ఉమ్మడి పౌరస్మృతిపై లా కమిషన్ ఇటీవలే తాజా కసరత్తు ప్రారంభించి ప్రజల నుంచి అభిప్రాయాలను ఆహ్వానించిన తరుణంలో ప్రత్యేక పన్ను ప్రయోజనాలను అందించే హిందూ అవిభాజ్య కుటుంబం (హెచ్‌యూఎఫ్) వ్యవస్థపై ఆదాయపు పన్ను నిపుణుల్లోనూ, హిందూ ఉమ్మడి కుటుంబాల్లోనూ జోరుగా చర్చ జరుగుతున్నది. యూనిఫాం సివిల్ కోడ్ (యూసీసీ) అమల్లోకి వస్తే హెచ్‌యూఎఫ్ వ్యవస్థపై ప్రభావం ఏ మేరకు ఉంటుందన్న ప్రశ్న తలెత్తుతున్నది.
యూసీసీపై అభిప్రాయాలను లా కమిషన్‌కు పంపించేందుకు గడువు ముగియనున్నది. సోమవారం నాటికల్లా 46 లక్షల స్పందనలు కమిషన్‌కు అందాయి. ప్రత్యక్షంగా వాదనలు వినేందుకు కొన్ని సంస్థలను, వ్యక్తులను రానున్న కొద్దిరోజుల్లో కమిషన్ ఆహ్వానించనున్నది. ఈ నేపథ్యంలో హిందూ అన్‌డివైడెడ్ ఫ్యామిలీ (హెచ్‌యూఎఫ్) అంటే? ఈ భావన ఎలా వచ్చింది? దీనితో పన్ను చెల్లింపుదార్లకు ప్రయోజనం ఎంత? దీనిపై యూసీసీ చూపే ప్రభావం ఏమిటి? తదితర అంశాలను సుప్రీంకోర్టు అడ్వొకేట్, చార్టర్డ్ అకౌంటెంట్ దీపక్ జోషి ఇలా విశదీకరించారు.
హిందూ అవిభాజ్య కుటుంబం చట్టబద్ధమైన సంస్థ: బ్రిటిష్ కాలం నుంచి హిందూ అవిభాజ్య కుటుంబానికి ఒక సంస్థగా చట్టబద్ధమైన ఉనికి ఉంది. హిందువుల కుటుంబాల ఆస్తులను ఉమ్మడిగా నిర్వహించుకునే సంప్రదాయం నెలకొన్న కారణంగా హెచ్‌యూఎఫ్‌కు బ్రిటిష్‌వారు భారత పన్ను చట్టాల్లో ప్రత్యేకత కల్పించారు.
ఆదాయపు పన్ను శాఖ వెబ్సైట్ ప్రకారం పూర్వీకుడి వారసులు, వారి భార్యలు, పెండ్లికాని కుమార్తెలతో కూడిన కుటుంబాన్ని హెచ్యూఎఫ్గా వ్యవహరిస్తారు. హెచ్‌యూఎఫ్‌కు సైతం సొంతం గా ఒక పర్మినెంట్ అకౌంట్ నంబర్ (పాన్) ఉం టుంది. పన్ను రిటర్న్‌లను దాఖలు చేస్తుంది. హెచ్‌యూఎఫ్ ‘కర్త’ (సాధారణంగా కుటుంబ పెద్ద) కుటుంబానికి చెందిన రోజువారీ కార్యకలాపాలు నిర్వహిస్తాడు. కుటుంబంలోని ఇతరులు పూర్వీకుల ఆస్తిపై హక్కుదారులుగా కొనసాగుతారు. పిల్లలు వారి తండ్రి హెచ్‌యూఎఫ్‌లో సభ్యులుగా ఉంటారు.
