కాంగ్రెస్ పాలనలో రాష్ట్రంలో చీకట్లు కమ్ముకొన్నాయి. ప్రజలను ఆశలపల్లకిలో ఊరేగించి అధికారం చేజిక్కించుకున్న హస్తం పార్టీ నేతలు ఏరు దాటాక తెప్పను తగులబెట్టారు. ఏ రంగం చూసినా ఏమున్నది గర్వకారణం అన్నట్టుగా విద్య, వైద్య, వ్యవసాయ, ఆర్థిక రంగాలు సర్వం కుదేలయ్యాయి. పాలన చేతగాక, ప్రభుత్వంలో సమన్వయం లేక సర్కార్ దివాలా తీసింది. ఆరు గ్యారెంటీలు, 420 హామీలు, 11 డిక్లరేషన్లు దిక్కులేకుండాపోయాయి. మాటలు నీటిమూటలయ్యాయి.
నేడు రాష్ట్రంలో ఎవరిని కదిలించినా మోసపోయినం.. గోసపడుతున్నం అనే మాటనే సమాధానంగా వినిపిస్తున్నది. ముఖ్యంగా గత ఎన్నికల్లో కాంగ్రెస్ మాటలతో బోర్లపడ్డవాళ్లలో విద్యావంతులు కూడా ఉండటం మరింత విషాదం. ఇప్పుడు వాళ్లు పోరుబాట పట్టారు. నోటిఫికేషన్ల కోసం గొంతెత్తుతున్నారు. ఇటీవల టీచర్, పోలీస్ ఉద్యోగాల భర్తీ కోసం రోడ్డెక్కితే ప్రభుత్వం లాఠీలు ఎత్తింది. ఇది నిరుద్యోగుల్లో మరింత నిస్పృహ, ఆగ్రహానికి కారణమవుతున్నాయి.
ఏడాదిలో రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని కాంగ్రెస్ చెప్తే నిరుద్యోగులు నమ్మారు. కానీ ఇవన్నీ ఉత్తముచ్చట్లేనని తేలిపోయింది. అధికారంలోకి వచ్చిన తర్వాత హామీలు మర్చిపోవడమే కాకుండా, చేయని భర్తీని చేసినట్టు చెప్పుకోవడం వింతల్లోకెల్లా వింత. ఇక నిరుద్యోగ భృతిపై అసలు హామీనే ఇవ్వలేదని నిండు శాసనసభలో ఉపముఖ్యమంత్రి భట్టివిక్రమార్క బుకాయించారు.
ఉద్యోగాలెప్పుడిస్తారని నిరుద్యోగులు గొంతెత్తుతుంటే ఇప్పటికే 80వేల ఉద్యోగాలు ఇచ్చామని పాలకపార్టీ పెద్దలు దబాయిస్తున్నారు. రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామన్నది ఏడాదిలో కాదని, ఐదేండ్లలో అని కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. నిత్యం ఎక్కడో ఓ చోట నిరుద్యోగులు తమ నిరసనను వ్యక్తం చేస్తూనే ఉన్నారు. అయినా కాంగ్రెస్ పాలకులకు చీమకుట్టినట్టయినా లేదు.
తెలంగాణ ఉద్యమం జరిగిందే నీళ్లు, నిధులు, నియామకాలు నినాదంతో. ఈ నేపథ్యంలో ప్రత్యేక రాష్ట్రంలో ప్రజల ఆకాంక్షల పరిపూర్తికి కేసీఆర్ ప్రభుత్వం స్వల్పకాలిక, దీర్ఘకాలిక ప్రణాళికలు ఆచరణలో పెట్టింది. సకల జనుల సంక్షేమమే లక్ష్యంగా పాలన సాగించారు. అందులో భాగంగా బీఆర్ఎస్ హయాంలో తొమ్మిదిన్నరేండ్లలో 2,32,308 ఉద్యోగులకు అనుమతి ఇవ్వగా, అందులో 2,02,735 ఉద్యోగాలకు వందకుపైగా నోటిఫికేషన్లు విడుదలయ్యాయి. వీటిలో 1,60,083 ఉద్యోగాలు భర్తీ అయ్యాయి. మరో 42,652 ఉద్యోగాల భర్తీ ప్రక్రియ వివిధ దశల్లో ఉన్న సమయంలో అసెంబ్లీ ఎన్నికలు వచ్చాయి.
మాయదారి మాటలతో మోసకారి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. ప్రతిపక్ష బీఆర్ఎస్ నిలదీయడం, నిరుద్యోగులు పోరుబాట పట్టడంతో గత్యంతరం లేక కాంగ్రెస్ సర్కార్ సభలో ప్రకటన చేయాల్సి వచ్చింది. 2023 డిసెంబర్ నుంచి 2026 మార్చి నాటికి 67,763 ఉద్యోగాలు భర్తీ చేశామని, అందులో 50,785 ఉద్యోగాలకు బీఆర్ఎస్ ప్రభుత్వమే నోటిఫికేషన్లు ఇచ్చిందని, తాము 16,978 ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇచ్చి, భర్తీ చేశామని వెల్లడించింది. మరి పీసీసీ అధ్యక్షుడు చెప్తున్న 80వేల ఉద్యోగాల లెక్క ఎక్కడిదో! దీంతో కాంగ్రెస్ అసలు రంగు బయటపడింది.
అశోక్‌నగర్ రోడ్లపై హడావుడి చేసిన రాహుల్ గాంధీ ఏమైపోయారో! రాహుల్ గాంధీ ఏ పని మీద హైదరాబాద్ వచ్చినా, అశోక్‌నగర్‌లో కర్ఫ్యూ వాతావరణం నెలకొంటుండటం ప్రభుత్వ అభద్రతను తెలియజేస్తున్నది. తొమ్మిదిన్నరేండ్లపాటు ప్రగతి పథంలో దూసుకుపోయిన తెలంగాణను చూసి సబ్బండ వర్ణాలు సంబురపడ్డాయి. తెలంగాణ పునర్నిర్మాణం చారిత్రక, కీలక దశకు చేరిన తరుణంలో మోసపూరిత హామీలతో అడ్డగోలు హామీలు ఇచ్చి గద్దెనెక్కింది. దీంతో తెలంగాణ గమనం తారుమారైంది. గ్యారెంటీల గారడీతో మాయచేసిన కాంగ్రెస్‌కు తగిన గుణపాఠం తప్పదని సకల జనులు హెచ్చరిస్తున్నారు. ఆశలు ఆవిరై, కాంగ్రెస్ చేతులో మోసానికి గురై దుర్భర పరిస్థితులు అనుభవిస్తున్న నిరుద్యోగులు కాంగ్రెస్ కర్కశ పాలనపై కన్నెర్ర చేస్తున్నారు.