ఒక సామూహిక స్వప్నం కోసం నెత్తురు ధారపోసిన నేల ఇది. ఇక్కడ వీచే గాలికి ఎప్పుడూ త్యాగాల పరిమళం అంటుకొని ఉంటుంది. ఇది తెలంగాణం, చరిత్ర పుటలపై ఎగిసిపడిన, ఆరు దశాబ్దాల ఆత్మగౌరవ రణం. తెలంగాణ, ఆంధ్రను కలుపుతూ ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన నాడే తెలంగాణ భవిష్యత్తుకు నిప్పంటుకుంది. ఒప్పందాలు డొల్లమాటలైనయి, రక్షణలు కల్ల రాతలైనయి. నియ్యత్ దప్పి నిధులను తరలించింది సమైక్య సర్కారు. వలస తామర తంపరగా తరలివచ్చి ఉద్యోగాలను కబళించింది. ఆంధ్రోద్యమంలో ఆవహింప జేసుకున్న ఆభిజాత్యం తెలంగాణ వేష భాషలను వెక్కిరించింది.
దగా పడ్డ వేదనలోంచి ఊపిరి పోసుకున్నది ‘జై తెలంగాణ’ నినాదం. 1969 ఉద్యమం తెలంగాణ చరిత్రలో ఒక రక్తసిక్త అధ్యాయం. ఆనాడు తెలంగాణ ఒక ప్రత్యక్ష రణస్థలి. అది ఉమ్మడి భావన ఏ కోశానా లేని ఉన్మత్త సర్కారు. అది భాషను పాచికగా విసిరి ని ధులూ, నీళ్లూ నియామకాలను కొల్లగొట్టిన కుహనా సమై క్య సర్కారు. అది నిరాయుధులైన ఉద్యమకారులపై నిప్పు ల వర్షం కురిపించిన నిర్దాక్షిణ్య నియంత సర్కారు తలను ఛిద్రం చేస్తూ బుల్లెట్టు దూసుకుపోయినా, గుండెను వ్రయ్యలు చేస్తూ గుండ్లు దిగబడుతున్నా తెలంగాణ బిడ్డలు ఎత్తిన పిడికిలి దించలేదు. ఆగిపోయిన శ్వాసలు అగ్నిబీజాలై నేల గర్భంలో నిక్షిప్తమైనయి, చరిత్ర చెమ్మగిలిన కన్నులతో మరో విస్ఫోటనం కోసం ఎదురుచూసింది.
1996లో దేశంలో చిన్న రాష్ర్టాల భావన చివురించిం ది. తెలంగాణ మేధావి లోకంలో ఆశ మొగ్గతొడిగింది. గుసగుసలు గుంపులైనయి. పాటలు పల్లవించాయి. ఆచార్య కొత్తపల్లి జయశంకర్, ప్రజాకవి కాళోజీ భావజాల వ్యాప్తికి చుక్కానిగా నిలిచారు. మహాసభలు, జనసభలపై నిర్బంధపు నీలినీడలు విరుచుకుపడ్డాయి. లలిత సుందర తెలంగాణ గీతి ముక్కలు ముక్కలైపోతే మళ్లా నీరవ నిశ్శబ్దంలో నిర్విణ్ణురాలైంది తెలంగాణ. ప్రాణ త్యాగాలతో తొలిదశ ఉద్యమం ముగిసిపోతే, పదవీ త్యాగాలతో మలిదశ ఉద్యమం కట్టలు తెంచుకున్నది. అవిశ్వాస మేఘాలను చెల్లాచెదురు చేస్తూ 2001 ఏప్రిల్ 27న సూర్యుడు జాజ్వల్యమానంగా ఉదయించాడు.
వివక్షా విద్రోహాల నుంచి విముక్తిని వాగ్దానం చేస్తూ మార్మోగిన కేసీఆర్ ఉపన్యాస గర్జనలలో అమరుల శ్వాసలు అగ్నిపర్వతాలై విస్ఫోటించినయి. కేసీఆర్ సారథ్యంలో తెలంగాణ ఉద్యమం శ్రావణ మేఘమై ఉరిమింది. కేసీఆర్ ఆగమనంతో సమైక్యవాదం పునాదులు కదిలినయి. కొత్త వెల్లువలో లక్ష్యాన్ని ఛేదించగలమనే విస్పష్ట విశ్వాసంతో విరిసిన గులాబీ వనమైంది తెలంగాణ.
