తెలంగాణలో 31.78 లక్షల మంది (9.08 శాతం) గిరిజనులున్నారు. మొత్తం గిరిజనుల్లో బంజారాలు 20.44 లక్షల మంది (64.32 శాతం) ఉంటారు. 2008లో జరిగిన నియోజకవర్గాల పునర్విభజన తర్వాత తెలంగాణలో ఎస్టీ రిజర్వ్డ్ సీట్లు లోక్‌సభ స్థానాలు ఒకటి నుంచి రెండుకు, శాసనసభ స్థానాలు ఏడు నుంచి 12కి పెరిగాయి. దీంతో గిరిజనులకు రాజకీయంగా అవకాశాలు పెరిగాయి. అయితే, రాష్ట్రంలో 32 గిరిజన ఉప కులాలు ఉన్నప్పటికీ, బంజారాలు, ఆదివాసీలు మాత్రమే రాజకీయంగా ప్రభావం చూపుతున్నారు.
గిరిజనులు ఎక్కువగా ఆదిలాబాద్, కుమ్రంభీం- ఆసిఫాబాద్, భద్రాద్రి-కొత్తగూడెం, ఖమ్మం, ములుగు, మహబూబాబాద్, వరంగల్ రూరల్, మంచిర్యాల, నాగర్‌కర్నూల్ జిల్లాలో నివసిస్తున్నారు. గిరిజనుల అక్షరాస్యత శాతం 49.5 శాతం. అయితే, 1961లో కేవలం 7.64 శాతంగా ఉన్నటువంటి అక్షరాస్యత శాతం ప్రస్తుతం 49.5 శాతానికి పెరగడం శుభపరిణామం. అయితే, ఇంకా అక్షరాస్యత శాతం పెరగవలసిన అవసరం ఎంతైనా ఉంది. అప్పుడే గిరిజనులు రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా ఎదగడానికి అవకాశం ఏర్పడుతుంది. రాష్ట్రంలో ఆదిలాబాద్, మహబూబాబాద్ లోక్‌సభ నియోజకవర్గాలు, అలాగే ఆసిఫాబాద్, ఖానాపూర్, బోథ్, దేవరకొండ, డోర్నకల్, మహబూబాబాద్, ములుగు, పినపాక, ఇల్లందు, వైరా, అశ్వారావుపేట, భద్రాచలం శాసనసభ నియోజకవర్గాలు షెడ్యూల్డ్ తెగలకు రిజర్వ్ అయ్యాయి. తెలంగాణ ఏర్పడినప్పటి నుంచి ఇప్పటివరకు శాసనసభకు మూడుసార్లు ఎన్నికలు జరుగగా ఇందులో 2014, 2018లలో బీఆర్ఎస్ అధికారం చేపట్టగా, 2023లో అనూహ్యంగా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. గత మూడు లోకసభ ఎన్నికల్లో మహబూబాబాద్ లోకసభ స్థానంలో బంజారాలు గెలుపొందితే, అదిలాబాద్ లోకసభ స్థానంలో ఆదివాసీ నేతలు గెలుపొందుతూ వస్తున్నారు. మహబూబాబాద్ లోకసభ నియోజకవర్గం పరిధిలో మొత్తం ఏడు శాసనసభ నియోజకవర్గాలకు గాను నర్సంపేట మినహా డోర్నకల్, మహబూబాబాద్, ములుగు, పినపాక, ఇల్లందు, భద్రాచలం శాసనసభ నియోజకవర్గాలు షెడ్యూల్డ్ తెగలకు రిజర్వ్డ్. ఈ ఆరు స్థానాలలో 2014, 2018లలో మూడు స్థానాలు ఆదివాసీలు, మూడు స్థానాలను బంజారాలు గెలుపొందారు. 2023లో నాలుగు శాసనసభ స్థానాల్లో ఆదివాసీలు, రెండు స్థానాల్లో బంజారాలు గెలిచారు. అయినా 2024 లోకసభ ఎన్నికల్లో మాత్రం బంజారా నేత ఎంపీగా విజయం సాధించారు. ప్రధాన రాజకీయ పార్టీలన్నీ 2014, 2019, 2024లలో మహబూబాబాద్ లోకసభ స్థానం నుంచి బంజారాలనే బరిలో నిలిపాయి.
ఆదిలాబాద్ లోకసభ నియోజకవర్గ పరిధిలోని మొత్తం ఏడు శాసనసభ స్థానాల్లో సిర్పూర్, ఆదిలాబాద్, నిర్మల్, ముథోల్ జనరల్ నియోజకవర్గాలు కాగా; ఆసిఫాబాద్, ఖానాపూర్, బోథ్ నియోజకవర్గాలు మాత్రమే షెడ్యూల్డ్ తెగలకు రిజర్వ్ చేశారు. ఈ మూడు నియోజకవర్గాల్లో 2014, 2018లలో ఒక స్థానాన్ని కోయ, రెండు స్థానాలను బంజారా నేతలు కైవసం చేసుకున్నారు. అయితే, 2023లో రెండు శాసనసభ స్థానాల్లో ఆదివాసీలు గెలవగా, ఒక స్థానంలో బంజారా నేత గెలిచారు. ఇక్కడ ప్రధాన పార్టీలు 2014, 2019, 2024 లోకసభ ఎన్నికల్లో బంజారాలకు టికెట్ కేటాయించినప్పటికీ, ఆదివాసీ నేతలే విజయం సాధించారు. తెలంగాణలో గత మూడు పర్యాయాలు జరిగిన శాసనసభ ఎన్నికలలో షెడ్యూల్డ్ తెగలకు కేటాయించిన శాసనసభ నియోజకవర్గాలలో గెలిచిన అభ్యర్థులను ఉపకులాల వారీగా పరిశీలిస్తే, బంజారాలు, ఆదివాసీలు ఏయే నియోజకవర్గాల్లో ప్రభావం చూపుతున్నారో మనకు అర్థమవుతుంది.
