సమైక్య రాష్ట్రంలో కాంగ్రెస్ పాలనాకాలం నాటి రైతుల ఆకలి కేకలు..మళ్లీ నేడు అదే పార్టీ పాలనలో మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో రైతుభరోసా, పంట బోనస్ వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేస్తూ, పంటల కొనుగోలులో జాప్యాన్ని నిరసిస్తూ, రైతుల కోసం బీఆర్ఎస్ పార్టీ మరో పోరుకు సన్నద్ధమైంది. ‘రైతన్న కోసం మేం ఉన్నాం’ అంటూ వరంగల్‌లో రైతు సంగ్రామ సదస్సుకు సర్వం సిద్ధం చేసింది. అయితే, ఈ సదస్సు సృష్టిస్తున్న ప్రకంపనలతో కాంగ్రెస్ ప్రభుత్వానికి అభద్రతాభావం పెరిగిపోయింది.
రైతు సంగ్రామ సదస్సు కోసం బీఆర్ఎస్ శ్రేణులు పెట్టిన గులాబీ జెండాలు, తోరణాలను చూసి గుబులు చెందిన ప్రభుత్వం వాటిని గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ సిబ్బందితో తీసివేయించింది. అంతేగాక, బీఆర్ఎస్ తలపెట్టిన రైతు సంగ్రామ సదస్సు రోజే కిసాన్ మేళా నిర్వహిస్తున్నట్లు ప్రకటించి, తన పిరికితనాన్ని చాటుకున్నది. తోరణాలు తొలగించినంత మాత్రాన రైతు సంగ్రామ సదస్సును ఆపలేమని, రైతుల గుండెల్లో ఉన్న కేసీఆర్, కేటీఆర్‌ను తొలగించలేమని ఈ ప్రభుత్వం ఇంకా అర్థం చేసుకోలేకపోతున్నది.
వాస్తవంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ వివక్షాపూరిత పాలకుల హయాంలో తెలంగాణ ప్రాంత రైతులకు వ్యవసాయం అంటేనే ఒక కన్నీటి గాథ. స్వరాష్ట్రం సాధించిన ఉద్యమ నాయకుడే పాలకుడు కావాలని ప్రజలు కోరుకున్న విధంగానే కేసీఆర్ తెలంగాణ రాష్ర్టానికి తొలి ముఖ్యమంత్రి అయ్యారు. అధికారంలోకి వచ్చిన వెంటనే వ్యవసాయరంగమే ప్రాధాన్య అంశంగా చేపట్టారు. మిషన్ కాకతీయ ద్వారా చెరువులకు పునరుజ్జీవం పోసి, పెండింగ్ ప్రాజెక్టులను యుద్ధప్రాతిపదికన పూర్తిచేయటానికి శ్రీకారం చుట్టారు. గోదావరి నది మీద కాళేశ్వరం ప్రాజెక్టును కేవలం మూడున్నరేండ్లలో పూర్తి చేసి, లక్షలాది ఎకరాల బీడు భూములను పచ్చని పంటలతో సస్యశ్యామలంగా మార్చారు. అదేవిధంగా కృష్ణానది మీద పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతలకు శ్రీకారం చుట్టి 80 శాతానికి పైగా పనులు చేయటంతోపాటు, ట్రయల్ రన్ కూడా నిర్వహించి, సాగునీటిరంగ సంక్షోభానికి తెరదించారు. ఇలా కాళేశ్వరం లాంటి అపర భగీరథ ప్రయత్నంతో తెలంగాణను ‘అన్నపూర్ణ’గా మార్చింది కేసీఆర్ సర్కార్.
