అసలు యే సరిహద్దులనైనా చెరిపేసుకోగలగటం సాధ్యమా.. అసలు అనేక విషయాలకు యే సరిహద్దులు లేని కాలమొక్కటుందా! కల్లూరి భాస్కరం గారి కొత్త పుస్తకం ‘ఇవీ మన మూలాలు’ మనకు యిలాంటి సందేహాలు… సంశయాలు… కుతూహలాలపై కొత్త వెలుగు ప్రసరిస్తుంది.
ముఖ్యంగా, మానవ వలసలు యెప్పుడు, యెక్కడ, యెలా మొదలయ్యాయి? యే అన్వేషణ, యే జీవితావసరం మానవులను నిరంతరం వలస బాటని పట్టించాయి? ఆధునిక వలసలకు జన్యుపరంగా జరిగే మార్పులకు, మూలాలకు నడుమ యే విధమైన సంబంధం వుంది? మెహర్గఢ్ లాంటి చోట వ్యవసాయం మొదలైన కాలం నుంచి హరప్పా నాగరికత విచ్ఛిన్నమైన తర్వాత యే నాగరికత ప్రస్ఫుటంగా ముందుకొచ్చింది? మొదలైన విషయాలను తెలుసుకోవాలన్న ఆసక్తిని కలిగించటంతో యీ పుస్తకం మనందరికీ సంబంధించినది, అందరం చదవాల్సింది. భారతీయులమైన మనందరి మూలాలూ పూర్తిగా మనం పుట్టిపెరిగిన ప్రాంతంలోనో, మన దేశంలోనో, మన ఖండంలోనో లేవంటారు యీ రచయిత. యెక్కడో పుట్టి, యింకెక్కడికో వలస కట్టి, యెన్నో సమూహాలతో సాంకర్యం చెంది యిప్పుడు ప్రపంచం అంతట్లోనూ వ్యాపించిన యేడు వందల కోట్లను మించిన మానవజనాభాతో మనది విడదీయలేని బంధమంటారు. యీ రోజున మనం దేశం, ప్రాంతం, మతం, కులం, భాష వంటి రకరకాల సరిహద్దుల్లోనూ, హద్దుల్లోనూ జీవిస్తున్నాం. కానీ యీ పుస్తకంలో రచయిత చూపారు యిలాంటి హద్దులేమీ యెరుగని ప్రపంచాన్ని! మనిషి మొత్తం భూగోళాన్నే తన హద్దుగా చేసుకున్న కాలాన్ని!
యీ పుస్తకం మన కళ్లముందు అన్నివైపులా అనేక కొత్త కిటికీలు తెరిచి మనకు తెలియని, మనం వూహించి కూడా వుండని వో అద్భుత ప్రపంచాన్ని చూపిస్తుంది. మన జన్యుమూలాలే కాదు; మన భాషలు, మత విశ్వాసాలు, సంస్కృతులు, వాఙ్మయాల మూలాలు కూడా మన దేశాన్ని, ప్రాంతాన్ని దాటి యెక్కడెక్కడ వున్నాయో చూపించే యీ పుస్తకం మరింతగా మనల్ని మూలాల్లోకి పట్టుకుపోతుంది.
మన వేదాలు, యితిహాసాలు, పురాణాల్లో కనిపించే పాత్రల పేర్లు, వారు వ్యవహరించే శైలి, వారు పట్టుకునే ఆయుధాలు, వారు తిరిగిన రథాల వెనుక మన దేశ సరిహద్దులను దాటి విస్తరించిన చరిత్రను కళ్లకు కట్టిస్తుంది.
మొదటినుంచీ పురాచరిత్ర, చరిత్ర, మానవశాస్త్రం, భాషాశాస్త్రంపై ఆసక్తి, అధ్యయనం వున్న భాస్కరం గారు మహాభారతం తన ఆసక్తులన్నింటికీ కేంద్రబిందువవ్వటంతో వారు జెనెటిక్స్లోకి కూడా తొంగిచూశారు. యెందుకంటే యీ రంగాలలోని అధ్యయనాలు యేం చెప్తున్నాయో, జెనెటిక్స్‌లో జరుగుతున్న పరిశోధనలు దాదాపు అదే చెప్తున్నాయి. ముఖ్యంగా పాపులేషన్ జెనెటిక్స్ వేల సంవత్సరాలుగా మనుషుల మధ్య జరుగుతూవచ్చిన సాంకర్యాల గురించీ, వలసల గురించీ శాస్త్రీయ ఆధారాలతో చెబుతోందనీ, ఆ విధంగా అవి మన వేద, యితిహాస, పురాణ కథలను కొత్త కోణంలో చూపిస్తూ వాటికి సరికొత్త సాక్ష్యాలను యెలా సమకూరుస్తున్నాయో యీ పుస్తకంలో చూపించానన్నారు.
మనిషి మనుగడకు సంబంధించిన ప్రతి విషయాన్నీ జెనెటిక్స్ తన పరిధిలోకి తీసుకోవడమే కాకుండా, చివరికి మన జన్యువారసత్వం స్త్రీ-పురుషుల మధ్య అసమానతల చరిత్ర కూడా యెలా వెల్లడిస్తోందో యెంతో ఆసక్తికరంగా వివరించారు.
మన భారత వుపఖండాన్నే తీసుకుంటే, పురుషుడికి సంబంధించిన వై-క్రోమోజోమ్‌లో యెంతో వైవిధ్యం కనిపిస్తుందనీ; అదే స్త్రీకి చెందిన మైటోకాండ్రియల్ డీయెన్యేలో వైవిధ్యం కనిపించదనీ, ఆ విధంగా భారత వుపఖండం పురుషుడికి చాలావరకు అత్తిల్లు అయితే, స్త్రీకి పుట్టిల్లు అంటారు. జన్యుపరిశోధనల వెలుగులో మహాభారతాన్ని చదివినప్పుడు మరెన్నో ఆశ్చర్యకరమైన విశేషాలు మన దృష్టికి వస్తాయంటారు. అలాంటి యెన్నో విశేషాలను యీ పుస్తకంలో అందించారు కూడా.
లక్షలు, వేల యేండ్ల వెనుకటి మానవపరిణామ చరిత్రను మనముందు వుంచుతూనే, వర్తమాన రాజకీయ, సామాజిక సందర్భానికి వచ్చి ముగియడం యీ పుస్తకం ప్రత్యేకతలలో వొకటి. యెంతో వుత్కంఠను రేపుతున్న యీ పుస్తకం చదవడం చక్కటి అనుభవం. మన అజ్ఞాతమూలాలు తెలుసుకోవాలన్న ఆసక్తి వుంటే చాలు యీ పుస్తకంలోకి తొంగి చూడడానికి యింకెలాంటి అవగాహనా, అర్హతా వుండాలనిపించలేదు.
-కుప్పిలి పద్మ
98663 16174