గత అసెంబ్లీ ఎన్నికల్లో ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లకు కాంగ్రెస్ పార్టీ ఎన్నో హామీలిచ్చిందని, తీరా అధికారంలోకి వచ్చాక మోసం చేసిందని ఆచార్య జయశంకర్ తెలంగాణ పెన్షనర్ల హక్కుల పరిరక్షణ కమిటీ పేర్కొన్నది. ఇచ్చిన హామీలను నెరవేర్చకపోగా కొత్త సమస్యలను సృష్టించి కాంగ్రెస్ సర్కార్ ఇబ్బందుల పాల్జేస్తున్నదని ఆరోపించింది. కేంద్రంలోని బీజేపీ సర్కార్ పెన్షనర్ల హక్కులను కాలరాసిందని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో గత పదేండ్లలో ఉద్యోగులకు అనేక ప్రయోజనాలు చేకూర్చిన బీఆర్ఎస్కు త్వరలో జరగనున్న జూబ్లీహిల్స్ ఎన్నికల్లో మద్దతు ఇచ్చి, కాంగ్రెస్, బీజేపీలకు గట్టి గుణపాఠం చెప్పాలని ఆచార్య జయశంకర్ తెలంగాణ పెన్షనర్ల హక్కుల పరిరక్షణ కమిటీ పిలుపు ఇచ్చింది. ఈ మేరకు బహిరంగ లేఖలో ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్లను విన్నవించింది. ఆ లేఖ సారాంశం..
తెలంగాణలో ఉద్యోగుల, పెన్షనర్ల పరిస్థితి దారుణంగా తయారైంది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఉద్యోగులకు, పెన్షనర్లకు అనేక హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చింది. 22 నెలలు గడుస్తున్నా వాటిలో ఏ ఒక్క హామీ నెరవేర్చకపోగా అదనంగా అనేక సమస్యలు సృష్టించి మానసిక ఒత్తిడికి గురిచేస్తున్నది.
తనను కోసుకుతిన్నా, వండుకుతిన్నా ఉద్యోగులకు, పెన్షనర్లకు ఇవ్వడానికి ప్రభుత్వం వద్ద నిధులు లేవని ముఖ్యమంత్రి చేసిన బరితెగింపు వ్యాఖ్యలు విస్మయపరిచాయి. ప్రజలకు, ఉద్యోగులకు మధ్య చిచ్చు పెట్టే విధంగా ‘ఏ సంక్షేమ అభివృద్ధి పథకాలు ఆపేసి మీకు ఇవ్వాలో చెప్పాలి’ అని ఉద్యోగులను అడగడం ముఖ్యమంత్రి అతి తెలివికీ, పలాయనవాదానికీ నిదర్శనం. చివరికి పండుగ అడ్వాన్స్ బిల్లులు, టీఏ, లీవ్ శాలరీ కూడా చెల్లించక ఉద్యోగుల ఉసురుపోసుకుంటున్నారు.
విధి నిర్వహణ కోసం కావాల్సిన కనీస నిధులు విడుదల చేయకపోవడం వలన పంచాయతీ కార్యదర్శులు, హాస్టల్ వార్డెన్లు సొంత డబ్బులు వెచ్చిస్తూ అప్పుల పాలవుతున్నారు. ఎవరు ఏది అడిగినా రేవంత్ సర్కార్ ఒక్కటే మాట చెప్తున్నది. గత ప్రభుత్వం అప్పులు చేసిందని, వస్తున్న రెవెన్యూలో రూ.6,500 కోట్లు అప్పులే కడుతున్నామని బుకాయించడం పరిపాటిగా మారింది. 22 నెలల కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న అప్పు రూ.2.40 లక్షల కోట్లు ఏం చేశారో చెప్పాలని డిమాండ్ చేస్తే అప్పులు తీర్చడానికే అప్పులు అని అబద్ధాలాడుతూ మోసపుచ్చుతున్నారు.
కేసీఆర్ పదేండ్ల పాలనలో ఉద్యోగులు అనేక ఆర్థిక ఇబ్బందులను పరిష్కరించుకున్నారు. కరోనా కాలంలో జీతాలు ఒకటవ తేదీకి రావడం లేదనే ఆవేదనతో గత ఎన్నికల్లో మనం కాంగ్రెస్ పార్టీకి మద్దతిచ్చిన పాపానికి, ఇప్పుడు మన పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ఇలాంటి తరుణంలో జరుగుతున్న జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో ఉద్యోగులు, పెన్షనర్లు ఏకమై కాంగ్రెస్ను ఓడిస్తేనే సర్కార్కు కనువిప్పు కలుగుతుంది. ఒకవేళ కాంగ్రెస్ గెలిస్తే మనకు పీఆర్సీ రాదు, డీఏలు ఉండవు, రిటైర్మెంట్ బెనిఫిట్స్ రావు, సీపీఎస్ రద్దు ఊసే ఉండదు.
బీజేపీ కూడా పెన్షనర్ల హక్కులను కాలరాస్తూ చట్టాలు చేసింది. భవిష్యత్తులో పెన్షనర్లకు పీఆర్సీ బంద్, డీఏ బంద్ అని ఇప్పటికే ప్రకటించింది. ఉద్యోగులు, పెన్షనర్ల హక్కులకు మరణశాసనం రాస్తున్న రెండు పార్టీలను ఓడించి బలమైన సంకేతం ఇద్దాం. తెలంగాణ ఉద్యోగుల శక్తి ఏమిటో రుచి చూపిద్దాం. బీఆర్ఎస్ పదేండ్ల పాలనలో రెండుసార్లు మెరుగైన పీఆర్సీ ఇవ్వటమే కాకుండా, నేడు రేవంత్ సర్కార్ అనుసరిస్తున్న ఉద్యోగ వ్యతిరేక విధానాలకు నిరసనగా గళం ఎత్తడంలో మనకు మద్దతుగా నిలుస్తున్న బీఆర్ఎస్కు మనం మద్దతు ప్రకటిద్దాం. కాంగ్రెస్, బీజేపీలకు గుర్తుండిపోయే విధంగా బలమైన గుణపాఠం నేర్పిద్దాం.
– ఆచార్య జయశంకర్ తెలంగాణ పెన్షనర్ల హక్కుల పరిరక్షణ కమిటీ