కశ్మీర్‌లోని పహల్గాంలో ఇటీవల జరిగిన ఉగ్రదాడిని యావత్ ప్రపంచంలోని పౌరులందరూ ఖండించారు. ఆ దాడిలో మరణించిన అమాయక ప్రజలకు అశ్రు నివాళులర్పించారు. అలా చేయని వారిని మనం మనుషులుగా పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం లేదు. ఈ ఉగ్రదాడిని దేశ సార్వభౌమత్వం మీద జరిగిన దాడిగా మనం పరిగణించాల్సిన అవసరం ఉన్నది. ఈ దాడులకు ప్రత్యక్షంగా, లేదా పరోక్షంగా కారకులైన ప్రతీ వ్యక్తిని కఠినంగా శిక్షించాలి.
శవాలపై పేలాలు ఏరుకునే వ్యక్తులు ప్రతీ చోట ఉంటారు. అట్లాగే ఈ ఉగ్రదాడి నుంచి రాజకీయ లబ్ధి పొందాలనుకుంటున్న కొందరు దురాశావాదులు ఒక మతం, మరో మతంపై జరిపిన దాడిగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు. నిజానికి ఈ దురాశావాదులే ఉగ్రవాదుల పన్నాగంలో చిక్కినట్టుగా అర్థమవుతున్నది. ఆర్టికల్ 370 రద్దు తర్వాత, రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రుల గృహ నిర్బంధం నుంచి నెలల తరబడి ఇంటర్నెట్ సౌకర్యాన్ని నిలిపివేసేదాకా భారత ప్రభుత్వం తీసుకున్న చర్యల వల్ల కశ్మీర్ నిస్తేజంగా మారింది. ఈ క్రమంలో మొన్న జరిగిన ఎన్నికల తర్వాత కశ్మీర్ ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నది. కశ్మీరీల జీవనాధారమైన పర్యాటకరంగం ఇప్పుడిప్పుడే ఆశాజనకంగా మారుతున్నది. ఈ సమయంలో ఉగ్రవాదులు దాడులు చేయడం, ఆ దాడుల్లో పదుల సంఖ్యల్లో ప్రాణాలు పోవడం అత్యంత ఖండనీయం. దీంతో కశ్మీర్ మళ్లీ అగాధంలోకి వెళ్లిపోతుందనడంలో సందేహం లేదు.
దాడులు జరిపిన ఉగ్రవాదులు మతం అడిగి మరీ కాల్పులు జరిపారని కొందరు చెప్తున్నారు. దేశంలో మతపరమైన అలజడి సృష్టించి, భారతీయ సమాజాన్ని విచ్ఛిన్నం చేయాలన్నదే ఉగ్రవాదుల పన్నాగం. ఈ కుటిల పన్నాగాన్ని పసిగట్టని కొందరు మేధావులు దేశం మీద దాడి జరిగిందనే విషయాన్ని పలుచన చేస్తున్నారు. కేవలం హిందువులపై జరిగిన దాడులుగానే ప్రచారం చేస్తున్నారు. కానీ, తను తప్పించుకునే అవకాశం ఉన్నప్పటికీ హిందూ బంధువులను కాపాడాలనే ఉద్దేశంతో సయ్యద్ ఆదిల్ హుస్సేన్‌షా అనే ఒక ముస్లిం యువకుడు ఉగ్రవాదిని నిలువరించాడు. ఈ క్రమంలో తను ప్రాణాలను కోల్పోయాడు. కానీ, కొందరు మేధావులు సయ్యద్ దేశభక్తిని, త్యాగాన్ని గుర్తించకపోవడం శోచనీయం. ఈ ఉగ్ర దాడిలో గాయపడిన హిందూ పర్యాటకులను కశ్మీర్ ముస్లింలు తమ భుజాలపై మోసుకెళ్లి కాపాడారు. వారి మానవత్వమూ ఈ మేధావులకు కనిపించడం లేదు.