స్వరాష్ట్రం ఏర్పడ్డాక జరిగిన మొదటి అసెంబ్లీ ఎన్నికల్లో ఆసిఫాబాద్, పినపాక, ఇల్లందు, అశ్వారావుపేట, భద్రాచలం నియోజకవర్గాల్లో ఆదివాసీ అభ్యర్థులు గెలువగా, ఖానాపూర్, బోథ్, దేవరకొండ, డోర్నకల్, మహబూబాబాద్, ములుగు, వైరా నియోజకవర్గాల్లో బంజారా అభ్యర్థులు గెలుపొందారు. ఈ ఎన్నికల్లో బంజారా కులానికి చెందినవారు ఎక్కువ సీట్లు గెలుపొందగా, ఇదే సామాజికవర్గానికి చెందిన అజ్మీరా చందూలాల్ మంత్రివర్గంలో స్థానం పొందారు. అలాగే 2018లో జరిగిన రెండవ అసెంబ్లీ ఎన్నికల్లో ఐదు నియోజకవర్గాల్లో అనగా ఆసిఫాబాద్, ములుగు, పినపాక, అశ్వారావుపేట, భద్రాచలంలో ఆదివాసీ అభ్యర్థులు గెలువగా, ఏడు నియోజకవర్గాల్లో అనగా ఖానాపూర్, బోథ్, దేవరకొండ, డోర్నకల్, మహబూబాబాద్, ఇల్లందు, వైరాల్లో బంజారా అభ్యర్థులు గెలుపొందారు. బంజారా సామాజికవర్గానికి చెందిన సత్యవతి రాథోడ్‌కు మంత్రివర్గంలో చోటు దక్కింది. ఆదివాసీ నేత రేగా కాంతారావుకు ప్రభుత్వ విప్‌గా అవకాశం దక్కింది. ఇక 2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఏడు నియోజకవర్గాల్లో అనగా ఆసిఫాబాద్, ఖానాపూర్, ములుగు, పినపాక, ఇల్లందు, అశ్వారావుపేట, భద్రాచలంలో ఆదివాసీలు గెలువగా, ఐదు నియోజకవర్గాల్లో అనగా బోథ్, దేవరకొండ, డోర్నకల్, మహబూబాబాద్, వైరాలో బంజారా అభ్యర్థులు గెలిచారు. ఈ ఎన్నికల్లో ఏడు నియోజకవర్గాల్లో ఆదివాసీ అభ్యర్థులు గెలువగా, అదే సామాజికవర్గానికి చెందిన ధనసరి అనసూయకు మంత్రివర్గంలో స్థానం దక్కింది. బంజారా నేత జాటోత్ రాంచందర్ నాయక్‌కు డిప్యూటీ స్పీకర్‌గా అవకాశం కల్పించారు.
తెలంగాణ ఏర్పడిన తర్వాత మొదటి రెండు శాసనసభ ఎన్నికల్లో బంజారాలు ఎక్కువ స్థానాల్లో గెలుచుకోగా, మూడవ శాసనసభ ఎన్నికల్లో ఆదివాసీలు ఎక్కువ స్థానాలను గెలుచుకున్నారు. మొదటినుంచీ ఆసిఫాబాద్, పినపాక, అశ్వారావుపేట, భద్రాచలం స్థానాల్లో ఆదివాసీలు గెలుపొందుతుండ గా; బోథ్, దేవరకొండ, డోర్నకల్, మహబూబాబాద్, వైరా శాసనసభ స్థానా ల్లో మాత్రం బంజారాలు గెలుస్తూ వస్తున్నారు. ఖానాపూర్, ములుగు, ఇల్లం దు నియోజకవర్గాల్లో మాత్రం బంజారాలు గాని, ఆదివాసీలు గాని వరుసగా మూడు పర్యాయాలు ప్రభావితం చూపలేకపోయారు. బీఆర్ఎస్ సర్కారు రెండుసార్లు మంత్రిమండలిలో బంజారాలకు అవకాశం కల్పించగా, మూడవసారి కాంగ్రెస్ పార్టీ ఆదివాసీలకు స్థానం కల్పించింది. తెలంగాణలో ఆదివాసీలకు మంత్రిమండలిలో చోటు దక్కడం ఇదే మొదటిసారి. తెలంగాణలో అత్యధికంగా ఉన్న బంజారా గిరిజనులకు కాంగ్రెస్ మంత్రివర్గంలో సరైన ప్రాతినిధ్యం లభించలేదని చెప్పవచ్చు. బంజారా నేతను ఉప సభాపతిగా నియమించినప్పటికీ, వారిలో నిరాశ అలుముకున్నది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని గిరిజన సంఘాలు, నాయకులు తమ గొంతు వినిపించి, మంత్రివర్గంలో తమకు తగిన స్థానం కల్పించాలని కోరాల్సిన అవసరం ఉన్నది.
(వ్యాసకర్త: సామాజిక, రాజకీయ విశ్లేషకులు)
– డాక్టర్ రమేష్ అజ్మీరా
94416 35316