నిశి రాత్రి.. తువర తువర సినుకులు కురుస్తున్నయి. తుంపర్ల జల్లులో మాదో గమ్యం తెలియని యాత్ర. పొద్దుగూకి గోరటిని కలిస్తే.. ఇక ఆ రాత్రంతా అంతు లేని జ్ఞాన సంచారమే! వీరభద్ర కవి పల్నాటి భాగవతంలోని వీరత్వం, గీర్వాణ మహాకవి జీవన్ముక్త మహారాజు జ్ఞాన ప్రబోధలు, చింతామణి యక్షగాన పద్యాలతో ఆ రాత్రి తెల్లారిపోవాల్సిందే. శ్రీనాథుని చాటు సాహిత్యం.. ఎరుకలి నాగన్న వేట చాతుర్యం.. తరిగొండ వెంగమాంబ కీర్తనల తత్వం.. తంగిరాల వారి గంటల పంచాంగం వరకు ప్రతిదీ మా సంగోష్టి వస్తువే.
నేను, మారుతీసాగర్, గోరటితో కలిసి నల్లమల అడవులకు పోదామనుకున్నం. అక్కడి చెంచుల జీవనం, సాహసమే ప్రధాన ఇతివృత్తంతో నేనో సామాజిక చారిత్రక నవల రాస్తున్న. అందుకోసం నల్లమలకు వెళ్లటం తరుచు కృత్యం. గురువారం సాయంత్రం 5 గంటలకు బయల్దేరినం. మబ్బులు కమ్మే యాళ్లకు వెల్దండ గేటు దాటి దగ్గర దగ్గర కల్వకుర్తికి అందవచ్చినం. ఇంతలో హజారి రమేష్ ఫోన్ చేసి వాళ్ల ఊరికి పిలిచిండు. ‘కారు తిప్పు.. ఛలో తుంగతుర్తి’ అన్నడు గోరటి. మధ్యలో మరో జర్నలిస్టు మిత్రుడు అర్రోజు రమణ కలే వచ్చిండు.
కుందేళ్లు మేతకు మల్లే యాళ్లకు తుంగతుర్తి దాటినం. ఓ పిల్లబాట లాంటి రోడ్డుకు మళ్లి.. కంపదారు చెట్ల మధ్య నుంచి కారు మెల్లగా పల్లె దిక్కు కదులుతున్నది. ఊరంచుకు చెరువు. చెరువు కిందనే హజారి ఊరు. జీవకృత్యాల కోసం చెరువు కట్ట మీద దిగినం. ఊరు దిక్కు చూస్తే పల్లె ప్రశాంతంగా నిద్రపోతున్నది. ఆ సుషుప్తిలోంచి వాన నీళ్లతో ఇమిడిన మధు స్వరమేదో గాలిలో తేలియాడుతూ.. లీలగా మదిని స్పర్శిస్తోంది. శబ్ద తంత్రమేదో మంత్రమేసినట్టే మనిషిని ఆవహిస్తోంది. ఇక గోరటిని ఆపటం మా వశం కాలేదు. చీకటిని పునుకుకుంటా ఒక్కొక్క అడుగు వేస్తూ తూర్పు దిక్కుకు నడిచినం. అదో చిన్నపల్లె.. పేరు తూర్పుగూడెం. అంతా మట్టి మనుషులు. పొద్దంతా కాయకష్టం చేసుకొని పొద్దు కుంగిన వేళ గుంపు కట్టిన జనులు. దగ్గరకు పోతే సారా జోరు, సుట్ట కమురు గుప్పుమంటోంది. అబ్బయ్య గౌడు హార్మోనియం ఆడిస్తున్నడు. మూడు తరాల కింది పెట్టె అట. గౌడు ఒంటి మీది అంగికి ఎన్ని సిల్లులు పడ్డయో! హార్మోని పెట్టె తోలు రెల్లుకు అన్ని మాస్కెలున్నయి. బలమంతా కూరి వాయిస్తున్నడు కానీ, అది భారంగా పలుకుతున్నది. గొల్ల కొంరెల్లి గరుడాచల కథ అందుకున్నడు. గాత్రానికి తగ్గట్టు మద్దెల దరువు పడుతున్నది. అది గ్రామీణ కళాత్మక భావోద్వేగ ప్రదర్శన.
గోరటి వెంకన్న వాళ్లలో కలిసిపోయిండు. జానపదులతో లీనమయ్యిండు. నడిజామయ్యింది. అరె..! కట్ట కొమ్ము దాక వచ్చిన మనుషులు ఇప్పటి దాకా ఇంటికి రాకపోయిరని హజారి రమేష్ వెతుక్కుంటూ వచ్చిండు. అడ్డా ఆయనింటికి మారింది. మళ్లీ జానపద బాగోతం జోరందుకుంది. గోరటి రాగం ఎత్తిండు. బాగోతుల స్వరం మధుర శ్రావ్యమై తనువుకు తాకి ఒళ్లు ఊగింది. పల్లె జనులతో అంతా జత కలిసినం. పంటి కింద కొర్రమేను కూర జివ్వను, కల్మషం ఎరుగని పల్లె గాత్రం మనసును హాయిగా తడుముతుంటే..! సంతస తవనాలు తుంపర్ల వానతో సమ్మిళితమై ఆ రాత్రి గానామృతం కురిసినట్టుగా అనిపించింది.
