తెలుగులోని ఏకవచన బహువచనాలకు, ఆంగ్లంలోని ఏకవచన బహువచనాలకు మధ్య చాలా భేదం ఉంటుంది. ఇవి భాషను బట్టి మారుతుంటాయి. ఆంగ్లంలో ఉండే నామవాచకాలు countable nouns, uncountable nouns అని రెండు రకాలుంటాయి. స్థూలంగా మొదటి రకం ఏకవచనానికి, రెండవ రకం సమష్టి వచనానికి సంబంధించిందని అనుకోవచ్చు.
ఇంగ్లిష్‌లోని darkness, rice, milk అనే మాటలకు తెలుగులో సమానమైన పదాలు చీకటి, బియ్యం, పాలు. ఆంగ్లంలో darknesses, rices, milks లేవు. కానీ చీకట్లు అనే మాటను మనం తెలుగులో వాడుతున్నాం. ఇక చీకటికి పర్యాయ పదం ఇరులు. చివరన లు ఉన్నా ఇది ఏకవచనమే! ఇదే అర్థాన్నిచ్చే ఇరి, ఇరు, ఇరువు అనే రూపాలు తెలుగులో లేవు. ఇరులు ఏకవచనమైనప్పుడు దానికి మరొక ‘లు’ ను చేర్చి బహువచనాన్ని రూపొందించలేం. చీకటికి వ్యతిరేక పదమైన కాంతిని light, lustre అంటాం ఇంగ్లిష్‌లో. తెలుగులో కాంతులు అని రాస్తున్నాం కానీ ఆంగ్లంలో lustres లేదు. అయితే దీపాలు అనే అర్థంలో lightsను ఉపయోగించే వీలుంది. Darkness, rice, milk, lustre, splendor, music, information, knowled -ge… మొదలైనవన్నీ uncountable nouns. వీటి చివర ‘s’ను చేర్చడం కుదరదు. చేర్చి ఉపయోగిస్తే అవి తప్పులవుతాయి.
Police, news: ఈ రెండింటి గురించి చాలా చర్చ చేయవచ్చు. తెలుగులో రక్షకభటుడు, రక్షకభటులు అని ఏకవచన బహువచనాలు విడివిడిగా ఉన్నాయి కానీ, ఇంగ్లిష్‌లో police ఎప్పుడూ బహువచనమే. దాని అర్థం రక్షకభటులు. మరి ఒక రక్షకభటుడిని ఇంగ్లిష్‌లో ఏమనాలి? దీనికి జవాబు a policeman. స్త్రీ అయితే a Police woman.
‘పోలీసులు వస్తున్నారు’ను ఇంగ్లిష్‌లో ‘The police are coming’ అనాలి, ‘The police is coming’ అనకూడదు. ఒక పోలీసు వస్తున్నాడనుకుంటే ఆంగ్లంలో ‘a policeman is coming’ అని రాస్తేనే కరెక్ట్. భారతదేశం సాధారణ సందర్భంలో ఏకవచనమైనా ఆటల గురించి రాసేటప్పుడు India beat srilanka అంటాం తప్ప, India beats sri Lanka అని అనం. అంటే, అప్పుడు భారతదేశం బహువచనం(భారతదేశపు ఆటగాళ్లు)గా మారుతుందని గ్రహించాలి.
ఇక newsను ఏకవచనంగా, బహువచనంగా వాడుతారు. ఏం వార్త తెచ్చావ్? ఏం వార్తలు తెచ్చావ్? అనే రెండు వాక్యాలనూ What news have you brought? అనే రాయాల్సి ఉంటుంది. ఒక వార్తను a news అనీ, నాలుగు వార్తలను four news రాస్తే అవి ఒప్పులు కావు! మరి ఒక వార్తను ఏమనాలి? దీనికి జవాబు an item/ piece of news. A news, two news, four news అన్నవి ఆంగ్లభాషలో లేనే లేవు! Newsకు ముందు అంకె లేక సంఖ్య రాదు, item/pieceకు ముందు మాత్రమే వస్తుంది. కొన్ని వార్తలను some news అనాలి. ఈ రెండు పదాల గురించి ఇంత చర్చ చాలనుకుంటాను.
తెలుగులో ఏకవచన పదాలకు ‘లు’ కలిపి బహువచనం చేసినట్టే, ఇంగ్లిష్‌లో ఎన్నింటికో ‘s’ చేర్చి బహువచనం చేస్తుంటాం. కానీ వాటిలోని కొన్నింటిలో ఆ బహువచన రూపాలు ఇంగ్లిష్ భాషలో ఉండవు. దీనికి, పైన చెప్పిన lustre, splendour లాంటివి మాత్రమే కాకుండా మరెన్నో ఉదాహరణలున్నాయి. చివర ‘లు’ కలిగిన పనులు, సలహాలు, పరిశోధనలు ఇత్యాది పదాలను ఆంగ్లంలో రాయాలంటే వాటి ఏకవచన రూపాలకు కలిపితే వచ్చేవి ఒప్పులు కావు. Work, advice, researchలను ఏకవచనంగా, బహువచనంగా వాడుతారు.
‘ఇవాళ నాకు చాలా పనులున్నాయి’ని I have many works today అని రాస్తే అది తప్పవుతుంది. I have much (a lot of) work today అని రాయాలి. ఎందుకంటే, work ఆంగ్లంలో uncountable noun. కాబట్టి, works అనే మాట పూర్తిగా తప్పు.
