స్టాక్ మార్కెట్ల పతనం నిరవధికంగా కొనసాగుతూనే ఉన్నది. నిన్నటి సోమవారం మరో ‘బ్లాక్ మండే’ నమోదైంది. నిజానికి గత వారం రోజులుగా షేర్ మార్కెట్ నేల చూపులు చూస్తూనే ఉన్నది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన టారిఫ్‌ల యుద్ధం ఈ పతనానికి ఆజ్యం పోస్తున్నది. టారిఫ్ కీచులాటలతో పాటుగా అమెరికా మాంద్య భయాలు మార్కెట్లను వణికిస్తున్నాయి. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ముగింపుపై సంప్రదింపులు జరుగుతున్నాయన్న వార్తలు కూడా మార్కెట్లపై ప్రభావం చూపుతున్నాయి. విదేశీ సంస్థాగత మదుపరులు (ఎఫ్ఐఐ) భారత్ నుంచి పెట్టుబడులను నిరంతరంగా తరలిస్తూనే ఉన్నారు. ఈ నెలలోనే రూ.23 వేల కోట్లకు పైగా భారతీయ వాటాలను ఎఫ్ఐఐలు వదిలించుకున్నాయి.
ఈ ఏడాది రెండు నెలలను కలిపితే రూ.లక్ష కోట్లకు పైనే పెట్టుబడుల ఉపసంహరణ జరిగింది. ఎఫ్ఐఐల అమ్మకాల జోరు, ట్రంప్ టారిఫ్‌ల బెదురు గత కొన్నిరోజులుగా మార్కెట్లను కృంగదీస్తున్నాయి. గత శుక్రవారం వాల్ స్ట్రీట్‌కు చెందిన డౌజోన్స్ సూచీ 1.71 శాతం కృంగిపోయింది. సహజంగానే ఈ సెంటిమెంట్ల ప్రభావం భారత్‌పై పడుతున్నది. రూపాయి విలువ నిరంతరంగా పడిపోవడం, మూడో త్రైమాసిక ఫలితాలు బలహీనంగా ఉండటం, డాలరు నిల్వలు తరిగిపోతుండటం, వాణిజ్యలోటు పెరుగుతుండటం మదుపరుల నమ్మకాన్ని వమ్ము చేస్తున్నది. సెన్సెక్స్ ఒక్కరోజే 857 పాయింట్లు, నిఫ్టీ 243 పాయింట్లు నష్టపోయాయి. ఫలితంగా రూ.4.23 లక్షల కోట్ల మదుపరుల సంపద ఆవిరైపోయింది. మరోసారి పతనమైతే 28 ఏండ్ల నాటి రికార్డు బద్దలైపోతుందని అంచనా. ఇక దలాల్ స్ట్రీట్ వరుసగా ఐదు నెలల పాటు పతనం కావడమన్నది 1996 తర్వాత ఇప్పుడే మొదటిసారి.
స్టాక్ మార్కెట్ల పతనం వల్ల మదుపరులు ప్రత్యామ్నాయ పెట్టుబడి అవకాశాల కోసం అన్వేషిస్తున్నారు. వ్యూహాలను మార్చుకుంటున్నారు. రిస్క్‌లతో కూడిన అధిక లాభాల మార్గాలు భయపెడుతుండటంతో తక్కువ రిస్క్, తక్కువ లాభం కలిగించే ఎఫ్డీ వంటివి ఎంచుకుంటున్నారు. వారికి ధగ ధగ మెరిసే పచ్చని లోహం ఆకర్షణీయ ప్రత్యామ్నాయంగా కనిపిస్తున్నది. దీంతో బంగారం ధర మళ్లీ పుంజుకుంటున్నది. ఢిల్లీ బులియన్ మార్కెట్లో పది గ్రాముల బంగారం ధర రూ.350 పెరిగి రూ.89,100కి చేరుకున్నది. మార్కెట్ అస్థిరతల కారణంగా మదుపరులు సురక్షితమైన బంగారం వైపు మళ్లడంతోనే ధర పెరుగుతున్నదనేది వాస్తవం. గత ఏడాది బంగారంపై పెట్టుబడి పదిశాతం కన్నా ఎక్కువే లబ్ధి కలిగించింది. ఈ ధోరణి మరికొన్నాళ్లపాటు ఇలాగే కొనసాగడం ఖాయంగా కనిపిస్తున్నది.
చైనాతో పోలిస్తే భారతీయ మార్కెట్లు కొంత వెనుకబాటు ప్రదర్శిస్తున్నాయి. వివిధ ప్రోత్సాహకాల కారణంగా ఎఫ్ఐఐలు చైనాకు తరలిపోతున్నాయి. ఏడాది కాలంలో ఇండియా మార్కెట్ క్యాపిటలైజేషన్ లక్ష కోట్ల డాలర్లు తగ్గిపోతే, అదే సమయంలో చైనా రెండు లక్షల కోట్ల డాలర్లు పెంచుకోవడం గమనార్హం. ఇండియా వాటాలు అమ్మేయ్ చైనా వాటాలు కొనేయ్ అనే ధోరణి మరికొంతకాలం కొనసాగవచ్చునని అంటున్నారు. 2024లో చైనా ప్రకటించిన మార్కెట్ ప్రోత్సాహకాలు దీనికి కారణమనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. భారత్ కూడా ఆర్థికరంగంలో వేగం పెంచేలా సంస్కరణలను వేగవంతం చేయాలి. ఆర్థికవృద్ధి, కార్పొరేట్ లాభాల పెంపు సాధిస్తేనే ఎఫ్ఐఐలు మరోసారి ఇటుగా దృష్టి మళ్లించి మార్కెట్ మళ్లీ పుంజుకుంటుంది.