భరత జాతి భానోదయ వెలుగులు
వజ్రోత్సవ కాంతులీను ప్రగతి దారులు
విశ్వ మానవుల పురుడు పోసుకున్న
భవ్యభారతం
ఆది మానవుల ఆధునీకరించిన వేదభూమి
ఉపనిషద్ వెలుగుల్లో జ్ఞానబోధ గురుత్వం
జ్ఞాన సంపన్నుల్ని – విజ్ఞాన ఖనుల్ని
విశ్వ విజేతల్ని ప్రభవించిన దివ్య భారతావని
విశ్వాంధకారాన్ని తేజోమయం చేసిన
క్రాంతి పుంజం
సాంస్కృత – సంప్రదాయాలు – సంస్కారాలు –
శోభాయ మానం నాజన్మభూమి
అసామాన్య ఆధ్యాత్మికతలో పరవశించిన –
ఋషి పుంగవుల కల్పతరువు
ప్రపంచ సర్వమతాల సర్వోన్నత
వేదికల నాదరించిన శ్రావ్య గీతం
కాలచక్రం విధించిన శాపాల పాపాలు
పరపీడనలో శతాబ్దాల దోపిడి యాతనలు
పెల్లుబిన స్వతంత్రేచ్ఛ రగిలించిన
సుదీర్ఘ అగ్నిహోత్రం
పరాజితులై వెనుదిరిగిన ఆంగ్లేయుల
ఆధిపత్యం
పాలనాదక్షులైన సమరవీరుల
అంకిత అగ్రశ్రేణి నాయకత్వం
శ్రేయోరాజ్య సాధనలో పఠించిన
గాయత్రీమంత్రం
ప్రజలే ప్రభువులై పాలించే ప్రజాస్వామ్య గణతంత్రం
ఆసేతు హిమాచలం అలరించు
నదీనదాల పరవళ్లు
రాజ్యాంగ పీఠికలో నెలవైన దిశానిర్దేశ భూమిక
సమసమాజం – ప్రజాస్వామ్యం – లౌకికత్వం
దశాబ్దాల పాలనలో సాధ్యం కాని ఆదర్శాలు
కాలక్రమంలో అలముకొన్న
వైషమ్యాల చీకట్లు
ఏకీకృతం కాజాలని వైరుధ్యాల అంతరాలు
లోపించిన నాయక శ్రేణి పధనిర్దేశం
అధికార లాలసత తలకెక్కిన మనోవైకల్యం
రాజకీయంలో కోరలు చాచిన స్వార్థం నమూనాలు
విషగ్రస్తమైన నాయకత్వ వైపరీత్య పైత్యాలు
సృజించిన అడ్డుగోడల అనర్థ ఫలితాలు
జాతి సమైక్యతకే గొడ్డలి పెట్టైన –
విద్వేష విస్ఫోటనాలు
సామాజిక మాధ్యమాల్లో చెలరేగే
మంటల దావానలం
పసలేని వాదనల్లో పరితపించే
దేశభవితవ్యం
చర్చల్లేని చట్ట సభల తీర్మానాల నిర్వాకం
ప్రజాభీష్టాన్ని ప్రతిబింబించని ఏకపక్ష
నిర్ణయాలు
తరాలు మారినా తరగని మధ్యయుగాల
మారణ హోమాలు
అధోగతి పాలైన ఆర్థిక ప్రణాళికలు
నలుగురి కబంధ హస్తాల్లో నలిగిన
సుసంపన్న భారతావని
రాజ్యాధికారాన్ని శాసించే కార్పొరేట్ల
పాలైన ప్రభుత్వ యంత్రాంగం
చీకట్లో జ్వలించిన ఒక వెలుగు రేఖ
సమస్త జాతిని ఏకత్రాటిపై నడిపించే
సమర్థ నాయకత్వం
అత్యద్భుత ప్రగతి పధంలో సాధ్యమైన
సంక్షేమ తెలంగాణ రాష్ట్రం
దిశానిర్దేశం చేయగల భవితకు
తాత్విక పునాది
ఆశా కిరణమై స్వప్నించిన భారతావని
సమగ్ర భవితవ్యం
జై జై తెలంగాణ – జై జై భారత్ మాత