ప్రజాస్వామ్యం అంటేనే ప్రజాభీష్టం ప్రకారం పరిపాలన సాగాలనేది అసలు ఉద్దేశం. కానీ ప్రజల ఓటు ద్వారానే అధికారంలోకి వచ్చి ఆ తర్వాత నిరంకుశాధికారం చెలాయిస్తే? ‘నేనే రాజు, నేనే మంత్రి’ అన్నట్టుగా నియంతృత్వం అమలు చేస్తే? అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇష్టారాజ్య పాలనతో దేశాన్ని సంక్షోభంలోకి నెట్టేశారనేది అక్కడి ప్రజల్లో ప్రబలంగా వ్యక్తమవుతున్న అభిప్రాయం. ప్రపంచవ్యాప్తంగానూ ఈరకం అభిప్రాయమే ఉన్నట్టు తెలుస్తూనే ఉన్నది. ఈ పరిస్థితుల్లో ప్రపంచంలో అతిగొప్ప ప్రజాస్వామ్యమని చెప్పుకొనే అగ్రరాజ్యం ఇపుడు అతిపెద్ద నిరసనోద్యమంతో అట్టుడుకుతున్నది.
ప్రజాస్వామ్యం ముసుగులో ట్రంప్ రాజరిక తరహా పాలన సాగిస్తున్నారంటూ ఆందోళనకారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అందుకు తగ్గట్టుగా ఈ ఆందోళనకు ‘నో కింగ్స్’ అనే పేరు పెట్టడం గమనార్హం. దేశవ్యాప్తంగా 50 రాష్ర్టాల్లో, మూడువేల పైచిలుకు నగరాలు, పట్టణాలు ట్రంప్ వ్యతిరేక నినాదాలతో దద్దరిల్లాయి. లక్షలాది మంది వీధుల్లోకి వచ్చి ట్రంప్ పాలన పట్ల, మరీ ముఖ్యంగా ఇరాన్ను యుద్ధంలోకి దించిన దుందుడుకు, దుస్సాహసిక నిర్ణయాల పట్ల ఏవగింపు ప్రకటించారు. అమెరికా రాజకీయ, సాంస్కృతిక, క్రీడా తదితర రంగాలకు చెందిన ప్రముఖులు సైతం ఈ ఆందోళనలో ప్రజలతో కలిసి కదం తొక్కడం చరిత్రాత్మకం.
ట్రంప్ రెండో విడత అధికారం చేపట్టిన తర్వాత యూనివర్సిటీ ప్రాంగణాల్లో భారీ స్థాయిలో నిరసనలు చోటుచేసుకోవడం తెలిసిందే. అదేవిధంగా ‘నో కింగ్స్’ ర్యాలీలూ రెండుసార్లు జరిగాయి. అయితే దేశవ్యాప్తంగా లక్షల సంఖ్యలో ప్రజలు వీధుల్లోకి రావడం ఇదే ప్రథమం అని చెప్పాలి. నిజానికి ఈ ఆందోళన అమెరికాకే పరిమితం కాలేదు. దక్షిణ అమెరికా, యూరప్ దేశాల్లోనూ ప్రజలు పెద్దఎత్తున ‘నో కింగ్స్’ ర్యాలీల్లో పాల్గొని అమెరికా ప్రజలకు సంఘీభావం తెలుపడం విశేషం. బయటిదేశాల్లో తమ అగ్రరాజ్యం జోక్యాన్ని తగ్గిస్తానని, యుద్ధాలు నివారిస్తానని చెప్పి అధికారంలోకి వచ్చిన ట్రంప్ అందుకు పూర్తి విరుద్ధమైన విధానాలు అమలు చేస్తుండటం విడ్డూరం.
భారత్-పాక్ ఘర్షణతో సహా పలు యుద్ధాలను తానే ఆపానని చెప్పుకొంటూ నోబెల్ శాంతి బహుమతిని డిమాండ్ చేసి నవ్వులపాలు కావడం తెలిసిందే. ఇదే ‘శాంతి కాముకుడు’ వెనెజువెలాపై దండెత్తి ఆ దేశాధ్యక్షుడిని బంధించి అమెరికాకు తీసుకువచ్చారు. ఇప్పుడు ఏకంగా ఇరాన్ వంటి శక్తివంతమైన దేశంపై అకారణంగా యుద్ధానికి దిగి అమెరికాను ఏకాకిని చేశారు. ఓవైపు ప్రపంచ శాంతికి పెనుముప్పు తెచ్చిపెట్టి, మరోవైపు ఘోరమైన చమురు సంక్షోభానికి కారకుడయ్యారు. ఇరాన్ ఎదురుదాడులతో అమెరికా సైనిక ప్రతిష్ఠ దిగజారింది. హొర్ముజ్ జలసంధి దిగ్బంధనంతో పీటముడి పడింది.
ఈ యుద్ధం వల్ల అమెరికాకు కలిగే ప్రయోజనాలపై స్పష్టత లేకపోవడం కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నది. చర్చల పేరిట యుద్ధానికి విరామం ప్రకటించిన ట్రంప్ లోపల్లోపల భూతల యుద్ధానికి సన్నాహాలు చేస్తున్నారని సూచనలు వెలువడుతున్నాయి. ఇదే జరిగితే అమెరికా మెడకు మరో వియత్నాం యుద్ధం చుట్టుకుంటుందనే విశ్లేషణలు వెలువడుతున్నాయి. ఇజ్రాయెల్ ప్రయోజనాల కోసం అమెరికాను బలి చేస్తున్నారనే విమర్శలు హోరెత్తుతున్నాయి. రోజురోజుకూ తనను చుట్టుముడుతున్న ఎప్స్టీన్ ఫైల్స్ కేసు నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే ట్రంప్ ఈ యుద్ధం మొదలుపెట్టారనే అనుమానాలు ఎటూ ఉన్నాయి.
ఇంకోవైపు ట్రంప్ మానసిక సంతులనం కూడా వివాదాస్పదంగానే ఉన్నది. ‘నో కింగ్స్’ ర్యాలీలు హోరెత్తడానికి దారితీసిన నేపథ్యం ఇదీ. ట్రంప్ తన ‘కిరీటాన్ని’ తీసి పక్కన పెట్టాలని, ‘రెజీమ్ చేంజ్’ (ప్రభుత్వ మార్పు) స్వదేశంలోనే మొదటగా జరుగాలని డిమాండ్ చేయడం ద్వారా ఆందోళనకారులు కోరుకుంటున్నది ఏమిటో తెలుస్తూనే ఉన్నది. గోడమీద రాత స్పష్టంగానే ఉన్నది. దిద్దుబాటు చర్యలు చేపట్టడమో, దిగిపోవడమో చేసేందుకు బదులుగా ట్రంప్ ఆందోళనకారులపై విమర్శలకు దిగడం విడ్డూరం.