‘మేము అయోధ్యకు వెళ్లాల్సిన అవసరం లేదు.. మాకు సీఎం సిద్ధరామయ్యనే రాముడంతటివాడు’ అని కర్ణాటక మాజీ మంత్రి హెచ్ ఆంజనేయ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. ‘శ్రీరామ చంద్రున్ని కించపరుస్తారా?’ అని బీజేపీ నేతలు కయ్యిన లేచారు. కానీ, ఆ తర్వాత ఆ మాటల వెనుకున్న గూఢార్థాన్ని అర్థం చేసుకున్నాక అంతేగా… అంతేగా అంటూ కొత్త పల్లవి అందుకున్నారు. లోక్‌సభ ఎన్నికల అనంతరం సిద్ధరామయ్యను గద్దె దించి డీకే శివకుమార్‌ను సీఎం సీట్లో కూర్చోబెట్టడం ఖాయం. అప్పుడు ఎట్లాగూ సిద్ధరామయ్యకు వనవాసమే గతి కదా? అందుకే తమకు సిద్ధరామయ్యే రాముడని మాజీ మంత్రి అని ఉంటారని సెటైర్లు వేస్తున్నారు.
ఒక్కనాటి బాగోతంలా తయారైంది మీడియా వాళ్ల పరిస్థితి. సచివాలయంలోకి గత ప్రభుత్వం వెళ్లనీయలేదు. కొత్త ప్రభుత్వం వచ్చాక గేట్లు తెరిచిందని సంబురపడుతూ కొందరు మీడియా ప్రతినిధులు సచివాలయం ముందు నిలబడి సెల్ఫీలు తీసుకొని సోషల్ మీడియాలో పోస్టు చేశారు. దీంతో ఆ మరుసటి రోజు నుంచి కొత్త సచివాలయాన్ని చూద్దామన్న కుతూహలంతో పెద్దఎత్తున మీడియా ప్రతినిధులు తరలివస్తున్నారు. అయితే మెయిన్ గేట్ వద్దనే ‘ప్రెస్‌కు నో ఎంట్రీ’ అని సెక్యూరిటీ సిబ్బంది తేల్చిచెప్తుండటంతో.. మరి మావాళ్లు అలా చెప్తున్నారేంటి? అని అడిగితే, మీకు ఎవరు చెప్పారో వారినే అడగండని దెప్పిపొడుస్తున్నారు.
కాంగ్రెస్ సర్కార్ ప్రకటించిన ఆరు గ్యారంటీలకు ఎవరు దరఖాస్తు చేసుకోవాలో, ఎవరు చేసుకోకూడదో స్పష్టత లేక జనం అయోమయంలో పడ్డారు. ఆసరా, రైతుబంధు లబ్ధిదారులు తిరిగి దరఖాస్తు చేసుకోనవసరం లేదని ప్రభుత్వం ప్రకటించినప్పటికీ, మరి రేషన్‌కార్డు, ఇందిరమ్మ ఇండ్లు, గ్యాస్ సబ్సిడీ, మహాలక్ష్మి పథకాలకు ఎవరు అర్హులు, ఎవరు అనర్హులో తెలియడం లేదని ప్రజల్లో సందేహాలు వ్యక్తమయ్యాయి. కానీ, ప్రభుత్వం నుంచి ఎలాంటి వివరణ లేకపోగా సోషల్ మీడియాలో రోజుకో రకంగా ఆరు గ్యారంటీలకు ఇవే గైడ్‌లైన్స్ అంటూ జరుగుతున్న ప్రచారం ప్రజలను మరింత గందరగోళంలోకి నెట్టేశాయి.
ఇండియా కూటమిని అధికార పీఠంపై కూర్చోబెట్టే లక్ష్యంతో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ రెండో దశ భారత్ జోడో యాత్ర ప్రారంభించబోతున్నారు. కానీ, ఈ యాత్ర కంటే ముందు ‘ఇండియా’ జోడో యాత్ర చేపట్టి ఉంటే బాగుండేదని కూటమిలో అభిప్రాయం వ్యక్తమవుతున్నది. ఇప్పటికే మధ్యప్రదేశ్ ఎన్నికల సందర్భంగా తలెత్తిన విభేదాల వల్ల సమాజ్‌వాదీ పార్టీకి కాంగ్రెస్‌కు మధ్య పడటం లేదు. అలాగే ఢిల్లీ, పంజాబ్‌లో ఆమ్ ఆద్మీ పార్టీకి కాంగ్రెస్‌కు మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమని మండే పరిస్థితి ఏర్పడింది. తాజాగా పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీతోనూ స్థానిక కాంగ్రెస్ నేతలకు పడటం లేదు. ఈ గొడవలన్నీ చూస్తే ‘దేశంలో ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీ ఉండేది’ అని చెప్పుకొనే పరిస్థితి వస్తుందేమో అని పంజాబ్ సీఎం భగవంత్ మాన్ ఎద్దేవా చేశారు. ‘ఇండియా కూటమి’ అని ఒకటి ఉండేదని చెప్పుకొనే పరిస్థితి కూడా వస్తుందని ఎన్డీయే నేతలు చురకలేస్తున్నారు.
– వెల్జాల