మన దేశంతో సంబంధం లేని ఉగ్రవాది, మతం అడిగి మరీ చంపాడని ఆక్రోశిస్తున్న మేధావులకు మన దేశ పౌరుడు, రైల్వే కానిస్టేబుల్ అయిన చేతన్ సింగ్ ముంబై రైలులో కలియతిరుగుతూ అమాయకులైన తోటి దేశ పౌరులు, ముస్లిం ప్రయాణికులను ఒక్కొక్కరిని కాల్చిచంపిన సంఘటన గుర్తుండే ఉంటుంది. మళ్లీ నేను గుర్తుచేయాల్సిన అవసరం లేదనుకుంటాను. ‘జై శ్రీరాం’ అనలేదని కొట్టిచంపిన ఉగ్రవాదులు, ‘కలిమా’ చదువలేదని కాల్చిచంపిన ఉగ్రవాదులు ఒకే రాక్షస సంతతికి చెందినవారుగా మనం గమనించాలి. మతోన్మాదం, మత ఉగ్రవాదంగా మారితే ఎంత ప్రమాదమో… తక్కువ కులానికి చెందిన వ్యక్తి గుర్రం ఎక్కినాడని, బుల్లెట్ బండి నడుపుతున్నాడని దాడులు చేస్తూ ప్రాణాలు తీసే కుల ఉగ్రవాదం కూడా దేశ సమగ్రతకు ప్రమాదకరం అన్న విషయాన్ని మనం గుర్తెరగాలి. మత, కుల ఉగ్రవాదులను నేలమట్టం చేసేందుకు కలిసికట్టుగా పనిచేయాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. అయితే 2019 ఫిబ్రవరి 14వ తేదీన వందల కిలోల ఆర్డీఎక్స్తో దేశంలోకి చొరబడి 40 మంది సీఆర్పీఎఫ్ జవాన్లను చంపినవారిని ఇంతవరకు శిక్షించలేదు. అందుకే ఉగ్రదాడులు జరుగుతున్నాయి. వీళ్లేం చేయలేరనే ధైర్యంతో ఉగ్రవాదులు విర్రవీగిపోతున్నారు.
ప్రధాని నరేంద్ర మోదీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఒక సభలో.. ‘కేంద్ర ప్రభుత్వ మిలిటరీ అధీనంలో ఉండే సరిహద్దులు దాటుకొని పేలుడు పదార్థాలు, ఆయుధాలు దేశంలోకి ఎట్లా వస్తున్నాయి? ఉగ్రవాదులు దేశంలోకి ఎట్లా చొరబడుతున్నారు? ఉగ్రవాదుల సంభాషణలు, ఇమెయిల్స్‌ను పసిగట్టడంలో టెలి కమ్యూనికేషన్ శాఖ ఎందుకు విఫలమవుతున్నది? ఇది కేంద్ర నిఘా సంస్థల వైఫల్యం కాదా? ప్రధానమంత్రి వైఫల్యం కాదా?’ అని ప్రశ్నించారు. ఆ వీడియో సామాజిక మాధ్యమాల్లో ఇప్పుడు వైరల్ అవుతుండటం గమనార్హం.