అయితే రచనలు, పుస్తకాలు అనే అర్థంలో వాడినప్పుడు works అని రాయొచ్చు. ఉదాహరణకు, He has many works to his credit.. అదేవిధంగా ఆంగ్లభాషలో advices, researches లేవు. అతడు నాకు సలహాలు ఇచ్చాడును He gave me advice అనీ, దీనిమీద ఎన్నో పరిశోధనలు జరిగాయిని Much research was done on this అని రాయాలి. కానీ తెలుగులో సలహాలు, పరిశోధనలు సరైన పదాలే. ఇట్లాంటి మాటలు బోలెడన్ని ఉన్నాయి ఆంగ్లభాషలో!
మళ్లీ తెలుగులోని నామవాచకాలకు వద్దాం. ‘నాకు కన్నీటి సరుల దొంతరలు కలవు’ అన్నాడు కృష్ణశాస్త్రి. సరులు అంటే హారాలు లేదా దండలు. ఇక్కడ సరులు బహువచనం. దీనికి ఏకవచనం ఏమిటి? సరు, సరువు అనే పదరూపాలు లేవు. ఒకవేళ ఉంటే పోరు-పోరులు, తరువు-తరు(వు)లు అయినట్టే, సరు/సరువు సరు(వు)లు అయ్యేది. మరి సరులు అనే బహువచన రూపం ఎలా వచ్చింది? అది సరి నుంచి వచ్చింది. హారానికి పర్యాయపదం సరము. కాని దాన్నుంచి సరులు ఏర్పడదు. సరములు, సరాలు మాత్రమే ఏర్పడే అవకాశముంది. సరి అంటే కూడా హారం కాబట్టి, సరికి బహువచనం సరులు అయింది. విరి విరులు, గిరి గిరులు, పురి పురులు లాగా.
‘ఉండమ్మా బొట్టుపెడతా’ సినిమాలో కృష్ణశాస్త్రి ‘కలుముల రాణీ’ అనే పదబంధాన్ని వాడినందుకు కొందరు తప్పుబట్టారు. కలిమి అన్నదే సమష్టి నామవాచకం అయినప్పుడు మళ్లీ దానికి ‘లు’ ఎలా కలపగలమన్నది వారి వాదం. కానీ సిరి సిరులు లాగా కలిమి కలుములు సరైన పదాలే. ఎందుకంటే, మన భాషలో ‘ఐష్టెశ్వర్యాలు’ ఉన్నాయి మరి!
అదేవిధంగా అష్టలక్ష్ములు ఉన్నారు. కాబట్టి, కలిమిని collective nounగా భావించకూడదు. రకరకాల ఐశ్వర్యాలను, సిరులను సూచిస్తూ కలుములు అన్న మాటను వాడారు కృష్ణశాస్త్రి. అయితే దాన్ని అం తకుముందెవరూ ప్రయోగించకపోవడం వల్ల వెంటనే ఏదో ఎబ్బెట్టుగా తోచింది. ఇంగ్లి ష్లో కూడా ఒకే రకమైన పండ్లను fruit అనీ పలురకాల పండ్లను కలిపి fruits అనీ, ఒకరి వెంట్రుకలను hair అనీ ఎక్కువ మనుషుల/ప్రాణుల వెంట్రుకలను hairs అనీ, ఒకే రకమైన చేపలను fish అనీ రకరకాల చేపలను fishes అనీ అంటాం. అదేవిధంగా water-waters, people – peoples కూడా.
తెలుగులో మరులు, కురులు అనే మాటలకు ఏకవచనాలు ఏవి? మరు, మరి, మరువు, కురు, కురి, కురువు రూపాలు లేవు. ఇక్కడ ఆసక్తిని కలిగించే విషయమేమంటే మరులు బహువచనం కాదు, అది ఏకవచనం. మరులు అంటే మోహాలు కాదు, మోహం. కురులుకు ఏకవచన రూపం ఏమిటి? కురులుకు కేశము, వెంట్రుక అని ఒక నిఘంటువులో ఏకవచన అర్థం ఇచ్చారు. కానీ, అది సబబుగా లేదనిపిస్తున్నది. ఇక ఒక చీకటి, ఒక మోహం అని రాయాల్సిన సందర్భాలు రావు కాని, ఒక వెంట్రుక అని చెప్పే సందర్భం ఉంటుంది కదా? మరి అప్పుడు దానికి కురులు నుంచి తీసుకున్న ఏకవచనం ఏది? ఈ ప్రశ్నకు జవాబు ఏమంటే, అటువంటిదేమీ లేదని. ఇరులు, మరులు ఎప్పుడూ ఏకవచనాలే. వాటికి బహువచన రూపాల్లేవు. అదే విధంగా కురులు, తిప్పలు ఎప్పుడూ బహువచనాలే. వాటికి ఏకవచన రూపాల్లేవు. జయలలిత మీద నిఖిలేశ్వర్ రాసిన ఒక కవితకు శీర్షిక ‘ఆమె ఒక చరిత్ర.’ దీన్ని ఆంగ్లంలోకి తర్జుమా చేసేందుకు చాలా ఆలోచించాల్సి వచ్చింది!
-ఎలనాగ
9866945424