Lagacharla | లగచర్ల రైతుల ఆవేశాన్ని రాజకీయంగా వాడుకోవాలని చూస్తున్న పాలక పక్షం.. వారి సమస్య పరిష్కారానికి కనీస ప్రయత్నం కూడా చేయడం లేదు. సమస్య మూలాల్లోకి వెళ్లి పరిష్కరించాల్సిన పాలకులు.. తమ అసమర్థత కారణంగా తలెత్తిన నిరసనలకు రాజకీయ రంగు పులుముతున్నారు. రైతులను ఒప్పించి భూములు తీసుకోవాల్సిన చోట బెదిరింపులకు దిగడమే దాడులకు కారణం. అయితే, దాడులు ఎక్కడ జరిగినా ఖండించాల్సిందే. కానీ, ఆ పరిస్థితికి దారితీసిన కారణాలను తెలుసుకోవడానికి ప్రయత్నించకపోవడం విచారకరం.
సీఎం రేవంత్‌రెడ్డి సోదరుడు తిరుపతిరెడ్ది మొదలు స్థానిక కాంగ్రెస్ నాయకుల వరకు భూములు ఇవ్వాల్సిందేనని.. ఇవ్వకున్నా తీసుకుని తీరుతామని మొదటినుంచి ప్రకటనలు చేస్తున్నారు. వారి ప్రకటనలు గిరిజనుల్లో భయాన్ని పెంచి దాడులకు పాల్పడేలా చేసిందనేది వాస్తవం. తమది ఆవేశం కాదని.. ఆవేదన అని.. తమ ఉనికిని కాపాడుకోవడానికి, తమ భవిష్యత్తు అంధకారం కాకుండా చూసుకోవడానికే పోరాటం చేస్తున్నామని వారు మొదటినుంచి అంటున్నారు. ఇరవై రోజుల క్రితం దుద్యాల మండల కాంగ్రెస్ నాయకుడిని లగచర్ల గ్రామస్తులు పరిగెత్తించి కొట్టారు. అయినప్పటికీ పాలకులకు వారి ఆవేదన అర్థం కాలేదు. దాని పర్యవసానమే తాజా ఉదంతం. ఇది కేవలం దాడి కాదు, ప్రజా వ్యతిరేక విధానాలపై తిరుగుబాటు. అయితే, తమ భూములను కాపాడుకోవడానికి వారు చేస్తు న్న పోరాటాన్ని చిన్నచూపు చూస్తూ.. తిరిగి వారినే నిందితులుగా చూపిస్తున్న వైనం హేయం.
ఒక పక్క ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో ఫార్మాసిటీ కోసం 19 వేల ఎకరాలను గత బీఆర్ఎస్ ప్రభుత్వం సేకరించింది. పరిశ్రమల ఏర్పాటుకు అన్ని అనుమతులూ సిద్ధ చేసింది. అయితే, ఇప్పుడు మంత్రులుగా ఉన్న అనేకమంది కాంగ్రెస్ నేతలు ఎన్నికల వేళ ఆయా ప్రాంతాల్లో పర్యటించి ఫార్మా వల్ల స్థానికుల బతుకులు భారమవుతాయని, పరిసరాలు విషతుల్యమవుతాయని ప్రచారం చేశారు. తమను గెలిపిస్తే ఫార్మాను రద్దు చేసి, భూములు వెనక్కి ఇప్పిస్తామని ఊదరగొట్టారు. ఇప్పుడు అదే నేతలు కొడంగల్‌లో ఫార్మా వద్దంటున్నవారిని అభివృద్ధి నిరోధకులుగా చిత్రీకరిస్తున్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక విధంగా, అధికారంలో ఉన్నప్పుడు మరో విధంగా వ్యవహరిస్తున్న కాంగ్రెస్ ద్వంద్వ వైఖరికి ఇది నిదర్శనం.
ఈ గ్రామాల్లోని ఎకరం భూమి కి ఇచ్చే పరిహారంతో వేరే ప్రాంతంలో పావు ఎకరం కూడా రాదు. మరేం చేయాలి. ఒక పక్క భయపెడుతున్న అధికారులు, మరోపక్క భూములు ఇవ్వాల్సిందేనని, లేకపోతే గుంజుకుంటామని కాంగ్రెస్ నేతల ప్రచారాలు.. వెరసి ఆ ఐదు గ్రామాల ప్రజలకు తమ భవిష్యత్తు అంధకారంగా కనిపించింది.
కొడంగల్ నియోజకవర్గం, దుద్యాల మండలం లోని హకీంపేట్, పోలేపల్లి, లగచర్ల, రోటిబండతండా, పులిచర్లకుంట తండాల పరిధిలో సుమారు 1375 ఎకరాలకు పైగా భూ సేకరణ జరిపి ఫార్మా విలేజ్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం సన్నాహాలు చేయడంతో అగ్గి రాజుకుంది. దాదాపు పది నెలల నుంచి ఆయా గ్రామాల రైతులు రిలే నిరాహార దీక్ష లు చేస్తున్నారు. ఆర్డీవోతో పాటు ఇతర ఉన్నతాధికారులకు వినతిపత్రాలు ఇచ్చారు.
