టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఆ మధ్య ఓ టీవీ ఇంటర్వ్యూలో రేవంత్‌రెడ్డిని అగ్రవర్ణ బీసీగా పరిగణిస్తున్నమని చెప్పిన్రు. మరలా ఒక రోజు ‘రేవంత్ గౌడ్’ అని సంబోధించిన్రు. రేవంత్ ఆప్యాయత చూరగొనాలంటే తన పేరు చివర ‘రెడ్డి’ తగిలించుకోవాలేమో అధ్యక్షులవారు! ఎంత సులువుగా వారి కులాంతరీకరణ జరిగిపోయిందో, అంతే తేలికగా కోర్టుల ముందు పరువు పోయింది!
‘గౌడ్’ పిలుపునకు చిద్విలాసంగా నవ్విన రేవంత్‌రెడ్డి, కోర్టులకు పోయి, ఒంటరిగా దుఃఖిస్తున్నరు కాబోలు, ఆయనే ఆ మధ్య కోర్టులపై వ్యాఖ్యానించినట్టు. పైన పేర్కొన్న నా మాటలు మీకు నవ్వు పుట్టిస్తున్నయి కదూ? కారణం నా హాస్యప్రియత్వం కాదు, రేవంత్ అండ్ టీమ్ పరిహాసాస్పద పాలిటిక్స్, ప్రహసనాసక్త పాలన!
మహేష్ సారుకు చెప్పండి ఎవరైనా ఓటుకు నోటు కేసులో ఊచలు లెక్కపెట్టినాక… 2015 జూలై 2న ఇదే ‘రేవంత్ గౌడ్’ జైలు నుంచి విడుదలై వస్తూ ఎన్టీఆర్ ఘాట్ దగ్గర చేసిన ప్రసంగంలో ఏమన్నరో గుర్తుచేయండి. ‘కల్లు గీసుకునేవాళ్లకు, చెప్పులు కుట్టుకునేవాళ్లకు, ఆలుగడ్డలు అమ్మేవాళ్లకు మంత్రి పదవులు ఇచ్చింది టీడీపీ’ అని! దేవేందర్‌గౌడ్, కడియం, తలసానిల గురించి వృత్తుల పేరు పెట్టి మరీ నీచంగా మాట్లాడిన్రు ఆయన. ఇప్పుడు ఆ గట్టునే ఉన్న దానం నాగేందర్‌ను పంజాగుట్ట చౌరస్తాలో బీడీలు అమ్ముకునేవాడని వెకిలిగా మాట్లాడిన్రు.
ఇపుడు చెప్పండి ఆయన బీసీ ఎట్లయితడు? అహంకారం అణువణువునా ఉన్న రేవంత్‌రెడ్డి బహుజన వర్గాలకు మేలు చేయగలరని ఎట్లా అనుకుంటరు ఎవరైనా? మొన్న హైకోర్టు దగ్గర పెద్దాయన వి.హనుమంతరావు చాలా బాధపడ్డరు, హైకోర్టు మోసం చేసిందన్నరు. ఆయన గ్రహించాల్సింది రేవంత్‌రెడ్డి మోసకారితనాన్ని. బీసీలనే కాదు, సకల జనాన్ని, చివరికి కాంగ్రెస్ అధిష్ఠానాన్ని సైతం మోసం చేస్తున్నరు రేవంత్‌రెడ్డి. మొన్న హైకోర్టు దగ్గర మంత్రులు కూడా నిందారోపణలకు పరిమితం అయిన్రు తప్ప ఒక్కరికీ సీరియస్‌నెస్ లేదు బీసీల పట్ల! ‘రాష్ట్రపతి దగ్గర ఏదైనా బిల్లు మూడు నెలలకు మించి పెండింగ్ ఉంటే, ఆమోదం పొందకున్నా చట్టరూపం దాల్చినట్టే’ అని గతంలో సుప్రీంకోర్టు అన్నది కాబట్టి, ఇప్పుడు అది చట్టమే అంటూ పరమ అమాయకత్వం ఒలకబోసిన్రు డిప్యూటీ సీఎం భట్టి. మరి ఇంకేమి సమస్య? కోర్టులను పక్కన పడేయండి. ఇవ్వండి 42 శాతం. ఇవ్వగలరా? ఎందుకీ డొల్ల మాటలు, కల్ల భరోసాలు!
బీసీ నాయకులూ, బీసీ సంఘాలూ, బీసీ మహాజనానికీ ఓ సూచన! కోర్టులను నిందిస్తే ప్రయోజనం లేదు. రాజ్యాంగ స్ఫూర్తి పరిధిలో, హక్కుల పరిరక్షణ కోసం కోర్టులు పనిచేస్తయి. వాటికి భావోద్వేగాలు ఉండవు. బీసీల సమస్య పరిష్కారానికి భావోద్వేగాలు పనిచేయవు. కావాల్సింది కార్యాచరణ. గల్లీలో బంద్‌లు సరిపోవు. ఢిల్లీలో లాబీయింగ్ అవసరం. కాంగ్రెస్-బీజేపీలకు కలిపి తెలంగాణ నుంచి 16 మంది లోక్‌సభ సభ్యులు ఉన్నరు, రాజ్యసభలోనూ ఉన్నరు. ఆ రెండు జాతీయ పార్టీలు పూనుకుంటే చిటికెలో సమస్య పరిష్కారం అవుతుంది. నిజంగా చిత్తశుద్ధి ఉంటే రాహుల్-మోదీలకు ప్రీతిపాత్రుడైన శిష్య పరమాణువు రేవంత్ పూనుకోవాలి.
కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారం వెలగబడుతున్న 1992లోనే ‘మొత్తం రిజర్వేషన్లు 50 శాతానికి మించవద్దు’ అని ఇందిరా సాహ్నీ కేసులో సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. ఆ విషయం రాహుల్‌గాంధీకి, రేవంత్‌రెడ్డికీ తెలుసు! దేశాన్ని ఎక్కువ కాలం పాలించిన కాంగ్రెస్, బీజేపీలు ఈ విషయాన్ని కోల్డ్ స్టోరేజీలో పెట్టిన్రు. ప్రత్యేక సందర్భాల్లో, ఉదాహరణకు అప్పటి ప్రధాని పీవీ నరసింహారావును ఒప్పించి తమిళనాడు సీఎం జయలలిత తమ రాష్ర్టానికి ప్రత్యేకంగా 69 శాతం రిజర్వేషన్ల కోసం రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్‌కు సవరణ చేయించుకున్నరు.
ఇపుడు అదే పని బీజేపీ-కాంగ్రెస్ కలిస్తే ఒక్క నిమిషంలో చేసేయొచ్చు. ఉత్తుత్తి విమర్శలు, టైం పాస్ ఉద్యమాలు, పనికిరాని ఆవేశాలు, నిందారోపణలు బంద్ చేసి బీసీలకు పనికొచ్చే పని చేయండి రేవంత్‌రెడ్డీ, కిషన్ రెడ్డీ! అప్పుడు కావాలంటే మీ ఇద్దరినీ తమలో కలిపేసుకుంటరు ఆనందంగా బీసీలు! ఏమంటరు మహేష్!?
కాంగ్రెస్ నాయకులే అంటే, వారిని మించి అపహాస్యం పండిస్తున్నరు అధికార గణమూ, మీడియా! రిజర్వేషన్ల అంశం కోర్టుల్లో ఉందని తెలిసీ రాష్ట్ర ఎన్నికల సంఘం దూకుడుగా వ్యవహరించింది. పోయిన వారం సుప్రీంకోర్టు ‘హైకోర్టులోనే తేల్చుకోండి’ అనగానే, తెల్లారే ఉరుకులు పరుగులు పెట్టింది. హైకోర్టు తీర్పు కోసం 8వ తేదీ వరకు ఆగి ఉంటే పరువు దక్కేది. తమ తెంపరితనంతో బీసీ అభ్యర్థులను భ్రమలో ముంచి, వారితో ఖర్చులూ పెట్టించి, చివరికి నట్టేట ముంచేసింది.
