ఏదైనా దేశాన్ని మరో దేశం నయానా భయానా తన ప్రయోజనాలకు అనుకూలంగా మలచుకోవాలంటే అనేక మార్గాలుంటాయి. అందులో గన్-బోట్ డిప్లమసీ ఒకటి. ముందుగా సైనిక శక్తితో ఒక దేశాన్ని చుట్టుముట్టి నా మాట వింటావా లేదా.. మా సరుకులు కొంటావా లేదా.. అంటూ బెదిరించడం ఈ విధానం ప్రత్యేకత. అమెరికా అధ్యక్షుడు రిచర్డ్ నిక్సన్ హయాంలో అప్పటి విదేశాంగమంత్రి హెన్రీ కిసింజర్ దీన్ని బాగా ప్రాచుర్యంలోకి తెచ్చారు. ఇప్పుడు ట్రంప్ హయాంలో గన్-బోట్ స్థానంలో టారిఫ్ వచ్చింది. సాధారణంగా ఎగుమతి, దిగుమతి సుంకాలు ప్రతి దేశం విధిస్తుంది. సప్లయ్ డిమాండ్‌ను బట్టి అవి మారుతుంటాయి. కానీ, ట్రంప్ తన మాట జవదాటితే టారిఫ్ అస్త్రం సంధిస్తున్నారు. తాజాగా ఆయన మెక్సికో, కెనడా, చైనా దేశాల ఉత్పత్తులపై భారీ సుంకాలు వేస్తున్నట్టు ప్రకటించారు. కెనడా, మెక్సికోలపై 25 శాతం చొప్పున, చైనాపై అదనంగా మరో 10 శాతం సుంకం వేయనున్నట్టు తెలిపారు. అమెరికా కార్మిక వర్గాన్ని, పరిశ్రమలను కాపాడేందుకు సుంకాలు పెంచుతున్నట్టు వెల్లడించారు. ఊహించినట్టుగానే బాధిత దేశాలు దెబ్బకు దెబ్బ అన్నట్టుగా ఆర్థిక ప్రతీకార చర్యలు చేపట్టాయి. కెనడా, మెక్సికో కొద్దిగా అతలాకుతలం అయినప్పటికీ చైనా మాత్రం ముందు జాగ్రత్తలతో స్థిరంగా నిలబడింది. మూడు దేశాలూ అమెరికా సరుకులపై సుంకాలు పెంచుతున్నట్టు తెలిపాయి.
తన చర్యల వల్ల బాధ కలిగినప్పటికీ దీర్ఘకాలికంగా అవి మేలు చేస్తాయని ట్రంప్ అమెరికా ప్రజలను అనునయించే ప్రయత్నం చేశారు. ఆయా దేశాలు అనుసరించే బేసబబు వాణిజ్య విధానాల వల్ల టారిఫ్ పెంపు అనివార్యమైందనేది ఆయన వాదన. దీర్ఘకాలికం మాటేమో గానీ స్వల్పకాలికంగా స్టాక్ మార్కెట్లపై అవి ప్రతికూల ప్రభావాన్ని చూపాయి. వాణిజ్య యుద్ధాల వల్ల ప్రపంచ వృద్ధి క్షీణిస్తుందనే భయాల వల్ల మార్కెట్లు కుప్పకూలాయి. అందులో అమెరికా మార్కెట్లూ ఉండటం గమనార్హం. యూరప్, ఆసియా మార్కెట్లు కూడా భారీగా నష్టపోయాయి. ఒక్క రోజులోనే లక్షల కోట్ల సంపద ఆవిరైపోయింది. బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీల మార్కెట్ విలువ రూ.5.30 లక్షల కోట్లు తగ్గిపోయింది. డౌజోన్స్ పారిశ్రామిక సూచీ పతనమైంది. బ్రిక్స్ కూటమి డాలరు చెల్లింపుల వ్యవస్థ నుంచి వైదొలిగితే వంద శాతం టారిఫ్ వేస్తానని ఆయన గత ఎన్నికల ప్రచారంలోనే బెదిరించారు. ఇదే జరిగితే ఇండియాతో పాటు ఇతర సభ్య దేశాలపై అనివార్యంగా ప్రభావం చూపుతుంది.
ఈ వాణిజ్య యుద్ధాల వల్ల అంతిమంగా నష్టపోయేది ప్రజలేననేది నిర్వివాదాంశం. టారిఫ్ పెంపు వార్త ప్రభావంతో క్రూడాయిల్ ధరలు పెరిగాయి. ఇది ప్రపంచవ్యాప్తంగా అన్ని సరుకుల ధరల పెంపునకు దారితీస్తుందని చెప్పక తప్పదు. సంయమనంతో, చర్చల ద్వారా పరిష్కరించుకోవాల్సిన అంశాలకు అమెరికా అధ్యక్షుడు టారిఫ్ పెంపును ఎంచుకుంటున్నారు. తన అగ్రరాజ్య ప్రాభవానికి ఇతర దేశాలపై ఆధారపడే అమెరికా బెదిరింపులతో, దుస్సాహసిక చర్యలతో సాధించేదేమీ ఉండదు. వాణిజ్యంలో ఆరోగ్యకరమైన పోటీ మంచిదే. సుంకాల బెదిరింపులు శోభించవు, లాభించవు.