2009 విద్యాహక్కు చట్టాన్ని సవరించిన కేంద్రప్రభుత్వం ఇప్పటివరకు అమల్లో ఉన్న ‘నో డిటెన్షన్’ విధానాన్ని రద్దు చేసింది. తద్వారా 5వ, 8వ తరగతి విద్యార్థులకు డిటెన్షన్ విధానం అమల్లోకి వచ్చింది. టీఆర్ సుబ్రమణియన్ నేతృత్వంలోని కమిటీ సూచనల మేరకు 2018లో విద్యాహక్కు చట్టంలో చేసిన సవరణలను పార్లమెంట్ ఆమోదించింది. ఇటీవల సంబంధిత ఉత్తర్వులను కేంద్ర ప్రభుత్వం జారీచేసింది. దీంతో కేంద్రప్రభుత్వం ఆధ్వర్యంలోని కేంద్రీయ విద్యాలయాలు, నవోదయ, సైనిక పాఠశాలల్లో వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఈ విధానం అమల్లోకి రానున్నది.
Detention | దేశంలోని 16 రాష్ర్టాలు, రెండు కేంద్రపాలిత ప్రాంతాల్లో ఇప్పటికే డిటెన్షన్ విధానం అమల్లో ఉంది. ఉభయ తెలుగు రాష్ర్టాల్లో మాత్రం నో డిటెన్షన్ విధానం కొనసాగుతున్నది. కొన్ని రాష్ర్టాలు ఏ నిర్ణయమూ తీసుకోలేదు. 2009 నాటి విద్యాహక్కు చట్టం ప్రకారం 1-8వ తరగతి వరకు నో డిటెన్షన్ విధానం అమల్లో ఉంటుంది. దీని ప్రకారం పరీక్షల్లో ఉత్తీర్ణతతో సంబంధం లేకుండా పై తరగతులకు ప్రమోట్ చేస్తారు. నో డిటెన్షన్ విధానం వల్ల పాఠశాలల్లో విద్యార్థుల ఎన్రోల్మెంట్ గణనీయంగా పెరిగింది. డ్రాపౌట్ రేటు తగ్గి, ఉన్నత పాఠశాల స్థాయికి వచ్చే విద్యార్థినుల సంఖ్య పెరిగింది. పిల్లల్లో పరీక్షల పట్ల భయం పోయింది. కానీ, విద్యార్థులు వివిధ తరగతులకు తగ్గట్టుగా సామర్థ్యం సాధించడం లేదని నేషనల్ అచీవ్మెంట్ సర్వే (ఎన్ఏఎస్), అసెర్ నివేదికలు తేల్చిచెబుతున్నాయి. అంతేకాదు, విద్యార్థుల్లో అభ్యసన పట్ల శ్రద్ధ తగ్గిందని, ఫలితాలకు ప్రాధాన్యం లేకపోవడం వల్ల ఉపాధ్యాయులు బోధనపై దృష్టి సారించడం లేదని విమర్శకుల వాదన.
నూతన విధానం ప్రకారం 5వ, 8వ తరగతి విద్యార్థులు వార్షిక పరీక్షల్లో కచ్చితంగా ఉత్తీర్ణులు కావాలి. ఉత్తీర్ణత సాధించనివారికి రెండు నెలల పాటు శిక్షణ ఇచ్చి మళ్లీ పరీక్ష నిర్వహిస్తారు. రెండవసారి కూడా ఉత్తీర్ణత సాధించకుంటే అదే తరగతిలో కొనసాగిస్తారు. కానీ, 8వ తరగతి పూర్తి చేయకుండా ఏ విద్యార్థినిని బడిలో నుంచి తొలగించకూడదని గెజిట్లో కేంద్రప్రభుత్వం పేర్కొన్నది. అయితే, డిటెన్షన్ విధానం తిరోగమన చర్య అని విద్యావేత్తలు అభిప్రాయపడుతున్నారు. ఆర్థికంగా, సామాజికంగా వెనుకబడిన వర్గాల విద్యార్థులు ప్రాథమిక విద్యకూ దూరమయ్యే అవకాశం ఉన్నదని వారు విమర్శిస్తున్నారు. డిటెన్షన్ విధానం వల్ల పిల్లల్లో పరీక్షల పట్ల భయం పెరిగే అవకాశముంది. ఫెయిలైన విద్యార్థులు బడికి దూరమయ్యే ప్రమాదం లేకపోలేదు. మళ్లీ అదే తరగతి చదవాల్సిరావడం వారిలో నిరాసక్తతను పెంచుతుంది. తద్వారా బాలకార్మికులు పెరిగే ప్రమాదం ఉన్నది.
ఈ నేపథ్యంలో నో డిటెన్షన్ విధానంలో ఉన్న లోపాలను అధిగమించేందుకు విద్యావ్యవస్థలో అవసరమైన మార్పులు తీసుకురావాలి. పర్యవేక్షణ పెంచాలి. అభ్యసనలో వెనుకబడిన విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహించాలి. పరీక్షా విధానంలో సంస్కరణలు తీసుకురావాలి. అందుకు విరుద్ధంగా డిటెన్షన్ ద్వారా అవరోధాలు సృష్టిస్తే అసలుకే ఎసరు వస్తుంది. ఈ నేపథ్యంలో డిటెన్షన్ విధానాన్ని కేంద్ర ప్రభుత్వం పునఃసమీక్షించాలి.
– డాక్టర్ ఎ.వేణుగోపాల రెడ్డి 99481 06198