ఐక్యరాజ్యసమితి ఏటా డిసెంబర్ 3ను అంతర్జాతీయ వికలాంగుల దినోత్సవంగా జరుపుకోవాలని ప్రకటించింది. 1992లో మొదలైన ఈ కార్యక్రమాన్ని 1998 నుంచి అన్ని దేశాలు అమలు చేస్తున్నాయి. వికలాంగులకు సమాన అవకాశాలు, హక్కులు కల్పించి సమాజాభివృద్ధిలో భాగం చేయాలనే లక్ష్యంతో ఐరాస 1981 ఏడాదిని అంతర్జాతీయ వికలాంగుల సంవత్సరంగా ప్రకటించింది. అలాగే 1983 నుంచి 1992 వరకు వికలాంగుల దశాబ్దంగా నిర్ణయించింది. ప్రపంచ జనాభాలో 100 కోట్లకు పైన వికలాంగులు ఉంటారని ఐరాస అంచనా. 2011 జనాభా లెక్కల ప్రకారం భారతదేశంలో సుమారు 2.68 కోట్ల మంది ఏదో ఒక వైకల్యంతో బాధపడుతున్నారు. వీరిలో 1.5 కోట్ల మంది పురుషులు 1.18 కోట్ల మంది మహిళలు. తెలంగాణలో 10,46,822 మంది వికలాంగులు ఉన్నారు.
రాజ్యాంగంలోని 41వ ఆర్టికల్‌లో అంగవైకల్యం, ఇతర అవాంఛనీయ సమస్యలు ఎదుర్కొంటున్న వారి సంక్షేమ కోసం నిర్దిష్ట ప్రణాళికలను రూపొందించాలని ఆదేశిక సూత్రాలలో ఉన్నది. భారతదేశంలో వికలాంగుల సంక్షేమం కోసం మొదటిసారిగా 1995లో చట్టం చేశారు. ఈ చట్టం గుర్తించిన వైకల్యాలు ఏడు మాత్రమే. కానీ వికలాంగుల హక్కుల గుర్తింపు దిశగా ఇది ఓ మైలు రాయిగా చెప్పొచ్చు. కొన్ని సవరణలు చేస్తూ 2016లో కేంద్ర ప్రభుత్వం కొత్త వికలాంగుల చట్టాన్ని అమల్లోకి తెచ్చింది. దీనిలో 21 రకాల వైకల్యాలు చట్టపరమైన గుర్తింపును పొందా యి. కానీ కేంద్ర ప్రభుత్వం ఈ చట్టాన్ని చిత్తశుద్ధితో అమలు చేయ డం లేదు. మన దేశంలో వికలాంగుల కోసం చేసిన చట్టాలు కాగితాలకే పరిమితమయ్యాయి.
నరేంద్రమోదీ వికలాంగులకు బదు లు దివ్యాంగులుగా పేరు మార్చి గొప్పలు చెప్పుకోవటం తప్ప వారి సంక్షేమం కోసం ఏ విధంగానూ కృషి చేయలేదు. కేంద్రం నుంచి వికలాంగులకు రావలసిన నిధులు కూడా సకాలంలో ఇవ్వడం లేదు. రైల్వేలో అమలవుతున్న రాయితీలను తొలగించేందుకు కేంద్రం ప్రయత్నిస్తున్నది. కేంద్ర ప్రభుత్వరంగ సంస్థల్లో వికలాంగుల బ్యాక్లాగ్ పోస్టులు ఖాళీగా ఉన్నప్పటికీ భర్తీ చేయడం లేదు. జాతీయ వికలాంగుల కమిషన్ ఊసే లేదు. వికలాంగుల సంక్షేమం విషయంలో కేంద్రం అత్యంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నా, తెలంగాణ ప్రభుత్వం మాత్రం పూర్తి శ్రద్ధ తీసుకుంటు న్నది. వికలాంగుల జీవితాల్లో వెలుగులు నింపాలని సీఎం కేసీఆర్ 2021-22లో రూ.83 కోట్లు కేటాయించారు. గతంలో రూ.500 ఉన్న వికలాంగుల పింఛన్‌ను ఆరింతలు చేసి రూ. 3016 ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ. వికలాంగుల పింఛన్ల కోసం ప్రతి నెల 167 కోట్లు, ఏడాదికి 2000 కోట్లు కేటాయిస్తున్నది రాష్ట్రప్రభుత్వం. డబుల్ ఇంజిన్ సర్కార్ అని గొప్పలు చెప్పుకునే బీజేపీ పాలిత రాష్ర్టాలైన ఉత్తరప్రదేశ్ రూ.1000, గుజరాత్ రూ.1000, మధ్యప్రదేశ్‌లలో రూ.300 చొప్పున, కాంగ్రెస్ పాలిత చత్తీస్‌గఢ్‌లో రూ.200 చొప్పున వికలాంగులకు పింఛన్లు ఇవ్వటం గమనార్హం.