ఇప్పుడు కూడా అదే తంతు. పరాభవం నుంచి పాఠం నేర్చుకోని రేవంత్‌రెడ్డి… జీవో 9, 41, 42లపై హైకోర్టు విధించిన స్టేను సవాల్ చేస్తూ సుప్రీంకోర్టు తలుపు తట్టాలని ఆలోచిస్తున్నరు. ఇంతలో 50 శాతం రిజర్వేషన్లతో ఎన్నికలను ఎన్నికల సంఘం నిర్వహించుకోవచ్చని హైకోర్టు అన్నది కాబట్టి, మరలా హడావుడి చేస్తున్నరు. మీరైనా ఆగాలి, రేవంత్ అయినా ఆగాలి హైకోర్టు, సుప్రీంకోర్టు దీనికి ఒక లాజికల్ ఎండ్ ఇచ్చేవరకు! ఊహూ, అంత ఓపిక లేదు, పని జరగాలన్న ఆరాటం లేదు. ఏదో చేస్తున్నామన్న భ్రమల్లో జనాన్ని ఉంచాలి. అదొక్కటే ఎజెండా. ఇప్పుడు బీసీ సంఘాలు ఏం చేయాలి? నింపాదిగా కూర్చొని, ఆలోచించి.. సమస్యకు పరిష్కారం రేవంత్ జీవో 9 కాదు, రాజ్యాంగపు షెడ్యూల్ 9లో ఉన్నదని గ్రహించాలి. కాంగ్రెస్-బీజేపీల మీద ఒత్తిడి తెచ్చి లక్ష్యం సాధించాలి.
ఇప్పుడిప్పుడే అర్థమవుతున్నది, రేవంత్‌రెడ్డి ఇచ్చిన 42 శాతం వచ్చేది కాదు, సచ్చేది కాదని. సోనియా, రాహుల్, ఖర్గే, ప్రియాంకలకు అది తెలుసు కాబట్టే, ఢిల్లీలో సీఎం పెట్టిన సభకు వారు పోలేదు. రాష్ట్రంలోనూ జరిగిన ఏ ‘కాంగ్రెస్ బీసీ సంబురాల్లో’ పాలుపంచుకోలేదు. కామారెడ్డి బీసీ డిక్లరేషన్‌లో కామా లేదు, ఫుల్ స్టాప్ అప్పుడే పెట్టేసిన్రు అని నేను అంటే, అది ‘ఫుల్స్టాప్ డిక్లరేషన్’ అని ప్రజలు అంటే, కేసులు పెడతారా? పెట్టగలరా? కాంగ్రెస్ అధిష్ఠానం పట్టనితనం, రేవంత్ కపటబుద్ధి ఈ సమస్యకు మూలకారణం.
ఇప్పటికైనా అన్ని పార్టీల్లోని బీసీలు రేవంత్‌రెడ్డిని నిలదీయాలి. ఇచ్చిన హామీ అమలు చేసేదాకా వదలొద్దు. ఇతర పార్టీలపై నిందలు మాని, చిత్తశుద్ధితో సమస్య పరిష్కారానికి ఢిల్లీ కదలాలి, అందర్నీ కలుపుకుని. లేకపోతే, మహేష్ కుమార్ ఇచ్చిన ‘గౌడ్’ బిరుదును మాత్రమే కాదు, పదవి నీ ఒలుస్తరు జనం, రాబోయే ఎన్నికల్లో!
-శ్రీశైల్‌రెడ్డి పంజుగుల ,90309 97371