అక్కడి నుంచి గద్దర్ అవార్డుల మీదికి చర్చ మళ్లింది. నంది అవార్డుల స్థానంలో గద్దర్ అవార్డులు ఇస్తామంటే.. సినిమావాళ్లు సప్పుడుజేస్తలేరని. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెగ బాధపడ్డ తీరు ప్రస్తావనకొచ్చింది. ప్రజా కళాకారుని అవార్డు తీసుకొమ్మని ఇంతలా ప్రాధేయపడాలా? అనురాగం, అవహేళన.. కోపం.. తాపం.. ధిక్కార సామాజిక కథలను అలవోకగా కైగట్టిన దళిత మహాబోధి గద్దర్. కళకు రంగులు పూసి, సాంకేతికతను నటనకు జోడించి మార్కెట్లో విక్రయించే సాంస్కృతిక వ్యాపారులు సినిమావాళ్లు. ఇద్దరి మధ్య ఇంత పెద్ద అంతరం ఉంది. పొంతనెట్లా కుదురుద్ది. దుబాయ్ సెంటు బుడ్లు షోకేజుల్లో పెట్టుకొని మురిసిపోయే నటులకు.. చెమటలో పుట్టిన గద్దర్ అవార్డులు అందుకునే యోగ్యత, ఉనికి ఉందా? అనేది జవాబు తేలాల్సిన ప్రశ్న.
ఎన్.శంకర్, ఊడుగుల వేణు, ప్రకాష్‌రాజ్, పోసాని కృష్ణమురళి వంటి వాళ్లను మినహాయిస్తే.. మిగతా వాళ్లంతా సాంస్కృతిక వ్యాపారులే. పౌర సమాజానికి కాని, తెలంగాణ సృజన సమాజానికి కాని సేవలు చేసిన వాళ్లు కాదు. పోనీ, ఈ నేల పట్ల, ఇక్కడి గాలి పట్ల ప్రేమ ఉందా? మద్రాసు రాష్ట్రం నుంచి ఆంధ్ర రాష్ట్రం విడిపోయినప్పుడు సినిమావాళ్లు చెన్నైలో ఉండిపోయారు. అప్పుడు చెన్నై వాళ్ల అవసరం. ఆంధ్ర నుంచి తెలంగాణ విడిపోయాక హైదరాబాద్‌లో ఉంటున్నారు. ఇప్పుడు హైదరాబాద్ వాళ్ల అవసరం. కానీ, ఈ ప్రాంతం మీద ప్రేమ ఉండి కాదు.
తెలుగు సినీ రంగం అంటే ఆంధ్రా పెత్తనం, అగ్ర కులాల గుత్తాధిపత్యమూ అనే సంగతిని మరువకూడదు. అయినా అదే అమ్మ జాతనో, కమ్మగున్నదనో తెలంగాణ పాలకులు మోకరిల్లితే చివరికి మిగిలేది అవమానమే.
నంది అవార్డుల మార్పు ప్రతిపాదన ఇప్పటిదేమీ కాదు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ తొలిసారి ప్రకటన చేసిండు. నంది అవార్డులను మార్చి వాటి స్థానంలో యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి పేరు మీద సింహా అవార్డులు ఇద్దామని ప్రతిపాదన చేసిండు. కానీ, సినిమావాళ్లు బెట్టు చేశారు. తొలుత మార్పునకు ముందుకురాలేదు. తర్వాత వాళ్లు భయానికో, భక్తికో ముందుకొచ్చినా..! కేసీఆర్ పట్టించుకోలేదు. దానికి బదులుగా మట్టి మనుషుల సృజనపై దృష్టి పెట్టిండు. గ్రామీణ వృత్తి కళాకారులను ప్రోత్సహించే పని పెట్టుకున్నడు. రాష్ట్రవ్యాప్తంగా 2,661 మంది గ్రామీణ సృజనకారులను గుర్తించి నెల నెలా రూ.3,116 పింఛను ఇచ్చిండు. తెలంగాణ సాంస్కృతిక సారథిని బలోపేతం చేసి ఏటా రూ.16.17 కోట్ల బడ్జెట్ కేటాయించారు. 550 మంది కళాకారులకు ఉద్యోగాలిచ్చి పోషించారు. సాంస్కృతిక మండలి నుంచే అనేక కార్యక్రమాలు నిర్వహించి గ్రామీణ, ఔత్సాహిక కళాకారులను కేసీఆర్ ప్రోత్సహించిండు. తెలుగు సినిమాకు తెలంగాణ యాసను రాజభాషగా మార్చిండు. ప్రపంచ తెలుగు మహాసభలను ఘనంగా నిర్వహించి తెలంగాణ నేల సికలో ఎనలేని కీర్తి కిరీటం పొదిగారు.
బతిలాడి గద్దర్ అవార్డులు ఇవ్వాల్సినంత ఖర్మ తెలంగాణ ప్రభుత్వానికి ఏమొచ్చింది. వృత్తి కళాకారులు, జానపద కథకులు తెలంగాణ పల్లెల నిండా ఉన్నరు. తమ గానామృత స్వరాలు, స్వచ్ఛమైన నటనా కౌశలాలతో జన హృదయ కేదారాలలో సృజనాత్మక సాగుబడి చేస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం వీళ్లను వెతికి పట్టాలి. వీళ్ల ప్రతిభకు తులాభారం వేయాలి. గద్దర్ అవార్డులు అందుకునే స్థాయి, అర్హత నూటికి నూరుపాళ్లు వీళ్లకే ఉంది. అత్యున్నతమైన అవార్డులు అట్టడుగు స్థాయి అత్యుత్తమ సృజనకారులకు అందినప్పుడే గద్దర్ ఆత్మ సంతోషిస్తుంది.
– వర్ధెల్లి వెంకటేశ్వర్లు