India | ప్యారిస్ ఒలింపిక్స్ క్రీడలు మన దేశానికి అనేక కారణాల వల్ల గుర్తుండిపోతాయి. ఒక్కటంటే ఒక్క స్వర్ణం రాలేదు. మను భాకర్ సిం గిల్స్ కాంస్యంతో శుభారంభం చేసినా ముగింపు నిరాశాజనకమే. మిక్స్డ్ షూటింగ్‌లోనూ సరబ్ జ్యోత్సింగ్తో కలిసి మను మరో కాంస్యం అందుకోవడంతో ట్యాలీ 3కు పెరిగింది. 50 మీటర్ల రైఫిల్ పోటీల్లో స్వప్నిల్ కూసళే కాంస్యం గెల్చుకోగా, హాకీ టీం కూడా కాంస్యంతోనే సరిపెట్టుకున్నది. కాకపోతే వరుసగా రెండు ఒలింపిక్స్‌లో హాకీ టీం పతకాలు గెలవడం విశేషం. 44 ఏండ్లుగా మన హాకీ జట్టుకు స్వర్ణం అందని ద్రాక్షగా ఉండిపోయింది. కుస్తీల్లో అమ న్ సెరావత్ కూడా కాంస్యం దగ్గరే ఆగిపోవాల్సి వచ్చింది. జావెలిన్ త్రోలో నీరజ్ రజతం గెల్చుకోవడం కొద్దిగా ఊరటనిచ్చింది. ఇదంతా ఒకె త్తు, రెజ్లర్ వినేశ్ ఫోగట్ ఉదంతం ఒకెత్తు.
స్వర్ణం సాధిస్తుందనుకున్న ఈ కుస్తీ యోధురాలు చివరి నిమిషంలో కేవలం వంద గ్రాముల అధిక బరువు కారణంగా పోటీకి అనర్హురాలు కావడం పెను విషాదం. దాంతో ఉవ్వెత్తున ఎగసిన ఆశలు ఒక్కసారిగా కుప్పకూలాయి. ఆ చేదు అనుభవం కారణంగా అంతర్జాతీయ పోటీల నుంచి రిటైర్మెంట్ తీసుకుంటున్నట్టు ఆమె ప్రకటించడం మరింత బాధాకరం. వినేశ్ బరువును చూసుకోవాల్సిన సహాయక బృందం వైఫల్యమే ఆమె బరువు సమస్యకు కారణమనే వాదన వినవస్తుండటం గమనార్హం. యావత్తు దేశం ఆమె ఆవేదనలో పాలుపంచుకున్నది. ఓటమితో వెనుదిరిగిన ఓ క్రీడాకారిణి స్ఫూర్తి అపూర్వ గౌరవాన్ని పొందడం చిన్న విషయం కాదు.
టోక్యోతో పోల్చితే పతకాలు తగ్గినా క్రీడాకారుల సామర్థ్యం మెరుగుపడిందనే ప్రశంసలు వస్తుండటం ముదావహం. అయినప్పటికీ అం తర్జాతీయ ప్రమాణాలు సాధించడంలో మనం వెనుకబడిపోయామనేది ఒప్పుకొని తీరాల్సిన వాస్తవం. 117 మందితో వెళ్లిన భారత ఒలింపిక్స్ టీం 6 పతకాలతోనే సరిపెట్టుకోవాల్సి రావడం మన దేశపు క్రీడా నాయకత్వం ఆలోచించాల్సిన విషయమే. ప్రభుత్వం, క్రీడా సం ఘాలు తమ విధానాలను, ఆచరణను లోతుగా సమీక్షించుకోవాల్సిన సందర్భం ఇది. భారత్‌కు పతకాలు రాకపోవడానికి అనేక కారణాలు కనిపిస్తాయి. అన్నిటికన్నా ముఖ్యంగా గత పదేండ్లుగా దేశాన్ని పాలిస్తున్న ఎన్డీయే సర్కారు క్రీడారంగంలో సాధించిన ప్రగతి ఏమిటనేది పెద్ద ప్రశ్న.
ప్రధాని మోదీ క్రీడాపోటీల విజేతలతో ఫొటోలు దిగేందుకు చూపే ఉత్సాహంలో కొంచెమైనా క్రీడల అభివృద్ధి పట్ల చూపకపోవడం విచారకరం. పైగా క్రీడారంగంలో రాజకీయ నేతల పెత్తనం అడుగడుగునా కనిపిస్తుంటుంది. అస్మదీయులను అందలమెక్కించడం, ప్రతిభావంతులను అణగదొక్కడమనే జాడ్యం భారత క్రీడారంగానికి శాపంగా మారింది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా కుమారుడు జైషా బీసీసీఐ కార్యదర్శిగా ఉండటం క్రీడల్లో బంధుప్రీతికి నిదర్శనం. అలాగే గతంలో బీజేపీ మాజీ ఎంపీ బ్రిజ్‌భూషణ్ శరణ్‌సింగ్ రెజ్లింగ్ సమాఖ్యలో తిష్టవేసుకుని కూర్చుని క్రీడాకారిణులను లైంగిక వేధింపులకు గురిచేయడంపై దుమారం చెలరేగింది. ఒలింపిక్స్‌లో స్వర్ణం దాకా వెళ్ల్లి ఆగిపోయిన వినేశ్ ఫోగట్ ఆయనపై సాగించిన పోరాటం తెలిసిందే.
ఇలాంటి సమస్యలే కాకుండా మోదీ సర్కారు క్రీడలకు కేటాయిస్తున్న నిధులు అరకొరగా ఉండటం మరో సమస్య. ప్రపంచ దేశాలు క్రీడలకు సగటున జీడీపీలో 0.5 శాతం కేటాయిస్తుంటే, భారత్ కేటాయించేది 0.1 శాతమే. మొన్నటి బడ్జెట్లో నిధులు పెంచిన తర్వాత ఆ స్థాయికి చేరింది. అరకొర నిధుల పర్యవసానంగా క్రీడలకు మౌలిక సదుపాయాలు, శిక్షణా కేంద్రాలు తగినస్థాయిలో లేకపోవడం, క్రీడా మనస్తత్వ, వైద్య శాస్ర్తాల్లో పురోగతి సాధించకపోవడం, ఆధునిక శిక్షణ వసతులు, శిక్షకులు అందుబాటులో ఉండకపోవడం వంటివి భారతీయ క్రీడారంగానికి శాపంలా పరిణమించాయి. వివిధ క్రీడలను ప్రోత్సహించడంలో సమతూకం పాటించకపోవడం కొట్టొచ్చినట్టు కనిపించే మరో లోపం. ఒలింపిక్స్ పతకాల్లో భారత్ పరిస్థితి నానాటికీ తీసికట్టు అవుతుండటంపై కేంద్ర సర్కారు దృష్టిపెట్టాలి. వ్యవస్థాపరమైన, నిర్వహణాపరమైన లోపాలను చిత్తశుద్ధితో సవరించాలి. లేకపోతే అత్యధిక జనాభా కలిగిన దేశం అతితక్కువ పతకాలతో సరిపెట్టుకోవాల్సిన దుస్థితి పదేపదే ఎదురవుతూనే ఉంటుంది.