్రధానిగా ఉన్న సమయంలోనే వెనుకబడిన వర్గాలు గతంలోకంటే అత్యంత ఘోరమైన వంచనకు గురికావడం శోచనీయం.
ఒక చాయివాలా దేశానికి మొట్టమొదటి బీసీ ప్రధాని. ‘ఇక రాబోయేది బడుగుల రాజ్యమే..’ అంటూ 2014లో మోదీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన సందర్భంలో ఆయన ప్రవచనాలు వింటూ ఓబీసీలు ఉప్పొంగిపోయారు. ఈ వర్గం దశాబ్దాల తరబడి స్వప్నాలుగా మిగిలిన కొన్ని హక్కులైనా ఇక సాకారం అవుతాయని కలలుగన్నది. కానీ ఈ ఎనిమిదేండ్లలో ఒనగూడిందేమీ లేదన్నది అక్షర సత్యం. ఇంకా విషాదమేమంటే గతంలో ఎన్నడూ లేనివిధంగా వెనకబడిన వర్గాలు మరింత వెనక్కి నెట్టివేయబడ్డాయి. ఓబీసీ కులగణన, రిజర్వేషన్లు, కేంద్రం ప్రత్యేక మంత్రిత్వశాఖ, జనాభా దామాషా ప్రకారం నిధులు ఇలా చెప్పుకొంటూ పోతే అన్నిరంగాల్లోనూ తీవ్ర నిర్లక్ష్యానికి గురయ్యాయి. మరెందుకీ దుస్థితి. బీసీలకు వ్యతిరేకంగా మోదీ నిర్ణయాలకు కారణాలేమిటి? తద్వారా వారు ఆశిస్తున్న ప్రయోజనాలేమిటి? ఇత్యాది అంశాలపై లోతుగా చర్చించుకోవాల్సిన అవసరం ఉన్నది. అంతేకాదు రేపటిరోజున హక్కుల సాధనకు బీసీలు తీసుకోవాల్సిన, ఎంచుకోవాల్సిన పోరాట మార్గాలపైనా స్పష్టత తెచ్చుకోవాల్సిన ఆవశ్యకత ఎంతో ఉంది. లోతుగా ఆలోచించాల్సిన తరుణం ఇది.
ఓబీసీ కులసంఘాల ఒత్తిడి, దశాబ్దాల పోరాటాల ఫలితంగా యూపీఏ ప్రభుత్వం దాదాపు రూ.4893.60 కోట్లను వెచ్చించి సామాజిక, ఆర్థిక కులగణన 2011లో చేయించింది. అయినప్పటికీ సాంకేతిక కారణాలను చూపుతూ ఆ నివేదికను మాత్రం కాంగ్రెస్ బయటపెట్టలేదు. ఇక తాము అధికారంలోకి వస్తే కచ్చితంగా లెక్కలు తీయిస్తామని ప్రకటించిన బీజేపీ, పాలనాపగ్గాలు చేపట్టిన వెంటనే ఆ అంశాన్ని అటకెక్కించింది. ఎంతటి నయవంచన అంటే కులగణన నివేదికలోని తప్పులను సరిచూసేందుకు నీతి ఆయోగ్ మాజీ ఉపాధ్యక్షుడు అరవింద్ కుమార్ పనగారియా నేతృత్వంలో ఒక కమిటీని వేసినా, సభ్యులను నియమించలేదు. మార్గదర్శకాలు రూపొందించలేదు. ఒక్కరోజు కూడా ఈ కమిటీ పనిచేసిన దాఖలాల్లేవు. అయినా ఆ నివేదికలో తప్పులు దొర్లాయని, బహిర్గతం చేయడం సాధ్యం కాదంటూ నిర్లజ్జగా ప్రకటించడం బీజేపీ నయవంచనకు అద్దం పడుతుంది. అక్కడితో ఆగకుండా నివేదికను బహిర్గతం చేస్తే సామాజిక అసమానతలకు దారితీస్తుందని కొత్త భాష్యాన్ని వినిపిస్తున్నది. ఇక ఎస్ఈసీసీ-2011 కులగణనలో తప్పుల సంగతికి వస్తే అందులో వివరాలు 98.87 శాతం సరైనవేనని, అందులో 1.13 శాతం మ్రాతమే తప్పులు దొర్లాయని కేంద్ర గ్రామీణాభివృద్ధి పార్లమెంటరీ స్థాయీ సంఘం (2015-16) ముందు జనాభా గణన కమిషనర్, రిజ్రిస్టార్ జనరల్ ధ్రువీకరించింది. సాంకేతిక పరిజ్ఞానంతో ఆ తప్పులను సమర్థవంతంగా సరిదిద్దవచ్చే అవకాశమూ ఉన్నది. ఈ విషయాన్ని కేంద్రమే పార్లమెంట్ వేదికగా ప్రకటించింది. అయినా ఇప్పటికీ కులాల లెక్కలను కేంద్రం బయట పెట్టేందుకు విముఖత చూపడం ఆ పార్టీ కప్పదాటుడు విధానానికి నిదర్శనం. ఇదిలా ఉంటే 2021లో నిర్వహించబోయే జనాభా గణనలోనే కులగణనను అధికారికంగా చేపడుతామని 2018, ఆగస్టు 31న నాటి హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్ బహిరంగంగా ప్రకటించారు. కానీ, ప్రస్తుతం బీజేపీ మళ్లీ మాటమార్పింది. ‘కులగణన’ను చేపట్టే యోచన కేంద్రానికి లేదని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానందరాయ్ ఏకంగా లోక్‌సభకు లిఖితపూర్వంగా తెలియజేయడం బీజేపీ రెండు నాల్కల ధోరణికి పరాకాష్ఠ. అంతేనా అంటే ఇంకా ఉంది. కులగణన చేపట్టాలని ‘ఓబీసీ పార్లమెంటరీ స్థాయి సంఘం’ సిఫారసు చేసినా కేంద్రం బుట్టదాఖలు చేసింది. తెలంగాణతో సహా ఇతర రాష్ట్ర ప్రభుత్వాలు కులగణన చేపట్టాలని అసెంబ్లీలో తీర్మానం చేసి పంపినా పట్టించుకున్న పాపాన పోవడం లేదంటే వెనకబడిన వర్గాల ప్రయోజనాలకు బీజేపీ ఇచ్చే ప్రాధాన్యం ఎంతటిదో అర్థం చేసుకోవచ్చు.
ఓబీసీ కులగణన అంశమేమో కానీ, ప్రస్తుతం అమలవుతున్న రిజర్వేషన్లకే ఎసరు రావడం కొసమెరుపు. ఒకవైపు ప్రైవేటీకరణ పేరిట ప్రభుత్వరంగ సంస్థలను తెగనమ్ముతూ పరోక్షంగా ఓబీసీల ఉద్యోగావకాశాలను దెబ్బతీస్తుండటమే గాక రిజర్వేషన్లను నిర్వీర్యం చేస్తున్నది. ఇది బీసీ ప్రధాని మోదీ హయాంలోనే బీసీలకు వాటిల్లుతున్న మరో తీరని నష్టం. అక్కడితో ఆగకుండా ఏకంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓబీసీలకు అమలు చేస్తున్న రిజర్వేషన్లే గల్లంతయ్యే దుస్థితి నెలకొనడం విడ్డూరం. స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్ల అమలుపై దాఖలైన పిటిషన్‌ను విచారించిన సుప్రీంకోర్టు పలు మార్గదర్శకాలను జారీచేసింది. అందులో మొదటిది స్థానిక సంస్థల్లో ఓబీసీ రిజర్వేషన్ల అమలు, ఫలితాలపై అధ్యయనానికి పూర్తిస్థాయి కమిషన్‌ను నెలకొల్పడం. రెండవది, అత్యంత ప్రధానమైనది బీసీ కులాల సమాచారం సేకరించుకొని వారి జనాభా నిష్పత్తికి అనుగుణంగా రిజర్వేషన్లను స్థిరీకరించడం. మూడవది ఆ రిజర్వేషన్లు కూడా ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ కలిపి మొత్తంగా 50 శాతం మేరకు మించకుండా చూసుకోవడం. ఈ మార్గదర్శకాలు పాటించని ఏ రాష్ట్రంలో కూడా స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓబీసీ రిజర్వేషన్లు అమలు చేయకూడదని సుప్రీంకోర్టు తేల్చిచెప్పింది. పలు రాష్ర్టాల స్థానికసంస్థల ఎన్నికలను రద్దుచేసింది కూడా. ఇక్కడే ఉంది అసలు చిక్కుముడి. కులగణన అంశం కేంద్రం పరిధిలోనిది. అదేమో ఆ పనిచేయబోనంటూ తెగేసి చెప్తున్నది. మరోవైపు కనీసం కాంకరెంట్ లిస్టులోనైనా ‘గణన’ అంశాన్ని చేర్చాలని, తద్వారా తామే కులగణనను అధికారికంగా చేపట్టే వీలుంటుందని రాష్ర్టాలు కోరుతున్నా ఆ బదలాయింపునకు ససేమిరా అంటున్నది. దీంతో మొత్తంగా స్థానిక సంస్థల్లో ఓబీసీ రిజర్వేషన్ల అమలు ప్రశ్నార్థకంగా మారింది. బీసీల స్థానాలన్నీ జనరల్‌గానే పరిగణించే ప్రమాదం ముంచుకొచ్చింది. ప్రస్తుతం ప్రధాని మోదీ సొంత గుజరాత్ అందుకు ఉదాహరణ. అవే కాదు నిధుల కేటాయింపులో.. సంక్షేమ కార్యక్రమాల అమలులో.. ఓబీసీ కులాల జాబితా ఉపవర్గీకరణ అంశంలో.. బీసీల ప్రత్యేక మంత్రిత్వశాఖ ఏర్పాటు హామీ అమలు ఇవన్నీ ఇప్పటికీ అందని ద్రాక్షగానే మిగిలాయి. బీసీల ఆశలన్నీ అడియాశలయ్యాయి.
