అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రెండో విడత అధికార పగ్గాలను చేపట్టిన తొలి రోజే తన పాలన ఎలా ఉండబోతున్నదో రుచి చూపించారు. అదుపు తప్పి అదే పనిగా పేలుతున్న తుపాకీలోంచి తూటాలు వెలువడినట్టుగా ఆయన అధ్యక్ష ఫర్మానాలను శరపరంపరగా వెలువరించారు. ఒకటి కాదు, రెండు కాదు 78 ఫర్మానాలు. బరబరా వాటిపై సంతకాలు గెలికేసి, ‘తాంబూలాలు ఇచ్చేశాను ఇక తన్నుకు చావండి’ అన్నట్టుగా పెన్నులను సభికుల పైకి విసిరేశారు. ఒక్కో ఫర్మానా ఒక్కో సంచలనం. అన్నీ సుదూర పర్యవసానాలు కలిగినవే. ముఖ్యంగా భారతీయులకు ప్రత్యేకించి విపత్కరమైనవి కూడా వాటిలో ఉన్నాయి. అందులో అత్యంత కీలకమైంది జన్మతః పౌరసత్వ రద్దు నిర్ణయం. డజన్ల కొద్దీ జారీచేసిన ఫర్మానాల్లో అమెరికాను అంతర్గతంగానూ, బయటి ప్రపంచాన్ని అతలాకుతలం చేసేవి చాలానే ఉన్నాయి.
అమెరికా పూర్వవైభవ పునరుద్ధరణ నినాదంతో గెలిచిన ట్రంప్ శరణార్థులను ప్రత్యేకించి లక్ష్యంగా చేసుకుంటారనే అనుమానాలు నిజమయ్యాయి. ప్రస్తుతానికి వారి ప్రవేశాన్ని తాత్కాలికంగా స్థగితం చేశారు. మెక్సికో సరిహద్దులకు సైన్యాన్ని తరలించి మరీ కట్టుదిట్టం చేశారు. ప్యారిస్ పర్యావరణ ఒప్పందం నుంచి, ప్రపంచ ఆరోగ్య సంస్థ నుంచి ఉపసంహరించుకుంటూ తీసుకున్న నిర్ణయం తీవ్ర విమర్శలకు గురవుతున్నది. ఇది విశ్వవేదికలపై సభ్యదేశంగా అమెరికా తన బాధ్యతల నుంచి తప్పుకోవడం తప్ప మరోటి కాదు. మగ, ఆడ తప్ప మూడో లింగమనేది గుర్తించబోమనేది మరో తిరోగామి చర్య. అమెరికా సామాజికంగా సాధించిన ముందంజను ఇది నిర్వీర్యం చేస్తుంది. ఇండియా సహా బ్రిక్స్ దేశాలు డాలర్‌ను పక్కన పెట్టే ఆలోచనను ఆచరణలో పెడితే వంద శాతం టారిఫ్ పెంచుతాననేది మరో దుందుడుకు నిర్ణయం. వీటన్నిటి వల్ల భారత్ స్టాక్ మార్కెట్‌పై ప్రతికూల ప్రభావం పడి ఒక్కరోజే లక్షల కోట్ల సంపద ఆవిరి కావడం గమనార్హం.
ట్రంప్ తీసుకున్న తీవ్ర నిర్ణయాలపై ప్రపంచవ్యాప్తంగా ఆందోళన వ్యక్తమవుతున్న సంగతి తెలిసిందే. మరోవైపు చైనా, యురోపియన్ యూనియన్ ట్రంప్ టారిఫ్ బెదిరింపులను తప్పుబట్టాయి. అవి రక్షణవాద వాణిజ్య విధానాల కిందకు వస్తాయని విమర్శించాయి. ఇంకోవైపు అనేక ఫర్మానాల్లోని అంశాలు అసలు అధ్యక్ష కార్యనిర్వాహక పరిధిలోకి రావనే మాట కూడా న్యాయనిపుణుల నుంచి వినిపిస్తున్నది. ఉదాహరణకు దాదాపు వందేండ్లకు పైగా అమల్లో ఉన్న జన్మతః పౌరసత్వ సంప్రదాయాన్ని తోసిపుచ్చుతూ తీసుకున్న నిర్ణయం న్యాయ పరిశీలనలో నిలవగలదా? అనేది ప్రశ్న. ఈ సరికే హక్కుల సంఘాలు కేసులు వేయడం గమనార్హం. ఒకప్పుడు అమెరికా ఐసోలేషనిస్టు విధానాలు అనుసరిస్తూ ఒంటికొమ్ము సొంటికాయలా ప్రపంచ పరిణామాలకు దూరంగా ఉండిపోయేది. కానీ రెండు ప్రపంచ యుద్ధాల తర్వాత అగ్రరాజ్యంగా, ఆర్థిక, సైనికశక్తిగా ఎదగడంతో భూమి మీదగల సమస్త దేశాలతో అనుబంధం పెనవేసుకుపోయింది. వాణిజ్య ప్రయోజనాల కోసం దానిని బలిచేయడం సమర్థనీయం కాదు. ప్రపంచ శాంతి, సమృద్ధిలో అమెరికా తనవంతు సానుకూల పాత్ర పోషించాల్సి ఉన్నది.