బిరుదురాజు రామరాజు హైస్కూల్ విద్యార్థిగా ఉన్న నాటినుంచి, ‘భారతి’ మొదలైన పత్రికలలో మానవల్లి, వేటూరి, నిడదవోలు, మల్లంపల్లి, వంటి పరిశోధకుల వ్యాసాలు, వారు సంపాదించిన గ్రంథాలు పీఠికలు చదివారు. వారిలాగే సాహిత్యలోకానికి తెలియని కొత్త విషయాలు తాను కూడా చెప్పాలనే నిశ్చయంతో పరిశోధన రంగంలో అడుగుపెట్టారు. జానపద విజ్ఞానంలో వర్సిటీల పరిశోధనల్లో దక్షిణ దేశభాషలన్నింటిలోనూ, బిరుదురాజు రామరాజు తెలుగు జానపద గేయ సాహిత్యం మొదటి సిద్ధాంత గ్రంథమైంది.
జానపద గేయరంగంలో అనేక జానపద గేయాలు, సంకలనాలు బిరుదరాజు ప్రకటించారు. తెలుగు లో, ఇంగ్లీషులో, జాతీయ, అంతర్జాతీయ సదస్సుల్లో పరిశోధనాత్మక పత్రాలు, రామరాజు చదివారు. అంతేకాదు, తెలంగాణ అంతా తిరిగి వందల కొద్ది తెలుగు, సంస్కృతం తాళపత్ర గ్రంథాలు, పదుల కొద్దీ, శిలాశాసనాలను సేకరించారు. అచ్చు కాకుండా పడి ఉన్న తెలుగు, సంస్కృత కావ్యాలను దాదాపుగా నూరింటిని సాహిత్య ప్రపంచానికి తెలియజేశారు. మరుగునపడిన మాణిక్యాలు, చరిత్రకు ఎక్కని చరితార్థులు అనే పేరుతో అనేక వ్యాసాలు పత్రికల్లో బిరుదురాజు రాశారు.
పరిష్కరించిన గ్రంధాలు : సంస్కృతంలో కాళహస్తి కవి రచించిన ‘వసు చరిత్రం’, మధురవాణి రచించిన రామాయణ సార తిలకం, వెల్లాల ఉమామహేశ్వర్లు ‘శృంగార శేఖర భాణం’, శ్రీకృష్ణదేవరాయల జాంబవతి పరిణయ నాటకం, మొదటిసారిగా పరిష్కరించిన బిరుదురాజు అనంత రామయ్య, సీతా విజయ చంపు వంటి సంస్కృత కృతులను కూడా పరిష్కరించారు.
తెలుగు గ్రంథాల పరిష్కరణ: తెలుగు లో బొడ్డుచర్ల చిన తిమ్మ కవి ‘ప్రసన్న రాఘవ నాట్య ప్రబంధం’ చింతలపల్లి ఛాయాపతి ‘రాఘవాభ్యుదయం’, వెంకటాద్రి నాయకుని ‘సకల జీవ సంజీవనం’, పాల్కుర్కి సోమనాథుని ‘ పండితారాధ్యోదాహరణం’ అనే కావ్యాలను మొదటగా సేకరించి ప్రకటించారు. బిరుదురాజు రామరాజు ఉర్దూ, తెలుగు నిఘంటువును కూర్చారు. ఇంగ్లీష్, హిందీల నుంచి నాలుగు గ్రంథాలు అనువదించారు. బిరుదురాజు పర్యవేక్షణలో 38 మంది ఎంఫి ల్, పీహెచ్డీలు సంపాదించారు.
తెలుగు జానపద విజ్ఞానరంగంలో విశేషమైన కృషిచేసిన వ్యక్తి ఆచార్య బిరుదురాజు రామరాజు. పరిశోధకుడిగా, పండితుడిగా, ఆచార్యుడిగా, జాతీయ వక్తగా ప్రసిద్ధి పొందిన ఈయన వరంగల్ జిల్లా దేవనూరు గ్రామంలో 1925, ఏప్రిల్ 16 న జన్మించారు. దేవనూరు, మడికొండ, హన్మకొండలో ప్రాథమిక విద్య మాధ్యమి క విద్యతో పాటు ఇంటర్మీడియట్ పూర్తిచేశారు. తర్వాత హైదరాబాద్ నిజాం కళాశాలలో ఇంగ్లీష్ మీడియంలో బీఏ పూర్తి చేశా రు. ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి ఎం.ఏ.తెలుగు, ఖండవల్లి లక్ష్మీ రంజనం పర్యవేక్షణలో పీహెచ్డీ పూర్తిచేశారు. 1967-1974 వరకు వరంగల్ స్నాతకోత్తర కేంద్రంలో పనిచేసిన బిరుదరాజు రామరాజు 1983లో పదవీ విరమణ పొందారు. ఈయన చేసిన సాంస్కృతిక సేవకు గాను జాతీయాచార్య పదవి లభించింది. 2010, ఫిబ్రవరి 8న హైదరాబాద్లో మరణించారు.