భారత్, బ్రిటన్ దేశాల మధ్య ఇరుదేశాల ప్రధానులు నరేంద్ర మోదీ, కీర్ స్టార్మర్ సమక్షంలో సమగ్ర ఆర్థిక, వాణిజ్య ఒప్పదం (సెటా)పై గత గురువారం సంతకాలు జరిగాయి. దీనినే ‘ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్’ అని కూడా అంటున్నారు. మూడు సంవత్సరాల పాటు సుదీర్ఘంగా కొనసాగిన సంప్రదింపుల పర్యవసానంగా రూపొందిన భారత్-బ్రిటన్ వాణిజ్య ఒప్పందం లాభనష్టాలపై ప్రస్తుత టారిఫ్ యుద్ధాల నేపథ్యంలో సహజంగానే విస్తృత చర్చ జరుగుతున్నది. సెటా కింద బ్రిటన్ తన దిగుమతుల్లో 99 శాతం సరుకులపై టారిఫ్‌లు ఎత్తివేయనున్నది. భారత్ ఎగుమతి చేసే వస్ర్తాలు, పాదరక్షలు, తివాచీలు, వాహనాలు, చేపలు, పండ్లు మొదలైనవాటిపై సున్నా సుంకం ఉంటుంది.
అయితే సుంకాలు ఎత్తివేసిన సరుకులన్నీ భారత్ ఎగుమతి చేసేవి కాకపోవడం గమనార్హం. అనేక వస్తువులు, వాటి ధరల విషయంలో చైనాతో భారత్ పోటీ పడాల్సిరావడం మామూలు విషయమేమీ కాదు. సెటా వల్ల ఇతర నష్టాలూ ఉన్నాయి. మొదటి ఏడాది భారత్‌కు రూ.4,060 కోట్ల నష్టం వాటిల్లుతుందని గ్లోబల్ ట్రేడ్ రిసెర్చ్ ఇనీషియేటివ్ సంస్థ అంచనా వేస్తున్నది. ఈ నష్టం ఏటా పెరుగుతూ పదేండ్ల తర్వాత ఏడాదికి రూ.6,345 కోట్లకు చేరుకుంటుందని అంటున్నారు. అదే సమయంలో బ్రిటన్‌కూ తొలి ఏడాది సుంకాల ఎత్తివేత వల్ల రూ.3,884 కోట్ల నష్టం వస్తుంది. అంటే రెండు దేశాలూ ఇస్తినమ్మ వాయినం అన్నట్టుగా ఎంతో కొంత నష్టాన్ని భరించక తప్పదన్న మాట.
సుంకాల ఎత్తివేత నష్టాలను అలా ఉంచితే, సెటాతో బ్రిటన్ నుంచి నాణ్యత లేని ఉత్పత్తులకు, ముఖ్యంగా ఆరోగ్యానికి హాని చేసే బిస్కెట్లు, చాక్లెట్లు, శీతల పానీయాలకు తలుపులు బార్లా తెరిచినట్టు అవుతుందనే ఆందోళన వ్యక్తమవుతున్నది. వీటిని వెన్నంటి అధిక బరువు, మధుమేహం వంటి అనారోగ్య సమస్యలు వస్తాయనేది జగమెరిగిన సత్యం. ఇంకా బ్రిటన్ నుంచి దిగుమతయ్యే ఖరీదైన మద్యం, కార్ల ధరలు భారత్‌లో దిగివస్తాయి. దీనివల్ల సామాన్యులకు ఒరిగేదేమిటనేది ప్రశ్న. వాణిజ్య ఒప్పందంలో భాగంగా కార్ల దిగుమతిపై భారత్ సుంకాలు ఎత్తివేయడం ఇదే ప్రథమం. బ్రిటన్ నుంచి దిగుమతి చేసుకునే సూపర్ లగ్జరీ కార్లపై సుంకం ప్రస్తుత 110 శాతం నుంచి పదేండ్లలో 10 శాతానికి తగ్గిపోనునున్నది. ఏసీలు, వాషింగ్ మెషిన్ల వంటి గృహోపకరణాలపైనా సుంకాలు దశలవారీగా సున్నాకు పడిపోతాయి. ఇవేవీ అత్యవసర సరుకుల జాబితా కిందకు రావని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.
ఈ ఒప్పందం సరుకులకు మాత్రమే కాకుండా సేవల రంగంలోనూ బ్రిటిష్ కంపెనీలకు అవకాశాలు కల్పించడం తీవ్రంగా ఆలోచించాల్సిన విషయమే. భారత్‌లో ఆఫీసులు లేని కంపెనీలూ సేవల రంగంలో ప్రవేశించడానికి ఇది అనుమతిస్తున్నది. న్యాయసేవలను ఈ పరిధిలో చేర్చకపోవడం గుడ్డిలో మెల్లగా భావించవచ్చు. తాత్కాలిక ఉద్యోగాలపై బ్రిటన్‌కు వెళ్లే భారతీయులకు అక్కడి సామాజిక భద్రతా పథకాల్లో చేరాల్సిన అవసరం లేకుండా చేసే మరో ఒప్పందంపై సెటాతో పాటే సంతకాలు జరగడం విశేషం. టీ, కాఫీ, బంగారు బిస్కట్ల విషయంలో సుంకాల కొనసాగింపు ద్వారా భారత్ జాగ్రత్తలు పాటించడం ముదావహం. నిజానికి బ్రిటన్‌తో భారత్ వాణిజ్యం చాలా తక్కువ. భారత్ ఎగుమతుల్లో బ్రిటన్ వాటా 3.3 శాతమైతే, దిగుమతుల్లో 1.2 శాతం మాత్రమే. ఈ నేపథ్యంలో సెటాపై మోదీ ప్రభుత్వం చేస్తున్న హంగామా కొంచెం అతిగానే కనిపిస్తున్నది.