ఆత్మవిశ్వాసం దెబ్బతిన్న రైతుల్లో ధైర్యాన్ని నింపటానికి కేసీఆర్ సర్కార్ ఎకరాకు, ఏడాదికి రూ.10 వేల నగదు సాయం అందించే రైతుబంధు పథకాన్ని ప్రారంభించింది. తొమ్మిదిన్నరేండ్ల కాలంలో 11 విడతల్లో దాదాపు 70 లక్షల మందికిపైగా రైతుల ఖాతాల్లో రూ.72,815 కోట్లు జమ చేసింది. అందరికీ అన్నంపెట్టే రైతు ఏ కారణం వల్లనైనా మరణించినా, ఆ కుటుంబం ఇబ్బందులపాలై, రోడ్డున పడవద్దని భావించిన కేసీఆర్ రైతు బీమా తెచ్చారు. ప్రపంచంలోనే ఎక్కడా లేనివిధంగా ప్రభుత్వమే ప్రీమియం చెల్లించి, మరణించిన రైతు కుటుంబానికి 10 రోజుల్లోపు రూ.5 లక్షల సాయం అందించేలా చర్యలు తీసుకున్నారు. ఫలితంగా 1,11,320 రైతు కుటుంబాలకు రూ.5,566 కోట్ల సాయం అందింది. రైతులోకం సంతోషంగా బతికింది. ఏడాదికి రూ.10,500 కోట్ల సబ్సిడీని భరించి 24 గంటల ఉచిత విద్యుత్తు పథకాన్ని అమలుచేశారు. పండిన పంటలను వంద శాతం కొనుగోలు చేశారు. సమైక్య రాష్ట్రంలో అప్పుల బారిన పడిన రైతులను ఆదుకునేందుకు కేసీఆర్ హయాంలో 58 లక్షల 29 వేల మంది రైతులకు సంబంధించిన రూ.29 వేల 144 కోట్లకు పైగా రుణాలను మాఫీ చేశారు. ఊరూరా ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి, పంట విక్రయించిన డబ్బులు రైతుల బ్యాంకు ఖాతాల్లో వేశారు.
కానీ ఇవాళ రాష్ట్రంలో ఏం జరుగుతున్నది? మాయమాటలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం..కేసీఆర్ ఎంతో బాగా చక్కదిద్దిన వ్యవసాయాన్ని మళ్లీ చిన్నాభిన్నం చేస్తున్నది. 24 గంటల ఉచిత కరెంటు హామీ 12 గంటలకే పరిమితమైంది. కరెంటు ఎటమటమై మోటర్లు కాలిపోతున్నాయి. కేసీఆర్ హయాంలో మూతబడిన మోటరు రిపేరు షాపులు మళ్లీ ఇపుడు తెరుచుకుంటున్నాయి.
రైతుబంధును రూ.15 వేలకు పెంచుతామని ఎన్నికల్లో గొప్పలు చెప్పిన కాంగ్రెస్, ఇప్పుడు ఉన్న సాయాన్ని కూడా ఎగ్గొడుతున్నది. ఇప్పటికే రెండుసార్లు రైతుబంధు ఎగవేసి, ఇప్పుడు మూడోసారి కేవలం ఒక ఎకరానికే ఇస్తామంటూ కొర్రీలు పెడుతున్నది. గతంలో 5 ఎకరాలున్న రైతుకు దర్జాగా రూ.50 వేలు ఖాతాలో పడేవి. కానీ నేడు యూరియా కోసం క్యూలైన్లలో నిలబడి ‘యాపు-వాపు’ పడాల్సిన దుస్థితి నెలకొన్నది. కేసీఆర్ పాలనలో కాలర్ ఎగరేసిన రైతును, నేటి కాంగ్రెస్ పాలకులు తమ కాళ్లుమొక్కేలా దిగజార్చింది కాంగ్రెస్ సర్కార్. తెలంగాణ పల్లెల్లో మళ్లీ మొదలైన ఈ చీకటి రోజులను చూస్తుంటే, రైతు సంక్షేమం కేవలం బీఆర్ఎస్ ప్రభుత్వంతోనే సాధ్యమని రైతాంగం ముక్తకంఠంతో చాటుతున్నది. అందుకే, రైతు సమస్యల పరిష్కారాన్ని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ ఆధ్వర్యంలో రైతులోకం సంగ్రామానికి సన్నద్ధమైంది. రైతు వ్యతిరేక కాంగ్రెస్ పాలకులకు బుద్ధి చెప్పటానికి, జట్టుకట్టి సిద్ధమైన రైతులు సరైన సమయం కోసం ఎదురుచూస్తున్నారు.
(వ్యాసకర్త: శాసనమండలి సభ్యుడు)
– పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి