చేతగాని వారేం జేస్తారు?
ప్రజల విశ్వాసాన్ని పణంగా పెట్టి
నిందలు మరొకరిపై మోపడానికి
కొత్త కొత్త దారులు వెతుకుతారు!
తెలంగాణ మీద
కత్తి కట్టిన వారితో చేతులు కలిపి
అసందర్భ కయ్యానికి
కాలు దువ్వుతారు!
ఇదేంటీ అన్నామా
జనం నెత్తి మీదికి కాలెత్తుతారు
పరాజయం తరుముకొస్తుంటే
తొక్కేస్తామంటూ రంకెలేస్తారు!
జనమింకా ఓటు ఆయుధాన్ని
జారవిడుచుకోలేదు
నోరు అదుపు తప్పి
డిపాజిట్ అవకాశానికి
గండి కొడుతున్నది!
ఆత్మ గౌరవం కోసం
అశువులు బాసిన
త్యాగధనుల ఇలాఖా ఇది
తిక్క తిరిగిందా తడాఖా చూపిస్తది!
నడిచి వచ్చిన దారి
గుడ్డిదేం కాదు
వ్యాపార పాద ముద్రల మురికి
రహస్య ఒప్పందాలను బయట పెడతది!!
కోట్ల వెంకటేశ్వర రెడ్డి: 94402 33261