‘పాలనాధికారం దుర్వినియోగం చేసే/ గుండాలకు నేను ద్రోహినే/ అన్యాయాన్నెదిరించడం/ నా జన్మహక్కు నా విధి’ అన్న కాళోజీని గుర్తుచేసుకోవాల్సిన సందర్భం ఇది. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ వారసత్వాన్ని చాటే నిర్మాణాలు చేపట్టారు. జిల్లాలకూ, ప్రాజెక్టులకు ఇంకా మరెన్నింటికో తెలంగాణ కీర్తి పతాకలు, స్ఫూర్తి ప్రతీకలుగా నిలిచిన మహానుభావుల పేర్లు పెట్టారు. కుమ్రంభీం, జయశంకర్‌సార్, కాళోజీ వంటి తెలంగాణ పోరాట పటిమకు, తెగువకు మారుపేరైన మహోన్నతుల పేర్లను నిత్య స్మరణీయాలుగా మార్చి నిజమైన నివాళి ఘటించారు. ఆ కోవలో రూపుదిద్దుకున్నదే వరంగల్‌లోని కాళో జీ కళాక్షేత్రం.
ఏకశిలా నగరానికి సిగలో పువ్వులా సువిశాలమైన ప్రాంగణంలో మహా సభావేదిక నిర్మాణానికి కేసీఆర్ ప్రణాళికలు వేశారు. ఆ ప్రాంగణంలోనే కాళన్న నిలువెత్తు విగ్రహం చేయించారు. ప్రారంభోత్సవమే తరువాయి అన్న తరుణంలో సర్కారు మారింది. దాదాపుగా పూర్తయిన భవనానికి రంగులు, సున్నాలు వేసి అట్టహాసాలు చేస్తున్నది రేవంత్ ప్రభుత్వం. ఒక్క నోటిఫికేషన్ కూడా ఇవ్వకుండానే ఇదివరక టి సర్కార్ పూర్తిచేసిన రిక్రూట్మెంట్తో నియామక పత్రాల పంపిణీ పేరిట హంగామా చేసి పేరు కొట్టేయాలని చూసినవాళ్ల నుంచి ఇంతకంటే ఏం ఆశించగలం?
ఇంతకూ కాళోజీ పేరుతో ప్రచారం పొందాలని చూస్తున్న కాంగ్రెస్ పాలకుల్లో ఆయన స్ఫూర్తి కించిత్తు అయినా ఉన్నదా అనేది అసలు ప్రశ్న. ఏడాది కావస్తున్నా ఒక్కటంటే ఒక్కటి ప్రజానుకూల నిర్ణయం తీసుకున్నారా? ఒక్క మంచిపనికి శ్రీకారం చుట్టారా? అంతదాకా ఎందుకు, ఏ అస్తిత్వం కోసం కాళోజీ లాంటి మహానుభావులు కొట్లాడారో దానినైనా కాపాడుతున్నారా? తెలంగా ణ పొడే గిట్టని పరాయి పాలకుల ముందు మోకరిల్లుతున్నారు. నీటి హక్కులను కాటగలుపుతున్నారు. ఇదంతా చాలదన్నట్టుగా ఆనవాళ్లు చెరిపేస్తామని ఎగిరెగిరి పడుతున్నారు.
కాళోజీ కళాక్షేత్రం కేసీఆర్ ఆనవాళ్లలో ఒకటి కాదా? ఆ మాటకు వస్తే తెలంగాణే కేసీఆర్ అతిపెద్ద ఆనవాలుగా చరిత్రలో నిలిచిపోయింది. చెరిపేస్తే చెరిగిపోవడానికి అది నీటిమీది రాతకాదు, సువర్ణాక్షరం. ఈర్షాద్వేషాలతో రగిలిపోయే చేతగాని, అనుభవం లేని పాలకు లు రాష్ర్టాన్ని ఆగమాగం చేస్తున్నరు. ప్రజాపాలన అంటూ ప్రజాకంట క పాలన తెచ్చారు. ప్రశ్నిస్తే కేసులు అరెస్టులంటూ వేధిస్తూ పోలీసు రాజ్యం చెలాయిస్తున్నారు. కాళోజీ బ్రతికి ఉంటే ఇవన్నీ సహించేవా రా? ‘దోపిడీ చేసే ప్రాంతేతరులను దూరం దాకా తన్ని తరుముతం.. ప్రాంతం వాడే దోపిడీ చేస్తే ప్రాణంతోనే పాతర పెడతం’ అని గర్జించాడు కదా.
అంతేకాదు, తన పేరిట నిర్మించిన ప్రాంగణంలోనే పోలీ సు జులుం ప్రదర్శిస్తే ఊరుకునేవారా? ‘హింస పాపమని యెంచు దేశమున హిట్లరత్వమింకెన్నాళ్లు?’ అని ప్రశ్నించిన కాళోజీ నేడు రాష్ర్టాన్నే జైలుగా మార్చి ఎమర్జెన్సీ తరహా పాలన తెస్తే పోనీలే అని సరిపెట్టుకునేవారా? ‘మరిచిపోకుండగ గురుతుంచుకోవాలె.. కాలంబు రాగానె కాటేసి తీరాలె’ అని కాళన్న చెప్పింది ఈ తరహా పాలకుల గురించే అన్నది గుర్తుంచుకోవాలి.