తాము భూములు ఇచ్చేది లేదని, అభిప్రాయ సేకరణ పేరిట తమ గ్రామాలకు రావొద్దని వారు ఎప్పటినుంచో స్పష్టం చేస్తున్నారు. చెప్పినట్టే కొన్నిచోట్ల ఈ కార్యక్రమాలను బహిష్కరించారు. భూములు ఇచ్చేందుకు నిరాకరిస్తున్న గిరిజనులు అందుకు సహేతుకమైన కారణాలు చెప్తున్నారు. తమకు వ్యవసాయం తప్ప మరొకటి తెలియదని.. పరిశ్రమలు వచ్చినా తాము పెద్దగా చదువుకోలేదు కాబట్టి, ఉపాధి దొరకదని.. ప్రభుత్వం ఇస్తానంటున్న పరిహారం మార్కెట్ రేటుతో పోలిస్తే పది నుంచి ఇరవై శాతమే ఉందని వారు అంటున్నారు.
ఈ గ్రామాల్లోని ఎకరం భూమి కి ఇచ్చే పరిహారంతో వేరే ప్రాంతంలో పావు ఎకరం కూడా రాదు. మరేం చేయాలి. ఒక పక్క భయపెడుతున్న అధికారులు, మరోపక్క భూములు ఇవ్వాల్సిందేనని, లేకపోతే గుంజుకుంటామని కాంగ్రెస్ నాయకులు చేస్తున్న ప్రచారాలు.. వెరసి ఆ ఐదు గ్రామాల ప్రజలకు తమ భవిష్యత్తు అంధకారంగా కనిపించింది. ఇక్కడే ప్రభుత్వం పొరపాటు చేసింది. పరిహారం పెంచి, వారికి ఏదో ఒక విధంగా లాభం కల్పిస్తామని నచ్చచెప్పాల్సిందిపోయి.. అధికార మదాన్ని చూపించి వారి భూములను ప్రభుత్వం లాక్కునే ప్రయత్నం చేసింది. ఈ నేపథ్యంలో తప్పనిసరై రైతులు తిరగబడ్డారు. వారి ఆవేదన ఆవేశంగా మారి విచక్షణ కోల్పోయేలా చేసింది.
ఫార్మాకు భూములు ఇవ్వాల్సిందేనని, ఇవ్వకున్నా తీసుకుంటామని బెదిరించిన దుద్యాల మండల కాంగ్రెస్ అధ్యక్షుడు శేఖర్‌ను గిరిజన రైతులు తరిమి తరిమికొట్టారు. అతికష్టం మీద అక్కడి నుంచి అతన్ని పోలీసులు తీసుకెళ్లారు. ఆయనపై దాడిచేసిన వారిలో రాజకీయ నాయకులు ఎవరూ లేరు, బాధిత రైతులు తప్ప. అయినప్పటికీ ప్రభుత్వం తన తీరును మార్చుకోలేదు. మళ్లీ మళ్లీ అధికారులు, కాంగ్రెస్ నేతలను ఆయా గ్రామాలను పంపించి రైతులను భయపెడుతూనే ఉన్నది. ఈ నేపథ్యంలో తమకు జీవనాధారమైన భూములను బలవంతంగా గుంజుకుంటారేమోనని వారు ఆందో ళనకు గురవడంతో తాజా దాడులు జరిగాయి.
అధికారులపై రైతులు దాడి చేయడం తప్పే. కానీ, అదే రోజు రాత్రి ప్రభుత్వం, పోలీసులు చేసిందేమిటి? ఇంటర్నెట్, ఫోన్ సిగ్నల్స్ బంద్ చేసి, కరెంటు తీసేసి ఇల్లిల్లూ సోదా చేసి మహిళలు వద్దని వారిస్తున్నా, చిన్న పిల్లల్లు భయపడి ఏడుస్తున్నా దొరికినవారిని దొరికినట్టు అక్రమంగా అరెస్టు చేయడం సమంజసమేనా? ఈడ్చుకుంటూ తీసుకెళ్లడానికి, ఇష్టమొచ్చినట్టు కొట్టడానికి వారేమైనా సంఘవిద్రోహ శక్తులా? రైతుల పట్ల ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును ప్రజాసంఘాలు ఖండించాయి.
సొంత నియోజకవర్గంలో ఇంత జరుగుతున్నా సీఎం స్పందించకపోవడం విడ్డూరం. గిరిజన రైతు ల రైతుల్లో నెలకొన్న భయాన్ని తొలగించాల్సిన ప్రభుత్వమే వారిని మరింతగా భయాందోళనకు గురిచేస్తున్నది. వారితో మాట్లాడి ఒప్పించాల్సిన ప్రజాప్రతినిధులు, అధికారులు ఆ దిశగా కనీస ప్రయత్నం చేయలేదు, చేయడం లేదు కూడా. ఈ ఉదంతం తర్వాత కూడా కాంగ్రెస్ నేతలు మారడం లేదు. భూములు లాక్కొని తీరుతామని స్వయంగా సీఎం సోదరుడు తిరుపతిరెడ్డి రైతులను హెచ్చరిస్తు న్నారు. ఇలా వ్యవహరించడం ఎంతవరకు సబ బు? మొన్న అశోక్‌నగర్.. నిన్న మూసీ, నేడు లగచర్ల.. రేపు మరో ప్రాంతం. అనుభవాల నుంచి పాలకులు పాఠాలు నేర్చుకోకపోతే.. గుణపాఠం నేర్పడం కూడా ప్రజలకు తెలుసు. గతంలో అనేకసార్లు ఇది నిరూపితమైంది. 11 నెలల్లో ఏ కోల్పోయామో తెలుసుకున్న ప్రజలకు తిరిగి వాటిని ఎలా సాధించుకోవాలో కూడా బాగా తెలుసు.
– రమేశ్చంద్ర