వికలాంగుల కార్పొరేషన్ ద్వారా గత ఏడాది 17,000 మందికి లబ్ధి చేకూరేలా రూ.24 కోట్లతో త్రీ వీలర్ స్కూటీలు, బ్యాటరీ వీల్ చైర్లు, ట్రై సైకిల్స్, ల్యాప్ టాప్స్, వినికిడి పరికరాలు, స్మార్ట్ ఫోన్లు, బ్రెయిలీ బుక్స్ అందించింది తెలంగాణ ప్రభుత్వం.
వికలాంగులకు ప్రత్యేక విద్యను అందించడానికి అంధులకు 2, బధిరులకు 3 ఆశ్రమ పాఠశాలలు ఏర్పాటు చేసింది. ఫ్రీ మెట్రిక్, పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్లు అందించి ప్రోత్సహిస్తున్నది. దేశంలోనే మొదటిసారిగా వికలాంగుల నుంచి ఫిర్యాదుల స్వీకరణకు ప్రత్యేకంగా వెబ్‌సైట్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఎకనామిక్ రిహాబిలిటేషన్ సెంటర్లను, దివ్యాంగుల సలహా మండలిని ఏర్పాటు చేసింది. వికలాంగుల కోసం 20 హాస్టల్స్ ఏర్పాటు చేసింది. ఇందులో శారీరక వికలాంగుల కోసం 14, అంధుల కోసం 6 హాస్టల్స్ నడుస్తున్నాయి. హాస్టల్స్‌లో సన్న బియ్యంతో పౌష్టికాహారాన్ని తెలంగాణ ప్రభుత్వము అందిస్తున్నది. వికలాంగుల క్రీడల కోసం ప్రతి జిల్లాకు నిధులు కేటాయించింది.
వికలాంగులపై అరాచకాలు, దాడుల నివారణకు కఠిన చట్టాలను అమలు చేస్తున్నది. డబుల్ బెడ్రూం, దళితబంధు పథకాలతో పాటు ఇతర సంక్షేమ పథకాలలో వికలాంగులకు ఐదు శాతం రిజర్వేషన్ అమలు చేస్తున్నది. ఉద్యోగ నియమాకాలో 4 శాతం రిజర్వేషన్ కల్పించింది. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వికలాంగులకు సహకార సంస్థ నుంచి ఉచిత కోచింగ్‌తో పాటు మెటీరియల్‌ను అందించింది. రాష్ట్రంలో భర్తీ చేయనున్న ఉద్యోగాల్లో వికలాంగులకు మూడు వేల పైచిలుకు ఉద్యోగాలు అందనున్నాయి. వికలాంగ ఉద్యోగులకు వారి సర్వీసును బట్టి ప్రత్యేక అలవెన్సులు అమలు చేస్తున్నది. వికలాంగుల సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న కృషికిగాను 2018, 2019 సంవత్సరాల్లో అత్యుత్తమ రాష్ట్రంగా గుర్తించి కేంద్రం అవార్డులు ఇచ్చింది.
వికలాంగుల దినోత్సవం సం దర్భంగా వికలాంగులకు ముఖ్య మంత్రి కేసీఆర్ తాజాగా మరొక తీపి కబురును అందించారు. మహిళా శిశు సంక్షేమ శాఖ నుం చి వికలాంగుల శాఖను విడదీసి స్వతంత్ర విభాగంగా ఏర్పాటు చేస్తూ జీవో వెలువరించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీ ఆర్కు వికలాంగులు అందరి పక్షాన కృతజ్ఞతలు.
(వ్యాసకర్త: చైర్మన్, రాష్ట్ర వికలాంగుల సహకార సంస్థ)
-డా.కేతిరెడ్డి వాసుదేవరెడ్డి
95530 86666