ఇలా చెప్పుకొంటూ పోతే బీసీ వ్యతిరేక నిర్ణయాలు ఎన్నో ఉన్నాయి. అడుగడుగునా బడుగుల ఆశలకు గండికొట్టే కుట్రలు. అదీ బీసీ ప్రధాని మోదీ నేతృత్వంలోని ప్రభుత్వ హయాంలోనే కావడం ఇక్కడ అన్నింటికీ మించిన విషాదం. తర్కించుకోవాల్సిన, మూలాల్లోకి వెళ్లి పరిశీలించాల్సిన అంశం. మరేందుకీ వైచిత్య్రమంటే కారణమొక్కటే. నరేంద్రుడు సారథ్యం వహిస్తున్న కమలం పార్టీ
సిద్ధాంతమనేది సుస్పష్టం.
అట్టడుగు వర్గాలకు ఏ రూపంలోనూ రిజర్వేషన్లు ఉండకూడదు. అనాదిగా సమాజంలో కొనసాగుతున్న ఈ నిచ్చెనమెట్ల కులవ్యవస్థ యథాతథంగా ఇలాగే కొనసాగాలి. బడుగు, బలహీనవర్గాలు బానిసలుగానే బతుకులీడ్చాలి. ఇదీ క్లుప్తంగా బీజేపీ సిద్ధాంతం. గడిచిన ఎనిమిదేళ్ల పాలనే అందుకు నిలువెత్తు నిదర్శనం. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల కల్పన ఒక సజీవ సాక్ష్యం. ఇకముందూ కాషాయ పార్టీ పాలనా పద్ధతి మారదనేది అక్షర సత్యం. అయితే బీసీ నేత ప్రధానిగా ఉన్న హయాంలోనే వెనుకబడిన వర్గాలకు గతంలోకంటే అత్యంత ఘోరమైన అన్యాయాలు వాటిల్లడం.. హక్కులు హరించుకుపోవడం ఇక్కడ చర్చనీయాంశం. ఇక ఇప్పుడైనా బీసీ ప్రధాని మోదీ అంటూ బీసీ సంఘాలు జబ్బలు చరచుకోవడం మాని వాస్తవ దృష్టితో ముందుకుసాగాలి. భావితరాలకు వాటిల్లబోయే ప్రమాదాన్ని గుర్తెరగాలి. అంతఃకలహాలతో చీలిపోక ఏకతాటిపై నిలబడాలి. అంతేకాదు, భవిష్యత్తు కార్యాచరణను రూపొందించుకోవాలి. ఇక్కడ వర్గ స్వభావ రీత్యా, పాలనావిధానాల పరంగా, వెనుకబడిన వర్గాల ప్రయోజనాలను వ్యతిరేకించడంలో ఒకే రీతిన వ్యవహరించే బీజేపీ, కాంగ్రెస్‌లను తక్షణం విడనాడాలి. దేశానికి నూతన అభివృద్ధి నమూనాను చూపి, కొత్త ఎజెండాతో ముందుకు వస్తున్న, హక్కుల సాధనకు బీసీలకు బాసటగా నిలుస్తున్న, గొంతు కలుపుతున్న నూతన శక్తులతో ఏకం కావాలె. బీసీ హక్కులకు స్పష్టమైన హామీనిచ్చే ప్రజాస్వామిక, ప్రగతిశీలక పార్టీల వెంట నడవాలి. అది బీసీ వర్గాలకు అత్యవసరం. అత్యంత ఆవశ్యకం. అవశ్యం.
(వ్యాసకర్త: జాతీయ బీసీ దళ్ అధ్యక్షుడు)
-దుండ్ర కుమారస్వామి
99599 12341