అమెరికాలోని హార్వర్డ్ యూనివర్సిటీకి సుమారు 400 ఏండ్ల చరిత్ర ఉన్నది. దేశదేశాల నుంచి వచ్చే విద్యార్థులు అందులో చదువుతారు. వారిలో కొందరు తమ తమ దేశాలకు వెళ్లిపోయిన తర్వాతనో లేదా అమెరికాలోనే ఉండిపోయి కీలక పదవులను చేపడుతారు. హార్వర్డ్ పూర్వ విద్యార్థుల్లో పది మందికి పైగా దేశాధినేతలు అయ్యారు. అలాంటి ప్రతిష్ఠాత్మక విశ్వవిద్యాలయం ప్రస్తుతం రాజకీయ సుడిగుండంలో చిక్కుకున్నది. తన మనుగడ కోసం, విలువల కోసం న్యాయపోరాటం చేస్తున్నది. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రెండో విడత అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రకరకాల ఎజెండాలతో తనదైన శైలిలో వివిధ రంగాలపై విరుచుకుపడుతున్న సంగతి తెలిసిందే. ‘అమెరికా ఫస్ట్’, ‘మేక్ అమెరికా గ్రేట్ అగైన్’ వంటి తీవ్ర జాతీయవాద నినాదాలతో ఆయన అధికారంలోకి వచ్చారు.
అమెరికా అమెరికన్లకే అంటూ ఇతర దేశీయులకు ప్రవేశం నియంత్రిస్తూ వస్తున్నారు. అమెరికా వెళ్లి చదువుకుని, ఉద్యోగం సంపాదించి, అక్కడే స్థిరపడిపోయి డాలరు నీడలో హాయిగా బతుకుదామనుకునే విదేశీయులకు ట్రంప్ తన ఫర్మానాలతో చుక్కలు చూపిస్తున్నారు. అయితే అమెరికాలోకి ప్రవేశ ద్వారాల్లా పనిచేసే విశ్వవిద్యాలయాలపై ట్రంప్ ప్రత్యేకంగా దృష్టిపెట్టారు. దీని వెనుక ఆర్థిక కారణాలు మాత్రమే ఉన్నాయనడానికి వీల్లేదు.
చదువుల్లో శిఖరాలు అధిరోహించేందుకు సోపానాలుగా పనిచేసే విశ్వవిద్యాలయాల్లో రాజకీయ కార్యకలాపాలు అధికంగానే ఉండటం చరిత్ర చాటిన సత్యం. ప్రపంచవ్యాప్తంగా ఎన్నో కీలక ఉద్యమాలకు యూనివర్సిటీలు వేదికలైన సందర్భాలు కోకొల్లలు. ప్రభుత్వాలు ఆ ఉద్యమాలపై ఉక్కుపాదం మోపడమూ తెలిసిందే. ఇప్పుడు హార్వర్డ్ విషయంలో జరుగుతున్నది అదే. గాజాలో జరుగుతున్న మారణహోమంతోపాటు అమెరికా ప్రభుత్వ పాత్రను నిలదీసే అనేక ఆందోళనలు అక్కడి విశ్వవిద్యాలయాల్లో జరుగుతున్నాయి. ఇవి ట్రంప్ ప్రభుత్వానికి కంటగింపుగా మారాయి.
ఈ తరహా ఆందోళనలను తక్షణమే ఆపాలని, విదేశీ విద్యార్థుల కార్యకలాపాల వివరాలను అందజేయాలని విశ్వవిద్యాలయాలపై ట్రంప్ ప్రభుత్వం ఒత్తిడి తెస్తున్నది. అంతేకాకుండా కేంద్ర దర్యాప్తు సంస్థల జోక్యానికి వీలుకల్పించాలని డిమాండ్ చేస్తున్నది. దాదాపుగా అన్ని వర్సిటీలు దీనికి అంగీకరించాయి. హార్వర్డ్ మాత్రం ఇలాంటివి అకడమిక్ స్వేచ్ఛను అరికడుతాయని, అమెరికా విలువలకు ఇవి వ్యతిరేకమని చెప్తూ తీవ్రంగా ప్రతిఘటిస్తున్నది. దీంతో హార్వర్డ్ను దారికి తెచ్చుకునేందుకు సర్కారు సామ, దాన, భేద, దండోపాయాలతో రకరకాల ఎత్తుగడలను అమలు చేసింది.
ముందుగా ట్రంప్ సర్కారు నిధుల విషయంలో చర్యలు చేపట్టింది. కేంద్ర ప్రభుత్వపరంగా హార్వర్డ్‌కు విడుదల చేసే 300 కోట్ల డాలర్ల నిధుల విడుదలను ఆపివేసింది. మినహాయింపులను తొలగించి భారీగా పన్నులు వేస్తామనే ప్రయత్నాలు జోరుగా సాగుతున్నాయి. అయినా హార్వర్డ్ లొంగిరాకపోవడంతో ప్రభుత్వం మరింత కఠినమైన చర్యలకు దిగింది. విద్యార్థులకు సంబంధించిన సమాచారం ఇవ్వాలంటూ గత రెండు వారాల్లో రెండుసార్లు ఒత్తిడి తెచ్చింది.
సమాచారం ఇచ్చినా సంతృప్తి చెందక విదేశీ విద్యార్థులను చేర్చుకునే అర్హతను ఉపసంహరిస్తూ గత 22వ తేదీ ఉత్తర్వులు జారీచేయడంతో ఆ మరుసటి రోజే సుప్రీంకోర్టులో హార్వర్డ్ కేసు వేసి స్టే తెచ్చుకున్నది. ఈ కేసులు, వాటి అంతిమ తీర్పుల మాటెలా ఉన్నా, మొత్తం మీద ప్రపంచవ్యాప్తంగా అమెరికా పేరుప్రతిష్టలు దిగజారిపోతున్నాయి. డాలరు స్వప్నాలు మసకబారుతుండటం నాణేనికి ఓవైపు అయితే, మరోవైపు అమెరికా రాజ్యాంగ నిర్మాతలు ప్రవచించిన ప్రజాస్వామిక విలువలు తీవ్ర పరీక్షకు గురవుతున్నాయి.