కోటి ఆశలతో కొంగొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టాం. కొత్త సంవత్సర సంబురాల సందడి సద్దుమణిగింది. కడివెడు దుఃఖం, పిడికెడు సంతోషాలు మిగిల్చిన 2023 కాలవాహినిలో కలిసిపోయింది. సుస్థిర శాంతి, సౌభాగ్యాలు తెస్తుందని అందరూ ఆశిస్తున్న 2024 సంవత్సరానికి ఉత్సాహోద్వేగాల మధ్య ఉషోదయమైంది. ఏ రకంగా చూసినా ఇది ఓ మూలమలుపు సంవత్సరమే. ఎన్నో మైలురాళ్లు దాని గర్భంలో దాగున్నాయి. ఎన్నో మార్పులకు నాందీ ప్రస్తావన జరుగబోతున్నది. రాజకీయ పరిశీలకులు చమత్కరిస్తున్నట్టుగా ఇది ‘ఎన్నికల నామ’ సంవత్సరం కావడమే అందుకు కారణం. భారత్‌తో సహా ప్రపంచంలోని అనేక దేశాల్లో ఎన్నికల నగారాలు మోగుతున్నాయి. జనాల భవిత, నేతల తలరాత తేల్చేసే ఎన్నికల యుద్ధానికి తెర తొలగబోతున్నది. అగ్రరాజ్యాలైన అమెరికా, రష్యాతోపాటుగా యూరోపియన్ యూనియన్, దక్షిణాఫ్రికా, మెక్సికో, ఇండోనేషియా తదితర 64కు పైగా దేశాల్లోని 400 కోట్లకు పైగా ప్రజలు (ప్రపంచ జనాభాలో సుమారు 49 శాతం మంది) కొత్త ప్రభుత్వాలను ఎన్నుకోనున్నారు. మరోసారి అధ్యక్ష పదవి చేపట్టాలని ఉరకలేస్తున్న డొనాల్డ్ ట్రంప్ ఆశలపై కోర్టుల ప్రతికూల తీర్పులు నీళ్లు చల్లుతున్నాయి.
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఐదో విడత అధ్యక్ష పదవికి గుట్టుచప్పుడు కాకుండా పావులు కదుపుతున్నారు. ప్రపంచం మాటెలా ఉన్నప్పటికీ భారత ఉపఖండానికి మా త్రం ఇది అచ్చంగా ఎన్నికల నామ సంవత్సరమేనని చెప్పాలి. ఇరుగుపొరుగు దేశాలైన పాకిస్థాన్, బంగ్లాదేశ్‌లోనూ ఎన్నికలు జరుగనున్నాయి. భూటాన్‌లో కొద్దిరోజుల్లో చివరి విడత ఎన్నికల్లో అక్కడి ప్రజలు అంతిమతీర్పు చెప్పబోతున్నారు. ఇక మన దేశంలో అత్యంత కీలకమైనవిగా భావిస్తున్న పార్లమెంటు ఎన్నికలు జరిగేది ఈ ఏడాదే. మూడో విడత అధికారం కోసం ప్రధాని మోదీ ఉవ్విళ్లూరుతున్నారు. ఏదోరకంగా గట్టి పోటీనిచ్చి గద్దె దింపాలని విపక్షాలు మల్లగుల్లాలు పడుతున్నాయి. 2024 అత్యంత క్రియాశీలమైన, పరిణామాత్మకమైన, ప్రభావయుతమైన సంవత్సరంగా చరిత్ర సృష్టిస్తుందని ప్రముఖ వాణిజ్య పత్రిక ఫోర్బ్స్ అంచనా వేస్తున్నది. అమెరికా జాబ్ మార్కెట్లో అవకాశాలు వెల్లువెత్తుతాయని జోస్యం చెప్పింది. అమెరికాతో పాటుగా ప్రపంచ ఆర్థికవ్యవస్థ వెలుగుల దిశగా ప్రయాణిస్తుందని పేర్కొనడం శుభసూచకం.
కృత్రిమ మేధ (ఏఐ)కు సంబంధించినంతవరకు ఇది నిర్ణయాత్మకమైన సంవత్సరం అవుతుందని చెప్పాలి. ఇప్పటిదాకా మనం చూసింది ట్రైలర్ మాత్రమే. ఈ ఏడాది అసలైన సినిమా తెరమీదకు వస్తుందని నిపుణులు అంటున్నారు. ఏఐ వల్ల ఉద్యోగాలు పోయినా కొత్తరకం ఉద్యోగాలు వస్తాయనే ఆశలు కలుగుతున్నాయి. పని సంస్కృతి మార్పు మొదలుకొని క్వాంటం కంప్యూటింగ్ దాకా నూతన సర్దుబాట్ల దిశగా టెక్ ప్రపంచం ఈ ఏడాది అడుగులు వేస్తుందని భావిస్తున్నారు. రవాణా రంగంలో నూతన ఇంధనావిష్కరణలతో పాటు స్వయంచాలక వాహన సాంకేతికత కూడా ఈ ఏడాదే స్థిరీకరణ పొందుతుందని ఆశిస్తున్నారు. ఉక్రెయి న్, గాజా యుద్ధాల ప్రభావంతో రాజకీయ, ఆర్థికరంగాల్లో సవాళ్లు తప్పనిసరిగా ఎదురవుతాయి. ఈ ఏడాది యుద్ధాల పీడ విరగడైపోయి, సమస్యలు సమసిపోయి, ప్రజలందరికి సుఖశాంతులు కలగాలని కోరుకుందాం.