మలిదశ ఉద్యమం అహింసనే ఆయుధంగా ధరించింది. శాంతియుత పంథాలోనే కదం తొక్కింది. కేసీఆర్ రాజనీతిజ్ఞతతో తెలంగాణ రాష్ట్రం జాతీయ ఎజెండాలో భాగమైంది. ప్రధాని నోట పార్లమెంటులో మార్మోగింది. వంచనకు వేయి తలలు అన్నట్టు సమైక్యవాద పార్టీలు వేరువేరైనా అవి పుట్టిన కుదురు ఒక్కటే. అవి చేసిన కుట్రలూ ఒక్కటే.. ఎన్నికలకు ముందు ‘జై తెలంగాణ’, ఎన్నికలు కాంగనె ‘నై తెలంగాణ’ అనే కుతంత్రం కొనసాగించినయి సమైక్యవాద పార్టీలు. కుట్రలను బద్దలు కొట్టేందుకే కేసీఆర్ నిరాహార దీక్షకు పూనిండు. ‘గెలిస్తే తెలంగాణ జైత్రయాత్ర, ఓడితే నా అంతిమయాత్ర’ అని శపథం చేసిండు. అణచివేతకు దిగిన సమైక్య సర్కారు కేసీఆర్ను అరెస్టు చేసింది. తెలంగాణ ఊరూ వాడా ఉడికిపోయింది. రోడ్లు జనసముద్రాలైనయి. యూనివర్సిటీలు యుద్ధ మైదానాలైనయి.
మలిదశ ఉద్యమంలో తొలి అమరుడు కాసోజు శ్రీకాంతాచారి కేసీఆర్ అరెస్టును నిరసిస్తూ తనకు తానుగా అగ్నికి ఆహుతైండు. తెలంగాణ గర్భశోకం మిన్ను ముట్టింది. మా ప్రాణార్పణతోనైనా ఈ పాపకారి సమైక్య పార్టీలకు కనువి ప్పు కాకపోతుందా అని ఆశపడ్డారు తెలంగాణ బిడ్డలు. వద్దని వారిస్తున్నా సరే ఒక్కో సందర్భంలో ఒక్కో బిడ్డడు ఒరిగిపోయిండు. కన్నతల్లిదండ్రుల కడుపుకోతతో కన్నీటి సంద్రమైంది తెలంగాణ. కేసీఆర్ దీక్ష ఫలించి డిసెంబర్ 9న రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను ప్రారంభిస్తున్నట్టు ప్రకటన వచ్చింది. కానీ, మాయోపాయాలతో అడ్డుకున్నది నాటి దగాకోరు పాలకవర్గం. ప్రతి తెలంగాణ బిడ్డ పులిబిైడ్డె గాం డ్రించిండు. రోడ్డు రోకో, రైలు రోకో, మిలియన్ మార్చ్, జాతీయ రహదారుల దిగ్బంధం, వంటావార్పు, సాగరహారం, కవుల కళాకారుల ధూంధాం, సకల జనుల సమ్మె.
మలిదశ ఉద్యమం ఆవిష్కరించిన అపురూప ఘట్టాలెన్నెన్నో.. ధర్మాగ్రహంతో ఉద్యమం పొడుగునా త్యాగ పరిమళాలు వెదజల్లినారు తెలంగాణ అమరులు. ఓ అమరులారా! మీ త్యాగఫలమై 2014 జూన్ 2న ఉజ్వల కాంతులతో ఉదయించింది తెలంగాణ రాష్ట్రం. మీ కన్నుల కాం తులే స్వరాష్ట్ర ప్రగతిలో ప్రతిఫలిస్తున్నాయి. మీ దివ్య తేజ స్సే నిరంతర విద్యుత్ ప్రసారమై వెలుగులీనుతున్నది. ఎత్తిపోతలతో ఎగిసివస్తున్న గోదారమ్మ హోరులో, కృష్ణమ్మ జోరులో మీ చిరునవ్వుల సవ్వడే వినిపిస్తున్నది. మీ కలలే చెరువుల అలలై మత్తడి దుంకుతున్నయి. పచ్చని పంటచేలలో మీరు పసిపాపలై ఊయలలూగుతున్నారు.
వలస మాని వాపసొచ్చిన పాలమూరు బిడ్డల తలెల లో మీరు పాలబువ్వలై నవ్వుతున్నారు. సింగిడి రంగుల బతుకమ్మకు మీరు శిఖరమై పరిమళిస్తున్నారు. తెలంగాణ పదేండ్ల ప్రాయంలో అడుగుపెట్టిన పండుగనాడు మీరు మాకు పాలపిట్టలై దర్శనమిస్తున్నారు. ఆచంద్రతారార్కం వెలిగే అమరజ్యోతులై సదా మా హృదయాల్లో వెలుగుతున్నారు. జోహార్ తెలంగాణ అమరవీరులకు..
మలిదశ ఉద్యమం ఆవిష్కరించిన అపురూప ఘట్టాలెన్నెన్నో.. ధర్మాగ్రహంతో ఉద్యమం పొడుగునా త్యాగ పరిమళాలు వెదజల్లినారు తెలంగాణ అమరులు. ఓ అమరులారా! మీ త్యాగఫలమై 2014 జూన్ 2న ఉజ్వల కాంతులతో ఉదయించింది తెలంగాణ రాష్ట్రం.
దేశపతి శ్రీనివాస్: 95539 55330
(వ్యాసకర్త: శాసనమండలి సభ్యులు)