పన్ను భారం తగ్గేందుకు పలు మార్గాలు: పన్ను చట్టాల కింద హెచ్యూఎఫ్ను ఒక ప్రత్యేక సంస్థగా గుర్తిస్తున్నందున హిందువుల కుటుంబాలు పలు మార్గాల్లో పన్నుభారాన్ని తగ్గించుకోవడం ద్వారా లబ్ధి పొందే అవకాశం కలుగుతున్నది. ఉదాహరణకు రామ్ అనే వ్యక్తికి రూ.5,00,000 వార్షిక వేతనం, పూర్వీకుల ఆస్తిని అద్దెకు ఇవ్వడం ద్వారా అదనంగా మరో రూ.2,50,000 ఆదాయం లభిస్తున్నది. రామ్‌కు పెండ్లి అయ్యి, శ్యామ్ అనే కొడుకు కూడా ఉన్నాడు. మొత్తం రూ.7,50,000 ఆదాయంలో బేసిక్ మినహాయింపు రూ.2,50,000 వరకూ రామ్ పన్ను చెల్లించాల్సిన పనిలేదు. దీంతో ఆయన నికర పన్ను ఆదాయం రూ.5,00,000 అవుతుంది. దానికి వర్తించే శ్లాబ్ రేటు ప్రకారం పన్ను చెల్లించాల్సి ఉంటుంది. అయితే రామ్ తన భార్య, కొడుకులతో కలిసి హెచ్యూఎఫ్ను ఏర్పర్చుకునే అవకాశం ఉంది. దీనిప్రకారం పూర్వీకుల ద్వారా సంక్రమించిన ఆస్తి హెచ్‌యూఎఫ్ ప్రాపర్టీ అవుతుంది.
తద్వారా లభించిన ఆదాయాన్ని హెచ్‌యూఎఫ్ రిటర్న్‌లో చూపిస్తే రూ.2,50,000 అద్దె ఆదాయానికి (బేసిక్ ఆదాయం అయినందున) పన్ను ఉండదు. అంటే హెచ్‌యూఎఫ్ ఏర్పర్చడంతో రూ.2.5 లక్షల పన్ను రహిత ఆదాయం లభించినట్టయింది. అలాగే రామ్ వ్యక్తిగత పన్ను ఆదాయం బేసిక్ మినహాయింపును తీసేస్తే రూ.2.5 లక్షలకు తగ్గుతుంది. అప్పుడు కనిష్ఠ శ్లాబ్ ప్రకారం పన్ను చెల్లిస్తే సరిపోతుంది. అంతేకాదు.. ఆదాయపు పన్ను చట్టం సెక్షన్-10(2) ప్రకారం హెచ్‌యూఎఫ్ ద్వారా అందులో సభ్యుడికి అందే ఆదాయాన్ని వ్యక్తిగత మొత్తం ఆదాయంలో కలపాల్సిన అవసరం లేదు. అంటే రామ్ హెచ్‌యూఎఫ్ అద్దె ఆదాయంలో తన వాటాను తీసుకుంటూ దానిపై పన్ను చెల్లించనక్కర్లేదు. అదే హెచ్‌యూఎఫ్ ఏర్పాటు చేసుకోకుండా అద్దె ఆదాయా న్ని తన పేరిట తీసుకుంటే పన్ను భారం అధికంగా ఉండేది. అంతేకాదు.. హెచ్‌యూఎఫ్ ఆదాయం లో ఖర్చులను క్లెయిమ్ చేసుకోవచ్చు. పన్ను ఆదా యం నుంచి పలు మినహాయింపులూ తీసుకోవచ్చు.
అవకాశం అందరికీ లేదు: హిందూ పర్సనల్ లా (జైనులు, బౌద్ధులు, సిక్కులతో కలసి) చట్టాన్ని అనుసరించి ఉమ్మడి కుటుంబం, వారసత్వాన్ని ఉద్దేశించిందే హెచ్‌యూఎఫ్. దీని కింద లభించే పన్ను ప్రయోజనాలు హిందువులు మినహా ఏ ఇతర మతాలకు (ముస్లింలు, క్రిస్టియన్లు, పార్సీలు తదితరాలు) లభించవు.
పన్ను చెల్లింపుదారులపై పన్ను చట్టా లు మతం ఆధారంగా వర్తించడం, సమానత్వం లోపించడం ఆందోళనకరమైన అంశం. కేవలం మతాన్ని అనుసరించి పన్ను భారాన్ని తగ్గించుకునే అవకాశాన్ని కల్పించడం రాజ్యాంగంలోని ఆర్టికల్-14కు విరుద్ధం.
ఈ నేపథ్యంలో పన్ను చట్టాల ముందు అంద రూ సమానులే, అన్ని మతాలకు పన్ను చట్టాల వర్తింపు ఒక్కటేనన్న కోణంలో ఉమ్మడి పౌరస్మృతిపై లా కమిషన్ ముందు చర్చ జరగడం తప్పనిసరి.
– రచయిత: దీపక్ జోషి
– అనువాదం: ఎస్పీ