Tomato | ఎరుపు రంగు, ఆకట్టుకునే రూపంతో చూడగానే నోరూరించే కూరగాయ టమాట. ఏ కాలంలోనైనా వండుకొని తినేందుకు అనువైనది. ఏ కూరయినా రుచిగా ఉండాలంటే అందులో టమాట వేయాల్సిందే. కేవలం కూరగాయగానే కాకుండా పండుగా తినడానికి కూడా అనువైనది టమాట. అలాంటి టమాట ధర ఆకాశాన్నంటడంతో టమాట ప్రియులు బిక్కమొహం వేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా 15 వేల రకాల టమాటలు సాగు చేస్తున్నారు. మన దేశంలో సుమారు వెయ్యి రకాల టమాటలు అందుబాటులో ఉంటాయి. భారతీయ వంటకాల్లో అతి ప్రధానమైన కూరగాయ టమాట.
చేదుకూరల నుంచి తీపి కూరల వరకు వాటిల్లో ఉన్న వెగటును, జిగటును తీసేసేది టమాట. మధ్య, పేద తరగతి కుటుంబాల్లో ఇంటిల్లిపాదికి సరిపోయేవిధంగా కూరలు వండాలంటే వాటిల్లో టమాటలు వేయాల్సిందే.
గతేడాది ఇదే సమయంలో అక్కడెక్కడో పాకిస్థాన్‌లో వరదలు వచ్చిన ప్రాంతాల్లో కిలో టమాట రూ.500, కిలో ఉల్లిగడ్డ రూ.300 పలికిందంటే అది నిజం కాదనుకున్నాం. ప్రపంచ దేశాల నుంచి తిరస్కరణను ఎందుర్కొంటున్న పాక్ ఆయా దేశాల సానుభూతిని పొందడానికి అలాంటి వార్తను స్క్రోల్ చేసి ఉండవచ్చని అనుకున్నారు ప్రజలు. కానీ సరిగా ఇదే సమయంలో ఉత్తర భారతదేశంలో వర్ష బీభత్సానికి అక్కడ కూరగాయలు దొరకక ధరలు విపరీతంగా పెరిగాయి. ముఖ్యంగా ఉత్తరాఖండ్, హిమాచల్‌ప్రదేశ్ లాంటి రాష్ర్టాల్లో గంగోత్రి, యమునోత్రి, హరిద్వార్ లాంటి నగరాల్లో కిలో టమాట ధర రూ.300 అయిం ది. అలాగే ఢిల్లీ, ముంబై, కలకత్తా లాంటి మెట్రో నగరాల్లో మామూలుగా ఉండే ధర కంటే దాదాపు 600 నుంచి 800 శాతం వరకు పెరిగి కిలో టమాట రూ.150 నుంచి రూ.200లకు చేరుకున్నది. తెలంగాణ, తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకున్న కొన్ని చర్యల వల్ల హైదరాబాద్, చెన్నై లాంటి నగరాల్లో టమాట ధరలు కొంత అదుపులో ఉండి కిలో టమాట రూ.100 పలుకుతున్నది. ఇసుక నేలల నుంచి బంకమట్టి నేలల వరకు అన్ని రకాల నేలలు టమాట సాగు కు అనుకూలమైనవి. వ్యవసాయ శాస్త్రవేత్తల ప్రకా రం…21 నుంచి 24 సెంటిగ్రేడ్ ఉష్ణోగ్రతలుండే ప్రాం తాల్లో టమాట రంగులో నాణ్యత, వృద్ధి బాగా వస్తుంది. భారతదేశ వాతావరణ పరిస్థితులు టమాట పంటకు అనుకూలమైనవి. అందుకే భారతదేశం మొత్తం ప్రపంచ టమాట సాగు ఉత్పత్తిలో 10 శాతం వాటా కలిగి ఉండి రెండవ స్థానంలో ఉన్నది. ప్రపంచ సాగు ఉత్పత్తిలో 37.75 శాతంతో చైనా మొదటిస్థానంలో ఉండటం గమనార్హం.
70 రోజుల్లో చేతికివచ్చే ఈ పంటను ఏటా నాలుగుసార్లు రైతులు సాగుచేస్తారు. అలాంటిది కొన్నివారాల కిందట రూ.10ల లోపు మార్కెట్ ధర ఉండటం వల్ల రైతుకు గిట్టుబాటు ధర రాలేదు. దీంతో టన్నులు కొద్ది టమాటను రోడ్లపై పారబోశారు. టమాటను నిల్వ చేయడానికి, చేతికి వచ్చిన పంటను సంరక్షించుకోవడానికి శీతల గిడ్డంగులు లేకపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు.
ఐదేండ్ల నుంచి వరుసగా ఏడాదికి 16 మెట్రిక్ టన్నుల నుంచి 20 మెట్రిక్ టన్నుల టమాట మాత్రమే పండుతున్నది. దీనికి కారణం టమాట పండిస్తున్న రైతులకు కేంద్ర ప్రభుత్వం శీతల గిడ్డంగులు ఏర్పాటుచేయడంలో అలసత్వం ప్రదర్శించడమే. దీంతో రైతులు టమాట సాగుకు ముందుకురావడం లేదు. దానివల్ల దిగుబడి చాలా వరకు తగ్గింది.
పండిన టమాటకు సరైన మార్కెట్ ధర కూడా లేకపోవడంతో టమాట సాగుకు రైతులు ఆసక్తి చూపడం లే దు. ముఖ్యంగా టమాట సాగు ఉత్పత్తుల్లో దేశంలోని అన్ని రాష్ర్టాల్లోకెల్లా తెలుగు రాష్ర్టాలది మొదటి స్థానం. కానీ, ఇక్కడ పంట నిల్వ చేసుకోవడానికి అవకాశం లేదు. దీనితో సాగు విషయంలో రైతులు వెనుకడుగు వేస్తున్నారు. కేంద్రం రెండు రాష్ర్టాల్లో శీతల గిడ్డంగుల ను ఏర్పాటు చేయాల్సి ఉన్నది. టమాట రైతులు పండిన పంటను నిల్వ చేసుకునే అవకాశం ఉన్నప్పుడే వారు సాగు చేయడానికి ఆసక్తి చూపుతారు. టమాట ల్లో న్యూట్రిషన్ ప్యాక్స్ అధికంగా ఉండటం వల్ల మధుమేహం, గుండెపోటు రాకుండా అడ్డుపడుతుంది. దానివల్లే అభివృద్ధి చెందిన దేశాలు యూరప్, అమెరికాల్లో ప్రజలకు వస్తున్న క్యాన్సర్లతో పోలిస్తే భారత దేశ ప్రజలకు వచ్చేది కేవలం మూడో వంతు మాత్రమే.
ఆయా దేశాల్లో ప్రతి వెయ్యి మందిలో ముగ్గురు క్యాన్సర్ బారిన పడితే మనదేశంలో మాత్రం ఒక్కరికే వ్యాధి సంక్రమిస్తున్నది. దానికి ప్రధా న కారణం మన వంటల్లో టమాట విరివిగా వాడటమేనని పరిశోధకులు చెప్తున్నారు.టమాట వినియోగం వల్లే మనదేశ ప్రజలపై క్యాన్సర్ ప్రభా వం లేదని అనేక ఆరోగ్య సర్వేల్లో వెల్లడైం ది. అందుకే కేంద్రం బలమిస్తే ప్రజ ల ఆయుష్షును పెంచే టమాటకు రైతు ఆయుష్షు పోస్తాడు.
– డాక్టర్ బైరి నిరంజన్ 93901 15644