ప్రధాని నరేంద్ర మోదీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఒక సభలో.. ‘కేంద్ర ప్రభుత్వ మిలిటరీ అధీనంలో ఉండే సరిహద్దులు దాటుకొని పేలుడు పదార్థాలు, ఆయుధాలు దేశంలోకి ఎట్లా వస్తున్నాయి? ఉగ్రవాదులు దేశంలోకి ఎట్లా చొరబడుతున్నారు? ఉగ్రవాదుల సంభాషణలు, ఇమెయిల్స్‌ను పసిగట్టడంలో టెలి కమ్యూనికేషన్ శాఖ ఎందుకు విఫలమవుతున్నది? ఇది కేంద్ర నిఘా సంస్థల వైఫల్యం కాదా? ప్రధానమంత్రి వైఫల్యం కాదా?’ అని ప్రశ్నించారు. ఆ వీడియో సామాజిక మాధ్యమాల్లో ఇప్పుడు వైరల్ అవుతుండటం గమనార్హం. ఈ ప్రశ్నలన్నింటికి సమాధానాలు ఇప్పుడు ప్రధాని నరేంద్ర మోదీ చెప్పాలని దేశ ప్రజలు కోరుతున్నారు. పెద్ద నోట్లు రద్దుచేస్తే ఉగ్రవాదం నశించిపోతుందన్నారు, దొంగ నోట్లు ముద్రించలేక తీవ్రవాదులు అడుక్కుతింటారని భ్రమలు కల్పించారు. 370 ఆర్టికల్ రద్దు చేస్తే ఉగ్రవాదులు ఆకలితో అలమటించి ఆత్మహత్యలు చేసుకుంటారని, కశ్మీర్లో శాంతి నెలకొంటుందన్నారు. అంతేకాదు, ఇక మనం కూడా కశ్మీర్లో భూములు కొనుక్కోవచ్చని గోదీ మీడియా చేసిన ప్రచారాలను నమ్మినవారిలో నేనూ ఒకడిని.
అగ్నిపథ్ స్కీం పేరిట భద్రతాదళాల కుదింపు, పర్యాటకులకు భద్రత కల్పించడంలో కేంద్ర ప్రభుత్వ నిఘా వర్గాలు వైఫల్యం చెందడం వల్లనే ఈ ఉగ్రదాడి జరిగిందనేది జగమెరిగిన సత్యం. కానీ, ఈ విషయాన్ని పక్కదారి పట్టించేందుకు కొందరు మేధావులు, గోదీ మీడియా మతం రంగు పులుపుతున్నది. బీజేపీయేతర ప్రభుత్వాలేవీ దేశాన్ని కాపాడలేవని, హిందూ మతాన్ని రక్షించేది ఒక బీజేపీనే అని, హిందువులకు రక్షకుడు మోదీ మాత్రమేనని బీజేపీ వాట్సాప్ యూనివర్సిటీ ప్రచారం చేస్తున్నది. కానీ, బీజేపీ నేతృత్వంలో వాజపేయి ప్రధానిగా ఉన్నప్పుడే కాందహార్ హైజాక్ జరిగింది. కార్గిల్ చొరబాటు జరిగింది. అమర్నాథ్ యాత్రికులపై, అక్షరధాం మందిరంపై దాడులు జరిగాయి. వాజపేయి ప్రధానిగా ఉన్నప్పుడే పార్లమెంటు మీద దాడులు జరిగాయి. అంతెందుకు, మన మోదీ ప్రధాని అయ్యాకనే పఠాన్‌కోట్, యూరి సైసిక్టర్, పుల్వామా దాడులు జరిగాయి. కానీ, వీటిగురించి ఈ వాట్సాప్ యూనివర్సిటీ ఏ చర్చ చేయదు. బీజేపీయేతర ప్రభుత్వాల చేతకానితనం వల్లనే ఉగ్రదాడులు జరిగాయని చెప్తున్న వాట్సప్ యూనివర్సిటీ, గోదీ మీడియా… మరి ధర్మ రక్షకుడైన మోదీ పాలనలో ఉగ్రవాదులు ఎందుకు యథేచ్ఛగా దాడులు చేయగలుగుతున్నారో చెప్పకపోవడం కడు శోచనీయం.
మతోన్మాదం, మత ఉగ్రవాదంగా మారితే ఎంత ప్రమాదమో… తక్కువ కులానికి చెందిన వ్యక్తి గుర్రం ఎక్కినాడని, బుల్లెట్ బండి నడుపుతున్నాడని దాడులు చేస్తూ ప్రాణాలు తీసే కుల ఉగ్రవాదం కూడా దేశ సమగ్రతకు ప్రమాదకరం అన్న విషయాన్ని మనం గుర్తెరగాలి. మత, కుల ఉగ్రవాదులను నేలమట్టం చేసేందుకు కలిసికట్టుగా పనిచేయాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది.
దేశంలో ఒక నేరం జరిగినప్పుడు, ఆ నేరం వల్ల ఎవరు లబ్ధి పొందారనే విషయాన్ని శోధించి వారిని కూడా ఆ నేరంలో భాగం చేయాలి. చట్టం ప్రకారం ఆ ప్రక్రియ అనివార్యం. ఉగ్రదాడుల వల్ల కశ్మీరీలకు కాని, భారత ముస్లిం సమాజానికి కాని జరిగే లాభం ఏమీ లేదు. కశ్మీర్‌ను ఒక సజీవ సమస్యగా ఉంచితే పాకిస్థాన్ రాజకీయ నాయకులకు ఓట్లు పడుతాయి. రాజకీయ లబ్ధి చేకూరుతుంది. భారతీయ సమాజం మతం పేరిట విచ్ఛిన్నమైతే వారికి సంతోషం కలుగుతుంది. ఇలాంటి దుశ్చర్యల వల్ల, మతపరమైన విభజనల వల్ల ఎవరికి లాభం చేకూరుతుందో ఇకనైనా ప్రజలు గమనించాలి. ఉగ్రవాదుల దాడుల్లో 26 మంది అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోయారని యావత్ దేశం శోకసంద్రంలో మునిగితే, బీహార్ ఎన్నికలే ప్రధానం అనుకొని ప్రచారం చేసిన ప్రధాని మోదీని ఏమనాలో కూడా ప్రజలే నిర్ణయించాలి.
భారత జాతిపిత మహాత్మాగాంధీని చంపిన హంతకుడు నాథూరాం గాడ్సే మొదటి తీవ్రవాది. ఆయన బ్రాహ్మణుడు అయినంత మాత్రాన బ్రాహ్మణ సమాజం మొత్తాన్ని తీవ్రవాదులు అనలేం కదా? ఇందిరా గాంధీని సిక్కు తీవ్రవాదులు హత్యచేసినంత మాత్రాన సిక్కులందరినీ ఖలిస్థానీలు అనలేం కదా? రాజీవ్ గాంధీని తమిళ ఈలం తీవ్రవాదులు చంపినంత మాత్రాన తమిళులందరి మీద ఉగ్రవాద మద్ర వేయలేం కదా? మణిపూర్‌లో క్రైస్తవులను చంపిన తీవ్రవాదులు హిందువులైనంత మాత్రాన హిందువులందరు ఉగ్రవాదులనడం ఎంత తప్పో, దాయాది దేశ ఉగ్రవాదులు చేసిన దుశ్చర్యలను మొత్తం ముస్లిం సమాజానికి అంటకట్టడం కూడా అంతే తప్పు. అందుకే, విదేశీ ఉగ్రవాదులు చేస్తున్న దుశ్చర్యలకు మన భారతదేశ ముస్లింలను బాధ్యులను చేయడం నిజంగా సిగ్గుచేటు. భారత సమాజం మొత్తం కలిసికట్టుగా ఉండి ఐకమత్యాన్ని ప్రదర్శించాలి. అప్పుడే దాయాది దేశ కుట్రలను తిప్పికొట్టగలుగుతాం. అంతేకానీ, హిందూ-ముస్లింలు విడిపోతే ఉగ్రమూకల పన్నాగం ఫలించినట్టే, వారు విజయం సాధించినట్టే. ఈ నిజాన్ని మనమింకా తెలుసుకోపోతే మన దేశాన్ని ఏ అల్లా కాపాడలేడు, ఏ ఏసూ కాపాడలేడు, ఏ రాముడూ కాపాడలేడు.