రేవంత్రెడ్డి ప్రభుత్వంపై తెలంగాణ రైతాంగం ఆగ్రహంగా ఉండటానికి చాలా కారణాలున్నాయి. పంట వేయడానికి ముందు ఒకే విడతగా అందించాల్సిన రైతు భరోసా సొమ్మును మూడు నెలలుగా సాగదీయడం ఈ కారణాల్లో ఒకటి. ఎన్నికల హామీల్లో భాగంగా రైతులకు కాంగ్రెస్ మూడు వాగ్దానాలు చేసింది. అందులో మొదటిది రుణమాఫీ కాగా, రెండోది రైతుభరోసా. మూడోది పంటబీమా. ఈ మూడు వాగ్దానాల వల్లే గ్రామీణ ప్రాంతాల్లో కాంగ్రెస్ పార్టీకి అత్యధిక సీట్లు వచ్చాయి.
అధికారంలోకి వచ్చాక సగం మంది రైతులకైనా రుణమాఫీ పూర్తిచేయని ప్రభుత్వం దానిని పూర్తిచేశామని జబ్బలు చరుచుకున్నది. కానీ, ఈ పథకం ద్వారా రైతులకు అందాల్సిన సుమారు రూ. 15 వేల కోట్లకు కాంగ్రెస్ గండికొట్టింది. ప్రభుత్వం ఇప్పుడు తాజాగా ‘రైతుభరోసా’ నాటకం ఆడుతున్నది. గత ప్రభుత్వం ఒక సీజన్ పంటకు ఎకరానికి రూ.5 వేలు ఇస్తే తాము రూ. 7.5 వేలు ఇస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. వంద రోజుల్లో హామీల అమలు అంటూ గద్దెనెక్కిన కాంగ్రెస్ రైతు భరోసా ఆరంభించడానికే ఏడాది కాలం తీసుకున్నది. అర్హుల జాబితా అంటూ చర్చలు, సమావేశాలు, కమిటీ పేరిట కాలయాపన చేసింది. బీఆర్ఎస్ నేతల ఒత్తిడి తట్టుకోలేక చివరకు ఆ పథకం విధి విధానాలను ప్రకటించింది. రాష్ట్రంలో సాగు లేని భూమిగా 2.5 లక్షల ఎకరాలను గుర్తించింది.
ఎన్ని ఎకరాల వరకు రైతు భరోసా ఇవ్వాలని తర్జనభర్జన పడిన ప్రభుత్వం చివరకు ఏ భూపరిమితి లేకుండానే చిన్న, పెద్ద రైతులందరికీ పథకాన్ని వర్తింపజేసింది. సంక్రాంతికి ఇస్తామన్న రైతు భరోసాను చివరికి జనవరి 26న ఇస్తామని చెప్పింది. పొలాల్లో నాట్లు పడిన నవంబర్ నుంచి ఆశగా ఎదురుచూస్తున్న రైతులకు 27న కూడా రైతు భరోసా సొమ్ము జమకాలేదు. తొలి విడతగా 32 జిల్లాల్లోని 577 గ్రామాల్లో 9,48,333 ఎకరాల సాగుభూమికి సంబంధించి 4,41,911 మంది రైతులకు రూ. 569 కోట్లు పంపిణీ చేసింది.
ఎకరంలోపు భూమి ఉన్నవారికి తొలివిడతలో అర్హత లభించింది. తిరిగి పది రోజుల తర్వాత ఫిబ్రవరి 5న ఎకరం భూమి ఉన్న 17 లక్షల మంది రైతులకు 9.26 లక్షల ఎకరాల కోసం రూ. 557.54 కోట్లను రైతు ఖాతాల్లో వేసింది. మూడో విడతగా 9న రెండు ఎకరాల్లోపు భూమి ఉన్న 8.66 లక్షల మంది రైతులకు 11.79 లక్షల ఎకరాల కోసం రూ.707.55 కోట్లు విడుదల అయ్యాయి. ఈ విడతల వారీ పంపిణీ మార్చి 31 వరకు కొనసాగనున్నది.
రైతు భరోసా కోసం ప్రభుత్వం రూ.6,534 కోట్లను కేటాయించినట్టు తెలిసింది. ఇప్పటివరకు రూ. 1,834 కోట్లు మాత్రమే పంపిణీ చేసింది. ఇంకా రెండు వంతులకుపైగా రైతులకు పంపిణీ చేయాల్సి ఉన్నది. రైతు భరోసా పంపిణీ చూస్తుంటే దాహంతో ఉన్న వారి నోట్లో నాలుగు చుక్కల నీళ్లు విదిలించినట్టుగా అనిపిస్తున్నది.
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు కాకముందు రాష్ట్రంలో 1.31 కోట్ల ఎకరాల సాగుభూమి ఉండేది. బీఆర్ఎస్ పాలనలో ప్రాజెక్టుల నిర్మాణం జరిగి, సాగునీటి వసతి అందుబాటులోకి రావడంతో దాదాపు 90 లక్షల ఎకరాలు అదనంగా సాగులోకి వచ్చాయి. 2023 నాటికి మన వ్యవసాయ భూమి విస్తీర్ణం 2.20 కోట్ల ఎకరాలకు చేరింది. ఈ లెక్కన చూసుకుంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటి వరకు 15 శాతం భూమికే రైతుభరోసా సొమ్ము అందించింది. మిగతా సొమ్ము పంపిణీకి మరో 45 రోజుల గడువు మాత్రమే ఉన్నది. ఈ లోపు ఎన్ని అడ్డంకులు ఎదురవుతాయో ఊహించలేం.
రైతు భరోసా ఉద్దేశానికి, ప్రభుత్వ పంపిణీ విధానానికి మధ్య ఏమాత్రం పొంతన ఉండటం లేదు. ఏప్రిల్ నుంచి వరి కోతలు మొదలవుతాయి. దానికి నెల రోజుల ముందే పంటకు ఎరువులు, పురుగుల మందుల అవసరం కూడా తీరిపోతుంది. నవంబర్ నుంచి చేతిలో అవసరానికి డబ్బు లేక ఇబ్బందులు పడిన రైతుకు ఇప్పుడిచ్చే ఈ ‘భరోసా’ దేనికి పనికొస్తుంది? 2018లో బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రారంభించిన ‘రైతుబంధు’తో ఈ పథకానికి పోలికే లేదు. రైతుబంధు ద్వారా ప్రతి పంటకాలంలో కోటిన్నర ఎకరాలకు సంబంధించి 70 లక్షల మంది రైతులకు ఒకే విడతగా రూ.7 వేల కోట్లు అందేవి. ఇప్పుడీ పరిస్థితి మొత్తం తారుమారై ఎవరికి, ఎప్పుడు రైతుభరోసా సొమ్ము పడుతుందో అర్థం కాని అయోమయ స్థితికి అన్నదాతలు చేరుకున్నారు.
– బద్రి నర్సన్ 94401 28169