విద్యార్థి, నిరుద్యోగుల పోరాట పునాదుల మీద అధికారం ‘హస్త’గతం చేసుకున్న కాంగ్రెస్ పాలకులను నిలదీయాల్సిన సమయం ఆసన్నమైంది. అసెంబ్లీ ఎన్నికలకు ముందు ‘హైదరాబాద్ యూత్ డిక్లరేషన్’లో ప్రకటించిన హామీలు పూర్తిగా అటకెక్కాయి. 18 నెలలు గడుస్తున్నా… 2 లక్షల ఉద్యోగాల భర్తీ హామీ నెరవేర్చలేదు. నామమాత్రపు ఉద్యోగాలు భర్తీచేసి కొండంత ప్రచారం చేసుకుంటుండటం సిగ్గుచేటు.
ఒకసారి గతంలోకి వెళ్దాం.. 2023, మే 8న సరూర్‌నగర్ సభలో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి, ప్రస్తుత వయనాడ్ ఎంపీ ప్రియాంకాగాంధీ స్వయంగా ‘హైదరాబాద్ యూత్ డిక్లరేషన్’ను ప్రకటించారు. కాంగ్రెస్ అధికారం చేపట్టిన ఏడాదిలోనే 2 లక్షల ఉద్యోగాల భర్తీ, జూన్ 2 నాటికి అధికారికంగా జాబ్ క్యాలెండర్ ప్రకటన, నిరుద్యోగులకు నెలకు రూ.4 వేల భృతి, రూ.5 లక్షల విద్యాభరోసా కార్డు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ బ్యాక్లాగ్ పోస్టుల భర్తీ, తొలి, మలి ఉద్యమ అమరుల కుటుంబాలకు నెలకు రూ.25 వేల పెన్షన్, ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం, 18 ఏండ్లు పైబడి చదువుకుంటున్న యువతులకు ఉచితంగా ఎలక్ట్రిక్ స్కూటర్ల పంపిణీ వంటి హామీలు గుప్పించారు. ఇక 2023, నవంబర్ 25న అసెంబ్లీ ఎన్నికల వేళ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ అశోక్‌నగర్‌లోని సిటీ సెంట్రల్ లైబ్రరీని సందర్శించి నిరుద్యోగులతో భేటీ అయ్యారు. గాజు గ్లాసులో గరం ఛాయ్ తాగుతూ నిరుద్యోగ సమస్యలపై చర్చించారు. తాము అధికారంలోకి రాగానే 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని హామీ ఇచ్చారు. ఈ హామీలను సంపూర్ణంగా విశ్వసించిన నిరుద్యోగులు ప్రభుత్వ మార్పులో కీలక భూమిక పోషించిన విషయం మనందరికీ తెలిసిందే. తీరా అధికారం చేపట్టాక.. ‘ప్రజా పాలన’ అంటూ నిత్యం ఊదరగొడుతున్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వ్యవహారశైలిలో క్రమంగా ‘మార్పు’ కనిపిస్తున్నది. పదుల సంఖ్యలో హస్తినకు (ఢిల్లీ) ప్రయాణిస్తున్న ఆయన.. పస్తులుంటూ పుస్తకాలతో కుస్తీ పట్టే విద్యార్థి, నిరుద్యోగులను కలిసేందుకు నిరాకరిస్తుండటం కడు శోచనీయం.
ఇదిలా ఉంటే… నాడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు స్వయంగా ప్రస్తుత ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క గ్రూప్-1లో 1:50 కాకుండా 1:100 నిష్పత్తిలో పిలవాలని అసెంబ్లీ సాక్షిగా డిమాండ్ చేశారు. అధికారం చేపట్టిన తర్వాత కాంగ్రెస్ ఆ హామీని తుంగలో తొక్కి, అమలుకు న్యాయపరమైన చిక్కులు ఉంటాయంటూ నిరుద్యోగులకు పంగనామం పెట్టింది.
గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన 5,089 పోస్టులకు మరో 5,973 పోస్టులు కలిసి మొత్తం 11,062కు డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసి రేవంత్ సర్కార్ చేతులు దులుపుకొన్నది. పొరుగు రాష్ట్రం ఏపీ సీఎం చంద్రబాబు ‘మెగా డీఎస్సీ’ ఫైల్‌పై తొలి సంతకం చేసి ఇచ్చిన మాటను నిలుపుకొన్నారు. ఆయనతో పోటీ పడుతానంటూ స్వీయ గొప్పలు చెప్పుకొన్న రేవంత్ తెలంగాణలో మాత్రం 25 వేల పోస్టుల ‘మెగా డీఎస్సీ’ హామీ విస్మరించి దగా చేశారు. జీవో-46 బాధితులకు అండగా నిలవలేదు. గ్రూప్-1కు సంబంధించిన జీవో-29 రద్దు చేయకుండా వంచించారు. ఇక, గ్రూప్-4, గురుకుల టీచర్లతో పాటు పోలీసు శాఖ, ఆరోగ్య శాఖలో ఉద్యోగ నోటిఫికేషన్లు, పరీక్షల నిర్వహణ తొలి సీఎం కేసీఆర్ హయాంలోనే జరిగాయి. కాంగ్రెస్ కేవలం నియామక పత్రాలు మాత్రమే అందించింది. ఇక గ్రూప్-2, గ్రూప్-3, ఉద్యోగ పరీక్షల నిర్వహణకు గత ప్రభుత్వమే నోటిఫికేషన్ జారీ చేసిన విషయం తెలిసిందే. పోస్టుల పెంపు డిమాండ్‌ను కాంగ్రెస్ పరిగణనలోకి తీసుకోలేదు. ఎంపికైన అభ్యర్థులకు పోస్టింగ్ ఆర్డర్లు అందించి మమ అనిపించింది. అయితే, ఏడాదిలోనే తమ కాంగ్రెస్ ప్రభుత్వం 55,143 ఉద్యోగాలు భర్తీ చేసిందంటూ ‘రాజకీయ నిరుద్యోగులు’ చెప్పుకొంటుండటం హాస్యాస్పదం. ఆర్ట్స్ కాలేజీ (ఓయూ) వేదికగా నిర్వహించిన ‘కృతజ్ఞత సభ’కు నిరుద్యోగుల స్పందన కరువైందంటేనే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు.
ఇదిలా ఉంటే, ప్రభుత్వం… వర్సిటీల్లో ఖాళీలను భర్తీ చేయలేదు. బడ్జెట్లోనూ అరకొర నిధులు కేటాయించి చేతులు దులుపుకున్నది. ఫీజు రీ యింబర్స్‌మెంట్ బకాయిల విడుదల విషయంలోనూ అదే అలసత్వం వహించింది. ఒకవైపు చదువుతూ… మరోవైపు అనేక సామాజిక సమస్యలపై స్పందించే ఉస్మానియా వర్సిటీ విద్యార్థి, నిరుద్యోగుల ఆత్మగౌరవం దెబ్బతీసేలా గతంలో పీసీసీ అధ్యక్షుడి హోదాలో ప్రస్తుత సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడిన మాటలు చరిత్ర మరచిపోదు. నిరుద్యోగులకు ఇంతలా అన్యాయం జరుగుతున్న నేపథ్యంలో గత దశాబ్దం పాటు స్పందించిన మేధావి వర్గం, ప్రశ్నించే గొంతుకలు ఇప్పుడు మౌనం వహించడం అత్యంత బాధాకరం. ‘పదవులు రాగానే పెదవులు మూసుకున్నార’నే విమర్శను వారు నిజం చేయవద్దు. ‘నిరుద్యోగం ఉగ్రవాదానికి దారి తీస్తుంది. దాన్ని నివారించడం ప్రభుత్వ బాధ్యత’ అని మాజీ రాష్ట్రపతి దివంగత వి.వి.గిరి చెప్పిన మాటను కాంగ్రెస్ పాలకులు పరిగణనలోకి తీసుకోవాలి. తక్షణమే విద్యాశాఖకు ప్రత్యేకంగా మంత్రిని నియమించాలి. ‘హైదరాబాద్ యూత్ డిక్లరేషన్’ హామీలను అమలుపరిచి నిరుద్యోగ యువతకు ఆత్మస్థయిర్యం కల్పించాలి. లేదంటే, చైతన్యవంతమైన తెలంగాణ మరో ఉద్యమానికి ఊపిరి పోస్తుంది. ఫలితంగా ప్రభుత్వ ‘మార్పు’ అనివార్యమౌతుంది.