తెలంగాణ సాయుధ పోరాట యోధుడు, ఆర్యసమాజ్ సారథి, కార్మిక సంఘాల నేత, కమ్యూనిస్టు, జర్నలిస్ట్, హాకీ టీమ్ కెప్టెన్, ఎమ్మెల్యే, ఎంపీ, ప్రజా జీవితమే పరమార్థంగా ఆజన్మ బ్రహ్మచారిగా ఉన్న ఆదర్శ నాయకుడు.. ఇన్ని లక్షణాలు కలబోసిన వ్యక్తి బొమ్మగాని భిక్షం. ఒక చేత్తో దానం తీసుకుంటూ మరో చేత్తో ధర్మం చేస్తున్న భిక్షం పేరు ధర్మభిక్షం అని హైదరాబాద్ కొత్వాల్ రాజ్ బహద్దూర్ వెంకటరామారెడ్డి ప్రశంసించారు. నాటి నుంచి ఆయన ధర్మభిక్షంగా ప్రాముఖ్యత సంతరించుకున్నారు.
నల్లగొండ జిల్లా మునుగోడు మండలం వూకొండి గ్రామంలో బొమ్మగాని ముత్తి లింగయ్య గౌడ్ పద్మ దంపతులకు 1922 ఫిబ్రవరి 15న ధర్మభిక్షం జన్మించారు. ధర్మభిక్షం విద్యార్థి దశలోనే జాతీయ భావాలు అలవరుచుకున్నారు. నిజాం పట్టాభిషేక రజతోత్సవాలకు పాఠశాలలో ఉత్సవాలు జరపాలన్న ప్రధానోపాధ్యాయుడి ఆదేశాలను తోటి విద్యార్థులతో కలిసి బహిష్కరించారు. సామాజిక రుగ్మతలపై పోరాటానికి తన సహ విద్యార్థులకు శిక్షణనిచ్చేందుకు విరాళాలు సేకరించి ఒక వసతిగృహం ఏర్పాటు చేశారు. ఆంధ్రమహాసభతో మమేకమయ్యారు. 1942లో సీపీఐలో చేరారు. గోల్కొండ పత్రిక, ఆంధ్రపత్రిక, విజ్ఞాన్, ఉర్దూ పత్రికలకు విలేకరిగా పనిచేశారు.
నిజాంపై సాయుధపోరాటం మొదలు కావడంతో తుపాకి చేతబట్టి కదనరంగంలో అడుగు పెట్టారు. అరెస్టయి ఔరంగాబాద్, జల్నా జైళ్లలో ఐదేండ్లకుపైగా జైలుశిక్ష అనుభవించారు. జల్నా జైలులో పదివేల మంది ఖైదీలతో సమ్మె చేయించిన ఘనత ఆయనదే. గీత పనివారల సంఘం ఆధ్వర్యంలో గౌడ కులస్తుల హక్కుల కోసం ఆయన పోరాడారు. పలు కార్మిక సంఘాలను స్థాపించడంలో కీలక పాత్ర పోషించడంతో ‘కార్మిక పక్షపాతి’గా గుర్తింపు పొందారు. దున్నేవాడిదే భూమి అన్నట్టుగా గీసేవాడిదే చెట్టు అన్న నినాదం చెప్పి వారి హక్కుల కోసం శ్రమించారు.
1952లో సూర్యాపేట నియోజకవర్గం నుంచి హైదరాబాద్ అసెంబ్లీకి అత్యధిక మెజారిటీతో తొలిసారి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. తరువాత నకిరేకల్, నల్లగొండ నుంచి ఎమ్మెల్యేగా పనిచేశారు. నల్లగొండ లోకసభ నియోజకవర్గం నుంచి 1991లో ఎంపీగా గెలిచి పార్లమెంట్లో అడుగుపెట్టారు. 1996లో లోక్సభ ఎన్నికలకు నల్లగొండ నుంచి 480 మంది ఫ్లోరైడ్ బాధితులు పోటీ చేసినప్పటికీ ఆయన 76 వేల ఓట్ల మెజారిటీతో విజయం సాధించడం విశేషం. అత్యున్నతమైన చట్టసభలకు ఎంపికై కూడా సాధారణ జీవితం గడిపిన ధర్మభిక్షం 2011 మార్చి 26న మరణించారు.