సీ॥ చిగురాకు కొమ్మలో చిన్నారి కోయిల
కుహు కుహు రవముతో కూయు చుండ
అలనల్ల సూరీడు అరుణ రేఖలు దాల్చి
తూరుపు కొండపై తొంగిచూడ
చల్లచల్లగ సాగి పిల్లతెమ్మర గాలి
పూల పరిమళముతో పులకరింప
మోదుగ, విరజాజి, మొగిలిరేకులు విచ్చి
పుడమితల్లికి పూల జడల నల్లి
తే.గీ.॥ చూతమింపార చిగురించి సొగసులీన
నింబవృక్షాలు విరబూసె సంబరమున
శుకపి కమ్ములు శారికల్ శుభము పలుక
స్వాగతమ్ము‘విశ్వావసు’ వత్సరాది!!